Steel Plant Accident : ఇవాళ విశాఖకు వైఎస్ జగన్.. షెడ్యూల్ ఇలా..!

  • స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను కలవనున్న జగన్
  • సెవెన్ హిల్స్, కిమ్స్ ఐకాన్ ఆసుపత్రుల్లో పరామర్శ
  • బాధిత కుటుంబాలకు వైసీపీ అండపై భరోసా
  • ఉదయం నుంచి సాయంత్రం వరకు జగన్ పూర్తి షెడ్యూల్
Ysjagan

Ysjagan

Steel Plant Accident : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాద బాధితులను, మరణించిన కార్మికుల కుటుంబాలను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబ సభ్యులను స్వయంగా కలిసి, వారికి పార్టీ అండగా ఉంటుందనే నమ్మకాన్ని కల్పించనున్నారు. అదేవిధంగా నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కలిసి ధైర్యం చెప్పనున్నారు. ఈ పర్యటన సందర్భంగా బాధితులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్స్ గ్రేషియా ప్రకటించే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి పార్టీ శ్రేణులు విశాఖలో అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశాయి.

వైఎస్ జగన్ పర్యటన ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని ఆయన నివాసం నుండి ప్రారంభమవుతుంది. అక్కడి నుండి రోడ్డు మార్గాన గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, ప్రత్యేక విమానంలో ఉదయం 11:20 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు వస్తారు. విమానాశ్రయం నుండి నేరుగా రాంనగర్‌లోని సెవెన్ హిల్స్ ఆసుపత్రికి ఉదయం 11:40 గంటలకు చేరుకుని, అక్కడ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1:10 గంటలకు అక్కడి నుండి బయలుదేరి, మధ్యాహ్నం 1:50 గంటలకు షీలానగర్‌లోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి వెళ్తారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటారు.

×
×
Ad

ఆసుపత్రుల సందర్శన ముగించుకుని మధ్యాహ్నం 2:20 గంటలకు బయలుదేరి 2:30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2:45 గంటలకు విశాఖ నుండి ప్రత్యేక విమానంలో తిరుగుపయనమై, మధ్యాహ్నం 3:35 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన ప్రయాణించి సాయంత్రం 4:30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోవడంతో వైఎస్ జగన్ విశాఖ పర్యటన ముగుస్తుంది.