మొన్నటికి మొన్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డ వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి.. మరోసారి వారిని టార్గెట్ చేశారు.. కర్నూలు జిల్లా మంత్రాలయంలో మూడు రాజధానుల వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.. ఆ తర్వాత రాఘవేంద్ర సర్కిల్‌లో ధర్నా జరిగింది.. ధర్నాను ఉద్దేశించిన మాట్లాడిన బాలనాగిరెడ్డి.. రైతుల ముసుగులో బయటి వ్యక్తులను ఆర్టీసీ బస్సుల్లో రప్పించి రోజుకు రూ. 500 కూలి ఇచ్చి అమరావతి రాజధాని కావాలని చంద్రబాబు ధర్నా చేయిస్తున్నాడని విమర్శించారు.. ఇక, నారా లోకేష్, పవన్ కల్యాణ్ ప్రస్తావన తెచ్చిన ఆయన.. చంద్రబాబుకు ఇప్పుడు నార లోకేష్ పుత్రుడు కాదని, పవన్ కల్యాణ్‌నే దత్తత తీసుకోవాలని అనుకుంటున్నాడంటూ ఎద్దేవా చేశారు..
Read Also: Masks no more compulsory: ఊపిరి పీల్చుకోండి.. ఇక మాస్క్ తప్పనిసరి కాదు..!
ఇక, పవన్ కల్యాణ్ సినిమాల్లో మాదిరిగా ప్రజల్లో నటిస్తే ప్రజలు నమ్మరని ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని ముఖ్యమంత్రిని చేసేందుకే పవన్ కల్యాణ్ పోరాటం చేస్తున్నారని ఆరోపణలు గుప్పించిన ఆయన.. పవన్ కల్యాణ్ జీవితంలో ముఖ్యమంత్రి కాలేరని జోస్యం చెప్పారు.. ఇక, త్వరలో జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు, పవన్ కల్యాణ్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.. 2024లో మరోసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడమే కాకుండా.. సంక్షేమ పథకాలు యథావిథిగా కొనసాగిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. జగనన్న కాలనీల్లో కొనసాగుతున్న ఇళ్ల నిర్మాణ పనులను చూసి ఓర్వలేకనే జనసేన నాయకులు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని బాలనాగిరెడ్డి మండిపడిన విషయం విదితమే. మరోవైపు, అగసలదిన్నె గ్రామంలో ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి.. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని, లేకపోతే వెళ్లిపోవాలని హెచ్చరించారు.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా అందుతున్నాయో ఇంటింటికి వెళ్లి అడిగి తెలుసుకున్నారు.. రేషన్ కార్డు సమస్య, అర్హులైన కూడా పింఛన్లు అందడం లేదని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. వీఆర్‌వో, వాలంటీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేయడం తగదని హితవుపలికారు.. ఒకరిపై ఒకరు చెప్పడం కాదు.. పనిచేసే చూపించాలని, లేకపోతే వెళ్లిపోండని వార్నింగ్ ఇచ్చారు.. ఇలాంటివి మళ్లీ జరిగితే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి.