ఏపీలో జగన్, చంద్రబాబు మధ్యే కాదు వైసీపీ, టీడీపీ నేతల మధ్య కూడా మాటల యుద్ధం రసకందాయంగా సాగుతోంది. వివిధ జిల్లాల్లో ఆధిపత్యం కోసం ఇరుపార్టీల నేతలు పోటీపడుతూనే వున్నారు. పల్నాడులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు మధ్య సినిమాటిక్ డైలాగ్ లు నడుస్తున్నాయి. ఫ్యాక్షన్ సినిమాల్లోలాగా నీ ఇంటికొస్తా.. నీ నట్టింటికొస్తా. చూసుకుందామా నీ పెతాపమూ.. నా పెతాపమూ.. అన్నట్టుగా పవర్ ఫుల్ డైలాగ్స్ తో పల్నాడులో పొలిటికల్ లీడర్స్ రెచ్చిపోతున్నారు.
పల్నాడు జిల్లాలో ఎన్నికలకు ముందే పొలిటికల్ హీట్ మొదలయ్యింది. పౌరుషానికి పెట్టింది పేరైన పల్నాడు ప్రాంతంలోని మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో వైసీపీ, టీడీపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు చేసుకుంటున్న ఆరోపణలు తార స్థాయికి చేరాయి. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గురజాల టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావుల మధ్య జరుగుతున్న మాటలయుద్దం ఓ రేంజ్ లో ఉంది. మాచర్ల నియోజకవర్గంలో ఇద్దరు టీడీపీ నేతలు హత్యకు గురయ్యారు. అప్పటినుంచి మాటలయుద్దం మొదలయ్యింది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిని టార్గెట్ చేసుకుని టీడీపీ నేతలు మాట్లాడడం మొదలుపెట్టారు. అధినేత చంద్రబాబునుంచి యరపతినేని, జూలకంటి బ్రహ్మారెడ్డిలు పిన్నెల్లి దౌర్జన్యాలు, అక్రమాలపై మాట్లాడడం మొదలుపెట్టారు. దీంతో పిన్నెల్లికూడా వీరికి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.
YSRCP: ఎమ్మెల్సీ అనంత్‌బాబు రిమాండ్ పొడిగింపు
ఈ మాటల యుద్దమే వ్యక్తిగత యుద్దంగా మారిపోయింది. కారంపూడిలో పిన్నెల్లి గురించి మాట్లాడతూ చంద్రబాబు వయసు గురించి మాట్లాడుతున్నావు… నీకు ఆరోగ్యం కూడా సరిగా ఉండదు కదా అంటూ యరపతినేని కామెంట్ చేశారు. తర్వాత గురజాలలో పిన్నెల్లి మాట్లాడుతూ యరపతినేని వ్యాఖ్యలపై ఘటుగా స్పందించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇంటికొచ్చి బట్టలూడదీసి కొడతానంటూ వార్నింగ్ ఇచ్చారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి వ్యాఖ్యలపై యరపతినేని కూడా రియాక్ట్ అయ్యారు. మాచర్లలో పిన్నెల్లి దందాలు అంతా ఇంతా కాదని మాట్లాడారు. దౌర్జన్యాలు చెయ్యడంతోపాటు తెలుగుదేశం నేతల హత్యలకు పిన్నెల్లి కారణమని ఆరోపించారు. అంతే కాదు పిన్నెల్లి మాట్లాడిన ప్రతిమాటను రాసిపెట్టుకుంటున్నామని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిమాటకు సమాధానం చెబుతామన్నారు.
అవకాశం వచ్చినప్పుడల్లా యరపతినేనిని టార్గెట్ చేస్తూ ఎమ్మెల్యే పిన్నెల్లి మాట్లాడుతూనే ఉన్నారు. మాచర్ల నియోజకవర్గ వైసీపీ ప్లీనరీలో ఓ రేంజ్ లో చెలరేగిపోయారు. సత్తెనపల్లి వైసీపీ ప్లీనరీలో మరోసారి యరపతినేనిపై రెచ్చిపోయారు. నువ్వు మగాడివైతే రా… నువ్వో నేనో తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు. నీకు, నీచెంచాలకు తోక కత్తిరిస్తా అంటూ నిప్పులు చెరిగారు. మొదట్లో పిన్నెల్లి మాటలకు కౌంటర్ ఇచ్చిన యరపతినేని రెండోసారి మాత్రం గట్టిగానే రియాక్ట్ అయ్యారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అక్రమంగా డబ్బులు సంపాదించి అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నావంటూ మండిపడ్డారు. అంతటితో ఆగని యరపతినేని సరస్వతి సిమెంట్స్ కేసు విషయంలో నన్ను కాపాడాలంటూ వేడుకున్న రోజులు గుర్తుచేసుకోవాలని ఘాటుగా స్పందించారు. నన్ను కాపాడాలంటూ ఫోన్ చేసింది నిజమో కాదో చెప్పాలన్నారు. దీనిపై ప్రమాణం చెయ్యడానికి సిద్దమా అని సవాల్ విసిరారు. పల్నాడులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావుల మధ్య మాటల యుద్దం ఉద్రిక్తతలు పెంచుతోంది.
Indian Railways: ఆగస్టు 1 నుంచి రైల్వే స్టేషన్‌లలో కొత్త నిబంధనలు