Site icon NTV Telugu

Vijaya Sai Reddy: ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమా ఖచ్చితంగా ఆస్కార్ సాధిస్తుంది..!!

Vijay Sai Reddy

Vijay Sai Reddy

Vijay Sai Reddy: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ మూవీ టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు వస్తుందని పలువురు స్పష్టం చేస్తున్నారు. హాలీవుడ్ మీడియా సైతం ఆర్.ఆర్.ఆర్ మూవీని కీర్తిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఆర్.ఆర్.ఆర్ మూవీని కొనియాడుతూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ‘RRR చిత్రం హాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఆస్కార్ బరిలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఉండొచ్చన్న హాలీవుడ్ మ్యాగజైన్ అంచనాలు మన తెలుగు చిత్ర స్థాయిని చాటిచెబుతున్నాయి. గిరిపుత్రులు బ్రిటిష్ వారిపై జరిపిన పోరాటమే ఇతివృత్తంగా సాగిన ఈ చిత్రం ఖచ్చితంగా ఆస్కార్ సాధిస్తుందని ఆశిస్తున్నా’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read Also: Maharashtra: ప్రభుత్వం చేయలేని పని.. 19 ఏళ్ల యువతి చేసింది..!!

కాగా ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ ‘వెరైటీ’ ఇటీవల ఆర్.ఆర్.ఆర్ మూవీపై ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ సినిమా పలు విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లను పొందే అవకాశం ఉందని తన కథనంలో పేర్కొంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ గీతం కేటగిరీల్లో ఆర్.ఆర్.ఆర్ మూవీ పోటీ పడొచ్చని హాలీవుడ్ మ్యాగజైన్ వెరైటీ పేర్కొంది. కాగా ఈ ఏడాది మార్చిలో బిగ్ స్క్రీన్లపై సందడి చేసిన ఆర్.ఆర్.ఆర్ సినిమా.. ఆ తరువాత ఓటీటీ, బుల్లితెరపైనా అదరగొట్టింది. దాదాపు రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి మరోసారి తెలుగు సినిమా స్టామినా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ మూవీలో అద్భుత నటన ప్రదర్శించినందుకు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లలో ఒక్కరికైనా ఆస్కార్ అవార్డు రావాలని టాలీవుడ్ ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

Exit mobile version