CM Jagan: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జగనన్న విద్యా దీవెన నాలుగో విడత కింద తల్లుల ఖాతాల్లో బటన్ నొక్కిరూ.694 కోట్ల నగదును సీఎం జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా ఆయనా మాట్లాడుతూ.. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే అన్నారు. పేదరికం చదవుతోనే దూరమవుతుందని.. పేదరికం వల్ల ఏ ఒక్కరూ చదువులకు దూరం కాకూడదని వైఎస్ఆర్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలు చేశారని తెలిపారు. కానీ టీడీపీ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరు గార్చారని ఆరోపించారు. పాదయాత్రలో నేను విన్నాను-నేను ఉన్నాను అంటూ ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నానని సీఎం జగన్ వివరించారు. జగనన్న విద్యాదీవెన పేరుతో పూర్తి రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నామని తెలిపారు. సంవత్సరానికి రూ.20 వేలతో జగనన్న వసతి దీవెన అమలు చేస్తున్నామని చెప్పారు. చంద్రబాబు పెట్టిన బకాయిలను సైతం చెల్లించామన్నారు.
జగన్ బటన్ నొక్కితే ఏపీ శ్రీలంక అవుతుందని ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని సీఎం జగన్ మండిపడ్డారు. రైతులను మోసం చేసిన బాబు ఇప్పుడు వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాడని.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం చేసిన బాబు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నాడని.. పిల్లలను మోసం చేసిన బాబు చదువుల గురించి మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాల తీరును చూసి ప్రజలు ఇదేం ఖర్మరా బాబు అనుకుంటున్నారని ఆరోపించారు. తాము రాక్షసులు, మారీచులతో యుద్ధం చేస్తున్నామని.. బటన్ నొక్కితే పుట్టగతులు ఉండవనే ఉద్దేశంలో దుష్టచతుష్టయం దుష్ప్రచారాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లు పరిపాలించినప్పుడు ఏపీ అమెరికా అంట అని చురకలు అంటించారు. వాళ్లు రాష్ట్రాన్ని దోచుకో, పంచుకో, తినుకో అనే డీపీటీ సిద్దాంతాన్ని అమలు చేశారన్నారు.
Read Also: CBI Notices to Gangula Kamalakar: మంత్రి గంగుల కమలాకర్ కు సీబీఐ నోటీసులు
అక్షరాలు రాయటం, చదవటం మాత్రమే విద్యకు పరమార్థం కాదని.. ప్రతి విద్యార్థి ఆలోచించి నిర్ణయాలు తీసుకునే శక్తి ఇవ్వడమే విద్యకు పరమార్థం అని ఆల్బర్ట్ ఐన్ స్టీన్ అన్నారని..పేదల పిల్లలు ఇంగ్లీష్‌లో చదవకూడదని వాదించే వారి మనసులు మారాలని జగన్ వ్యాఖ్యానించారు. తమ భూముల్లోనే రాజధాని కట్టాలని భావిస్తున్న ప్రతిపక్షాలకు ఆలోచన, వివేకం కొరవడ్డాయని.. వాళ్లకు బుద్ధి, జ్ఞానం ప్రసాదించాలని దేవుడిని కోరుకుంటున్నట్లు జగన్ అన్నారు. రాజధాని భూముల్లో ఎస్సీ, ఎస్టీలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే ప్రతిపక్షాలు అంగీకరించడం లేదన్నారు. వ్యవసాయం, విద్యను, మహిళలను దగా చేసిన చంద్రబాబు వారి గురించి మాట్లాడుతున్నాడని.. ఇలాంటి వ్యక్తి లెక్చర్ ఇస్తుంటే ప్రజలు ఇదేం ఖర్మరా బాబు అని అంటున్నారని విమర్శించారు. దత్తపుత్రుడు, ప్రతిపక్ష మీడియా ఛానళ్లు చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని ప్రజలను కోరారు.
తాను దత్తపుత్రుడిని, మీడియాను కాకుండా… దేవున్ని, ప్రజలను నమ్ముకున్నానని సీఎం జగన్ తెలిపారు. తమకు ప్రజలతోనే పొత్తు అని.. తనకు నీతి, నిజాయితీ ఉన్నాయని.. అందుకే ప్రతి హామీని నెరవేరుస్తున్నానని వివరించారు. గతంలో ఎన్నికల్లో హామీలు ఇచ్చి మేనిఫెస్టోను చెత్త బుట్టలో వేసేవారు అని.. రాజకీయాల్లో జవాబుదారీ తీసుకువచ్చింది తాను మాత్రమే అని పేర్కొన్నారు.