Pulivendula Election Results: 43 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. పులివెందులలో ఎగిరిన టీడీపీ జెండా..

Pulivendula Election Result

Pulivendula Election Result

Pulivendula Election Results: మున్సిపల్ ఎన్నికల్లో కడప జిల్లాలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సత్తా చాటింది. జిల్లాలోని మున్సిపాలిటీల్లో కూటమి ఆధిపత్యం ప్రదర్శించగా, వైసీపీ ఎక్కడా చెప్పుకోదగ్గ ఆధిక్యత కనబరచలేకపోయింది. నామినేషన్ల ప్రక్రియలోనే ఆరు మున్సిపాలిటీలను కూటమి కైవసం చేసుకోగా, జమ్మలమడుగు, పులివెందుల మున్సిపాలిటీల్లో టీడీపీ ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా పులివెందుల మున్సిపాలిటీలో టీడీపీ విజయం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. 43 ఏళ్ల టీడీపీ చరిత్రలో ఇప్పటివరకు పులివెందులలో ఆ పార్టీ గెలుపొందలేదు. తొలిసారిగా కూటమి విజయం సాధించడంతో టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు..

పులివెందుల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసిన టీడీపీకి చెందిన తూగుట్ల గీతా కుమారి 13,898 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి వైఎస్ ప్రమీల ఓటమి పాలయ్యారు. దీంతో ‘వై నాట్ పులివెందుల’ నినాదం కూటమి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపినట్టు అయ్యింది.. అయితే, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రతినిథ్యం వహిస్తోన్న పులివెందులలో వైసీపీ ఓటమి చెందడంతో ఆ పార్టీకి షాక్‌ తగిలినట్టు అయ్యింది..