వేసవి వచ్చేసింది. మండే ఎండలకు తోడు నీటి కొరత జనానికి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో…గుక్కెడు నీటి కోసం జనం అలాడిపోతున్నారు. తాగునీటి సరఫరాలో నీటివనరులు, లేదా సాంకేతిక సమస్యలు ఉంటే ట్యాంకర్లతో అయినా సరఫరా చేస్తారు. ఈ నియోజకర్గంలో ఆధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. తాగునీరు సరఫరా కాకపోవడంతో క్యాను నీటికి 15 రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు.
ఆలూరు నియోజకవర్గం పూర్తిగా వెనుకబడిన ప్రాంతం. వేసవి వచ్చిందంటే చాలు ఇక్కడ గుక్కెడు నీళ్లు కరువే. ఎద్దులబండ్లలో డ్రమ్ములు పెట్టుకొని నీళ్లు తెచ్చుకోవడం ఇక్కడ ప్రతి ఏటా కనిపించే దృశ్యాలు. సైకిళ్లపై బిందెలు పెట్టుకొని పొలాలకు వెళ్లి నీరు తెచ్చుకోవడం సర్వసాధారణం. ఈమధ్య కాలంలో పరిస్థితి కాస్త మెరుగుపడింది. నీటి సమస్య ఉంటే ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులు ట్యాంకర్లతో సరఫరా చేసేవారు. ఏడాది వేసవిలో నీటివనరులు అడుగంటి పోయినా అధికారుల్లో చలనం లేదు. కనీసం మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారన్న స్పృహ కూడా లేదు. ఏడాది పొడవునా నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో నీటి ఎద్దడి తప్పడం లేదు. 6 నెలలుగా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మరీ 15 రోజులు, 20 రోజులకు ఒకసారి నీరు సరఫరా చేయడంతో సుమారు వంద గ్రామాల ప్రజలు నీటి కోసం నరకయాతన అనుభవిస్తున్నారు.
ఆలూరు, ఆస్పరి, హోలగుంద మండలాల్లో నీటి సమస్య జటిలమైంది. చిప్పగిరి మండలంలోను మూడు, నాలుగు గ్రామాల్లో ఇదే పరిస్థితి. ఏ నాయకుడు వెళ్లినా ఆయా గ్రామాల ప్రజలు కోరేది నీటి సమస్య తీర్చాలని…జలాశయాలు ఒట్టి పోయినా, గుక్కెడు నీటి కోసం జనం తహతహలాడుతున్నా అధికారుల్లో చలనం లేదు. బిందె నీటి కోసం పోటీపడి కొట్టుకుంటున్నారు. బాపురం జలాశయం క్రింద 26 గ్రామాలుకు, చింతకుంట జలాశయం కింద 16 గ్రామాలు ,విరుపాపురం జలాశయం కింద 13 గ్రామాలు, ఖాజీపురం జలాశయం కింద 12 గ్రామాలు, సమ్మతిగేరి జలాశయం కింద 16 గ్రామాలు, నాగనాథహల్లి జలాశయం కింద 12 గ్రామాలకు నీళ్లు అందాలి. అధికారులు నిర్లక్ష్యంతో ఈ జలాశయాలకు నీళ్ళు అంతంతమాత్రమే.
ఆలూరు, హథీబెలగల్, హులేబీడు, గూల్యం, మొలగవల్లి, జోహారాపురం, ఐనకల్, డి.కోటకొండ, ములుగుందం వంటి 10 రోజులకు, 15 రోజులకు ఒకసారి నీళ్లు వదులుతున్నారు. అన్ని రోజులపాటు నీరు నిలువ ఉంటే వాసన వస్తున్నా అవే వాడుకోక తప్పడం లేదు. ఆర్థిక స్థోమత వున్నా , లేకున్నా క్యాన్ నీళ్లు 20 రూపాయలు చొప్పున కొనాల్సి వస్తోంది. ప్రతి ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కరిస్తామని ఇచ్చేది వాగ్ధానంగానే మిగిలిపోతుంది. ఆ తరువాత తమ బాధలు వినేవాళ్ళు లేరంటున్నారు జనం.
Read Also: Leaders Variety Route: వైసీపీలో ఆ ఇద్దరు నేతల తీరే సెపరేటు