Site icon NTV Telugu

YS Jagan: పండుగలా ఉండాల్సిన వ్యవసాయం.. చంద్రబాబు హయాంలో దండుగలా మారింది!

Ys Jagan Press Meet

Ys Jagan Press Meet

రైతుల పరిస్థితి చూస్తుంటే సేవ్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా ఉందని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విమర్శించారు. ఏ ప్రభుత్వమైనా రైతులను సంతోష పెట్టాలని, రైతు సంతోషంగా ఉంటేనే రాజ్యం సంతోషంగా ఉంటుందన్నారు. పండుగలా ఉండాల్సిన వ్యవసాయం సీఎం చంద్రబాబు హయాంలో దండుగలా మారిందని ఎద్దేవా చేశారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన ఒక్క రైతుకూ పైసా పరిహారం రాలేదని వైఎస్ జగన్ మండిపడ్డారు. తాజా రాజకీయ పరిణామాలు, రైతాంగ సమస్యలపై ఈరోజు జగన్ ప్రెస్‌మీట్ పెట్టారు.

‘గత ఏడాది ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టపోయారు. ఈ ఏడాది కూడా తుఫానుకు నష్టపోయిన రైతుల ధాన్యం కొనేవాళ్ళు లేరు. దళారులు తమకు ఇష్టం వచ్చిన రేట్లకు అడుగుతున్నారు. దిత్వా తుఫాను పంట చేతికొచ్చే దశలో వస్తుందని 10 రోజుల ముందే తెలుసు. ఈ పంట కొనకుంటే ధాన్యం తడిసిపోతుంది అని తెలుసు. అన్నీ తెలిసినా సీఎం చంద్రబాబు చోద్యం చూస్తున్నారు తప్ప ఏమీ చేయటం లేదు. మా ప్రభుత్వ హయాంలో ఇలాంటి సమయాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు చేసే వాళ్ళం, అన్నీ పనులు జరిగిపోయేవి. ఇవాళ రైతులు ఎలా పోయినా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఏ పంటకు రేట్లు లేవు, కేజీ అరటి అర్థ రూపాయి అంటే రైతులు ఎలా బ్రతుకుతారు. ఇంత ఘోరంగా పాలన చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. చీనీ రైతుల కోసం ప్రత్యేక రైళ్లు నడిపి పంట ఎగుమతి చేశాం. దళారులు లేరు, రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చాయి. రైతులకు 20 నుంచి 40 శాతం వరకు రేట్లు పెరిగాయి. చంద్రబాబు ఏం చేస్తున్నాడు.. నిద్ర పోతున్నాడా?. ముఖ్యమంత్రిని చేసింది గాడిదలు కాయడానికి కాదు కదా. రైతులను పట్టించుకోవాలి కదా. మా హాయంలో పులివెందులలో ప్రారంభించిన కోల్డ్ స్టోరేజ్ మూసేసారు. రైతులకు ఇచ్చిన హామీలు మోసపూరితమని అర్థమైంది’ అని జగన్ మండిపడ్డారు.

‘ఆర్బీకేల్లో ఏ పంటకు గిట్టుబాటు ధర ఎంత అని బోర్డులు పెట్టాం. రైతులకు గిట్టుబాటు ధరలు లేకుంటే నేరుగా జాయింట్ కలెక్టర్లు రంగంలోకి దిగేవాళ్లు. మార్క్ ఫెడ్ ద్వారా మంచి రేటు ఇచ్చేవాళ్ళం. రైతుకు ఏమీ చేయకుండా రైతన్నా మీకోసం అంటున్న చంద్రబాబు.. రైతుల దగ్గరకు వెళ్తే కొట్టే రోజులు వస్తాయి. చంద్రబాబు అనే వ్యక్తి రైతుల కోసం ఏ రోజైనా నిలబడ్డాడా?. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఇచ్చేసాం అంటున్నారు.. నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడుతూ అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు. సూపర్ సిక్స్ లో అసలు ఏం చేశారో చెప్పాలి. సూపర్ సిక్స్.. సూపర్ హిట్ అని తడుముకోకుండా చెప్పేస్తున్నారు. గోపాలపురం సభలో సూపర్ సిక్స్ అన్నీ చేసేసాం అని చెప్పారు. వీళ్లను చూసి గోబెల్స్ ప్రచారం ఎలాగో నేర్చుకోవాలి. చంద్రబాబు గోబెల్స్ కు టీచర్. ఎన్నికల ముందు ఓట్ల కోసం ఒక సూపర్ సిక్స్ అన్నాడు. నిరుద్యోగ భృతి కింద నెలనెల మూడు వేలు ఇస్తా అన్నారు.. రెండేళ్లకు 72 వేలు ఇవ్వాలి. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన మహిళకు నెలనెలా 1500 అన్నారు.. ఇప్పటి వరకు ఇచ్చారా?. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లకు 50 ఏళ్లకు పెన్షన్ అన్నారు ఇచ్చారా. అన్నదాత సుఖీభవ కింద రెండేళ్లకు 40 వేలకు గానూ 10 వేలు మాత్రమే ఇచ్చారు. తల్లికి వందనం మొదటి సంవత్సరం ఎగ్గొట్టారు. రెండవ ఏడాది 20 లక్షల మందికి తగ్గించారు. ఒక్కొక్కరికీ ఒక్కోలా ఇవ్వటం మోసం కాదా. ఏడాదికి మూడు సిలిండర్లు అన్నారు.. రెండేళ్లకు ఆరు ఇచ్చింది ఒకటో.. రెండో. మహిళలకు ఉచిత బస్సు అన్నారు.. అందరికీ ఇస్తున్నారా. ఇలాంటి 420 పనులు చేస్తున్న చంద్రబాబును బొక్కలో వెయ్యాలి కదా?’ అని జగన్ ప్రశ్నించారు.

Exit mobile version