ఏపీలో కొత్త జిల్లాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు తాతయ్యగుంటలోని గంగమ్మను వైసీపీ ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తాను తిరుపతిలో పుట్టి పెరిగానని.. అందుకే తరచూ గంగమ్మ గుడికి వస్తుంటానని రోజా తెలిపారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా గంగమ్మ జాతర జరగలేదని.. ఈ ఏడాది కచ్చితంగా అమ్మవారి జాతర ఘనంగా జరగాలని కోరుకుంటున్నట్లు ఆమె అభిప్రాయపడ్డారు.
అటు ఏపీలో జిల్లాల విభజన గురించి కూడా వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన బాలాజీ జిల్లాలో నగరి నియోజకవర్గం ప్రధానంగా ఉందని, మరికొంత చిత్తూరు జిల్లాలో ఉన్నదని ఎమ్మెల్యే రోజా తెలిపారు. తమ నియోజకవర్గం నగరి రెండు జిల్లాల్లో ఉండటం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆమె వివరించారు. ఈ విషయాన్ని ప్రజలు తన దృష్టికి తెచ్చారని.. దీంతో నగరి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపాలని సీఎం జగన్‌కు వినతి అందజేస్తామని రోజా తెలిపారు.