YS Jagan : రాజధాని ప్రాంతంలో వైసీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలపై జరిగిన దాడి ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా సీఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. “చంద్రబాబు గారు.. మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? లేక గూండాల రాజ్యం నడుపుతున్నారా?” అంటూ ఘాటుగా ప్రశ్నించారు. రాజధాని ప్రాంత రైతుల ఆహ్వానం మేరకు సీఆర్డీయే (CRDA) పరిరక్షణ కమిటీతో కలిసి వెళ్తున్న వైసీపీ నేతలపై పట్టపగలే దాడులు చేయించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ధ్వజమెత్తారు.
అవినీతి, దౌర్జన్యాలు బయటకు రాకూడదనే ఈ దాడులు
అమరావతి పేరుతో ప్రభుత్వం చేస్తున్న అవినీతి, దోపిడీ, రైతులపై సాగిస్తున్న దౌర్జన్యాలు ఎక్కడ బయటకు వస్తాయోననే భయంతోనే చంద్రబాబు స్వయంగా ఈ దాడులను ఉసిగొల్పారని వైఎస్ జగన్ ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసుల తీరును కూడా ఆయన తప్పుపట్టారు. “పోలీసులు ఉన్నది ప్రజలకు భద్రత కల్పించడానికా? లేక అధికార పార్టీ అరాచకాలకు కాపలా కాయడానికా?” అని ప్రశ్నించారు. ఒకటి రెండు చోట్ల పోలీస్ అధికారులే దగ్గరుండి ఈ దాడులను కో-ఆర్డినేట్ చేయడం అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు ఇవ్వని రైతులను భూసేకరణ నోటీసులతో వేధించడం, వారి పొలాలకు వెళ్లే దారులను ధ్వంసం చేయడం, అక్రమంగా మట్టి తవ్వి దోపిడీ చేయడం లాంటి దారుణాలు అమరావతిలో సాగుతున్నాయని జగన్ పేర్కొన్నారు.
రైతులను నరకయాతనకు గురిచేస్తున్నారు
కొండవీటి వాగు నీటిని బలవంతంగా రైతుల భూముల్లోకి మళ్లించి, వారికి గత్యంతరం లేని పరిస్థితులు కల్పిస్తున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. రైతుల అనుమతి లేకుండానే వారి పొలాలను రిటర్నబుల్ ప్లాట్ల కింద బలవంతంగా రిజిస్ట్రేషన్లు చేయిస్తూ నరకయాతన పెడుతున్నారని మండిపడ్డారు. బాధితుల గోడు వింటూ, వారికి భరోసా ఇచ్చేందుకు వైసీపీ నేతలు వెళ్తే రౌడీయిజం చేయిస్తారా అని నిలదీశారు. అమరావతి పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు తీసుకున్నారని.. ఇంకా ఎవరి కోసం, ఎందుకు భూములు కావాలని, మీ బినామీలకు, పచ్చ ముఠా నాయకులకు భూములు పంచడానికే రైతులను నాశనం చేస్తున్నారా అని రైతులు అడుగుతున్న ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజలు క్షమించరు.. కూకటివేళ్లతో పెకలించడం ఖాయం!
చంద్రబాబు తన అవినీతి, దోపిడీ కోసం రాష్ట్రంలో ‘జంగిల్ రాజ్యాన్ని’ స్థాపించారని వైఎస్ జగన్ దుయ్యబట్టారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగంతో పచ్చముఠాలతో స్వైరవిహారం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా గొంతుకలను అణచివేసేలా సాగుతున్న ఈ దుష్ట సంప్రదాయానికి రేపు రెట్టింపు స్పందన ఉంటుందని, ప్రజలు ఈ దుర్మార్గాలను క్షమించరని హెచ్చరించారు. భవిష్యత్తులో ఈ ప్రభుత్వాన్ని ప్రజలు కూకటివేళ్లతో పెకలించడం ఖాయమన్నారు. కూటమి ప్రభుత్వం చేసే దాడులకు వైయస్సార్‌సీపీ ఎట్టిపరిస్థితుల్లోనూ తలవంచదని.. అమరావతి పేరుతో జరుగుతున్న అవినీతిని, దౌర్జన్యాలను ఎప్పటికప్పుడు ఎండగడతామని స్పష్టం చేశారు. బాధితులు, రైతులు ఎప్పుడూ ఒంటరివాళ్లు కారని, వైసీపీ ఎల్లప్పుడూ వారికి తోడుగా నిలబడుతుందని వైఎస్ జగన్ పునరుద్ఘాటించారు.

