NTV Telugu Site icon

VRO Accident: పెదపట్నంలంకలో వీఆర్వోకి తప్పిన ప్రమాదం

Boat Fell

Boat Fell

గోదావరి వరద ప్రవాహం ఉధృతంగా వుంది. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నంలంకలో మహిళా వీఆర్ వో కి (VRO) ప్రమాదం తప్పింది. వరద సాయం అందించేందుకు వెళుతున్న వీఆర్వో గొల్లం మందల లక్ష్మీ కుమారికి ప్రమాదం తప్పింది. మామిడికుదురు మండలం పెదపట్ల లంకలో రెవిన్యూ అండ్ పంచాయతీ సిబ్బంది ప్రయాణిస్తున్న ఈ పడవ అదుపు తప్పింది. వరద బాధితులను తరలించేందుకు నాటు పడవ ఎక్కారు వీ ఆర్ వో. వరద నీరు వడిగా ప్రవహించడంతో తిరగబడి పోయింది పడవ. పడవ తిరగబడడంతో వరద నీటిలో మునిగి పోతున్న మహిళా వీఆర్వోని హుటాహుటిన రక్షించారు స్థానికులు.

మరోవైపు గోదావరి భారీ వరదల్లో (Godavari Heavy floods)కొట్టుకు వస్తున్న భయంకరమైన విష సర్పాలతో (Snakes) జనం హడలిపోతున్నారు. ఏ సర్పం ఎక్కడినించి బయటకు వస్తుందో తెలీక వరద నీటిలో బిక్కుబిక్కుమంటున్నారు జనం. మామిడికుదురు మండలం, బి.దొడ్డవరం లో వరదలకు కొట్టుకు వచ్చి గోడపైకి ఎక్కిన పాములను చూసి హడలిపోతున్న స్థానికులు ఈ క్షణాన ఏమవుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. ఇదిలా వుంటే.. రాజమండ్రి వద్ద గోదావరి వరద ఉధృతి ప్రమాదకరంగా మారడంతో రోడ్డు కం రైలు బ్రిడ్జి పై నుండి భారీ వాహనాల రాకపోకలు నిషేధించారు. రాజమండ్రి-కొవ్వూరు రోడ్డు కం రైల్వే బ్రిడ్జి పై భారీ వాహనాలకి అనుమతి నిరాకరించి భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. కేవలం బైక్ లు, ఆటోలు , కార్లకి మాత్రమే బ్రిడ్జి పైకి అనుమతి ఇస్తున్నారు. భారీ వాహనాల రాకపోకలు నిషేధం అమలు చేయడంతో బ్రిడ్జికి ఇరువైపుల పోలీసులు గస్తీ ఏర్పాటు చేశారు.

గోదావరి వరదలు రైతాంగాన్ని నిండా ముంచేశాయి. చేతికందిన పంట నీట మునగడంతో రైతన్నల కళ్లలో కన్నీళ్ల గోదారి పారుతోంది. పంటలు, కూరగాయలు తోటలు, ఇతర వాణిజ్య పంటలు నీట మునిగి అపార్ట్ నష్టం వాటిల్లింది. ఆరుగాలం కష్టించి పండించిన పంట వరద నీటి పాలైందని కోనసీమ రైతులు గగ్గోలు పెడుతున్నారు. రైతాంగం నష్టాలతో కష్టాలు పాలయ్యారు. పచ్చని కోనసీమ వరదలతో అల్లాడుతుంది. ఎటుచూసినా జలమయం.. మూగజీవాల ఇబ్బందులు వర్ణనాతీతం. పిల్లా పాపలతో పెద్దలు ఊళ్లు దాటుతున్నారు. పునరావాస కేంద్రాల్లో బిక్కుబిక్కుమంటూ తల దాచుకుంటున్నారు. కోనసీమలో లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలుచోట్ల ఇళ్లలోకి వరద నీరు చేరింది. రహదారులు నీట మునిగాయి. ప్రజలు బయటకు రావాలన్నా, తిరిగి లోపలికి వెళ్ళాలన్నా భయాందోళనలకు గురౌతున్నారు. గోదావరి లంకలకు ముప్పు వాటిల్లడంతో నీట మునిగిన రహదారుల్లోనే మోకాళ్ల లోతు నీటిలో నడక సాగిస్తున్నారు. ఇళ్లు చుట్టూ నీరు ఆవరించడంతో బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంకలో ప్రజలు పడుతున్న వరద కష్టాలు అన్నీ ఇన్నీ కావు.

Rajasthan: క్రేజీ దొంగలు.. ఎమ్మెల్యే కారునే చోరీ చేశారు.