ఏపీ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కారులో డెడ్‌బాడీ దొరికిన అంశం హాట్ టాపిక్‌గా మారింది. నిందితుడు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కావడంతో ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్న ఉత్కంఠ నెలకొంది. అయితే చట్టం ముందు అందరూ సమానులేనని.. తప్పు చేసింది ఎమ్మెల్సీ అయినా చర్యలు తప్పవని.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని వైసీపీ మంత్రులు క్లారిటీ ఇస్తున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఇప్పటికే ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నట్లు కాకినాడ ఏఎస్పీ వెల్లడించారు.
కాగా పోలీసుల కస్టడీలో వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ సంచలన విషయాలు వెల్లడించారు. తానే సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్లు ఆయన ఒప్పుకున్నారు. ఈ హత్యలో తాను ఒక్కడినే పాల్గొన్నట్లు ఎమ్మెల్సీ స్పష్టం చేశారు. తన వ్యక్తిగత విషయాలు బయటపెడతానని బ్లాక్‌మెయిల్ చేయడంతో సుబ్రహ్మణ్యాన్ని కొట్టి బెదిరిద్దాం అనుకున్నానని చెప్పారు. కానీ హత్య చేయాలని భావించలేదని, తాను ఆవేశంలో కొట్టడంతో అతడు చనిపోయాడని ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ వెల్లడించారు. కాగా కాసేపట్లో వైసీపీ ఎమ్మెల్సీని పోలీసులు కోర్టు ఎదుట హాజరుపరచనుండగా.. ఆయనకు కోర్టు రిమాండ్ విధించే అవకాశం ఉంది.