NTV Telugu Site icon

Andhra Pradesh: ఎన్నికల విధుల నుంచి టీచర్లు అవుట్.. మరి ఎవరు నిర్వహిస్తారు?

Teachers

Teachers

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల విధుల నుంచి టీచర్లను తప్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకువస్తామని మంగళవారం ప్రకటించింది. బోధనేతర పనుల వల్ల విద్యార్థులకు పాఠాలు చెప్పడంపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారని ఇటీవల ప్రభుత్వ టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టీచర్లను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే వచ్చే ఎన్నికల్లో టీచర్ల స్థానంలో ఎవరు విధులు నిర్వహిస్తారని అందరి మదిలో ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. సుదీర్ఘకాలంగా ఎన్నికలు అంటే తొలుత టీచర్లే గుర్తుకువచ్చేలా వారిని వినియోగించుకుంటున్నారు. ఓట్ల జాబితాల పరిశీలన నుంచి ఎన్నికల రోజు ఓటింగ్‌ వరకు టీచర్లే కనిపించేవారు. టీచర్లు లేని ఎన్నికల ప్రక్రియను ఊహించడం కష్టం.

Read Also: Pit Bull Dog: వీరంగం సృష్టించిన కుక్క.. ఫ్యామిలీతో యజమాని పరార్

అయితే ఏపీ ప్రభుత్వం ఉన్నట్టుండి టీచర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచడానికి ప్రధాన కారణమే ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వ టీచర్లు జగన్ సర్కారుపై వ్యతిరేకతతో ఉన్నారు. సీపీఎస్ రద్దు, జీతాలు, ఆర్ధిక ప్రయోజనాలు, ఫేషియల్ అటెండెన్స్ వంటి అంశాలకు సంబంధించి గతంలో పలు మార్లు టీచర్లు తమ వ్యతిరేకతను బహిరంగంగానే వ్యక్తం చేశారు. విజయవాడలో భారీ ధర్నా కూడా నిర్వహించారు. అందుకే వచ్చే ఎన్నికల్లో వాళ్లతో ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వం తాజాగా వాళ్లను ఎన్నికల విధులకు దూరం చేసిందని పలువురు ఆరోపిస్తున్నారు.

Read Also: CM Jagan: జనంతోనే మాకు పొత్తు.. దుష్టచతుష్టయం దుష్ప్రచారాలు చేస్తోంది

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టీచర్ల స్థానంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు విధులు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం వాళ్లకు ప్రొబేషన్ ఇచ్చింది. దీంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పర్మినెంట్ ఉద్యోగులుగా మారిపోయారు. వచ్చే ఎన్నికల్లో వీళ్లకు విధులు అప్పగిస్తే టీచర్లు లేని లోటును భర్తీ చేయవచ్చని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ అంశంపై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.

కాగా ప్రభుత్వ టీచర్లను ఎన్నికల విధులకు దూరం చేయడం అన్న నిర్ణయం వెనక ప్రభుత్వ పెద్దల దురాలోచన ఉందని టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. టీచర్లు నిర్వహించే బోధనేతర పనుల్లో ఎన్నికల విధులు మాత్రమే ఉన్నాయా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో ఎన్నెన్ని పనులు చేయిస్తున్నారని, మరి వాటి మాటేమిటని ప్రశ్నించారు. ఎన్నికల విధులకు పనికిరాని టీచర్లు మద్యం షాపుల ముందు కాపలాకి, మరుగుదొడ్ల ఫోటోలు తియ్యడానికి, సీఎం టూర్ ఉంటే బస్సులకు కాపలా కాయడానికి పనికొస్తారా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.

Show comments