అధికార వైసీపీకి గ్రాడ్యుయేట్స్ షాక్ ఇచ్చారా? మూడు గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గ స్థానాల్లో మూడింటిలో అధికార వైసీపీ ఓటమి పాలయ్యింది. దీనితో ఓటమికి కారణాలను విశ్లేషించుకునే పనిలో పడింది వైసీపీ. మొదటి సారి టీచర్, గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాల్లో బరిలో నిలబడిన అధికార వైసీపీకి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఉపాధ్యాయులు వైసీపీ పట్టం కట్టినా గ్రాడ్యుయేట్స్ మాత్రం షాక్ ఇచ్చారు. రెండు టీచర్, మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో రెండు టీచర్ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. పీఆర్సీ, పెండింగ్ డీఏలు, బకాయిలు వంటి పలు కారణాలతో ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత చూపిస్తూ వస్తున్నాయి. దీనితో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని కసరత్తు చేసింది. ప్రభుత్వ టీచర్లను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తూనే ప్రైవేటు టీచర్ల ఓట్లు కూడా తమ ఖాతాలో పడేటట్లు చేసుకుంది. ఈ కసరత్తును విజయవంతంగా పూర్తి చేయగలిగిన వైసీపీ …గ్రాడ్యుయేట్స్ విషయంలో మాత్రం చతికిల పడింది.
Read Also: Amritpal Singh: 100 కార్లు, గంట పాటు ఛేజ్.. ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్‌పాల్ సింగ్ అరెస్ట్..
ముఖ్యంగా విశాఖను పాలనా రాజధానిగా చేస్తామని ప్రకటించిన వైసీపీకి ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ అభ్యర్ధి గెలుపు కీలకమైందే. కానీ వైసీపీ అభ్యర్ధి సీతంరాజు సుధాకర్ టీడీపీ అభ్యర్ధి చిరంజీవి చేతిలో ఘోరంగా ఓటమి చవి చూశారు. అటు తూర్పు రాయలసీమలోనూ ఇదే రకమైన ఫలితాలు వచ్చాయి. దీనితో ఓటమికి గల కారణాలను విశ్లేషించుకునే పనిలో వైసీపీ పడింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి కూడా టీచర్ రిక్రూమెంట్ పరీక్ష డీఎస్సీ నిర్వహించకపోవటం, కొన్ని ఉపాధ్యాయ సంఘాలు టీడీపీ అభ్యర్ధికి మద్దతుగా నిలబడటం, క్షేత్ర స్థాయిలో టీడీపీ- పీడీఎఫ్ అవగాహనకు రావటం, గ్రాడ్యుయేట్ల ఓట్లను తమ వైపుకు ఆకర్షించటంలో వైసీపీ నేతలు విఫలమవటం …వంటివి కారణాలుగా వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.
అయితే గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటర్ల సంఖ్య చాలా తక్కువ అని… సాధారణ ఎన్నికలతో ఈ ఫలితాలు పోల్చి చూడటం కరెక్ట్ కాదని అంటున్నారు సజ్జల. అయితే ఈ ఓటమి ఎన్నికల ఏడాదిలో ఒక హెచ్చరిక లాంటిది అని పార్టీ వర్గాలు అంతర్గతంగా భావిస్తున్నాయి. తాజా ఫలితాలతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. జగన్ అడ్డాలాంటి చోట కూడా టీడీపీ జెండా రెపరెపలాడిందని, మారుతున్న రాజకీయ ముఖచిత్రానికి ఇది నిదర్శనం అని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.
Read Also: John Wick: యాక్షన్ మూవీ నటుడి మృతి…