కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం శ్రీరామనవమికి ముస్తాబవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకూ శ్రీసీతారామ కల్యాణ మహోత్సవం జరగనుందిఏటా ఇక్కడ శ్రీరామనవమి తర్వాత అత్యంత వైభవంగా శ్రీరాముడి కళ్యాణం నిర్వహిస్తారు. ఇక్కడి మూలమూర్తులు కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది. సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలలో వున్నందున ఈ క్షేత్రము ఏకశిలానగరము అని ప్రసిద్ధి చెందినది. నవ్యాంధ్ర ఏర్పడిన తరువాత ఈ ఆలయమున్న ఒంటిమిట్టను ఆంధ్రా భద్రాచలం గా పిలవడం మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి రోజున ఈ ఆలయంలోనే అధికారికంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. శ్రీరామనవమి రోజున ప్రభుత్వం తరపున సీఎం పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారు. భద్రాచలంలో శ్రీరాముడి కళ్యాణం తర్వాత ఇక్కడ ఆ సకలగుణాభిరాముడి కళ్యాణ మహోత్సవం జరపడం ఆనవాయితీగా వస్తోంది. యావత్ తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వేలాదిమంది భక్తులు తరలివస్తారు. అందుకు తగిన విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తుంటారు.
ఈ ఆలయానికి చేరడం సులభమే. కడప-తిరుపతి రహదారిపై కడపనుంచి 26 కి.మీ.దూరం ప్రయాణిస్తే ఈ ఒంటిమిట్ట ఆలయానికి చేరుకోవచ్చు. రైలులో రాజంపేట లేక కడప సమీప రైల్వేస్టేషన్లలో దిగవచ్చు. ఈ ఆలయానికి తిరుపతి విమానాశ్రయం 100 కి.మీ.దూరంలో వుంది.ఈ ఆలయంలోని ప్రధాన విగ్రహం ఒకే శిలలో రాముడు, సీత, లక్ష్మణుడు విగ్రహాలు చెక్కబడ్డాయి. దేవాలయాలలోని మూల విగ్రహాలలో రాముని విగ్రహం పక్కన హనుమంతుడు విగ్రహం లేని రామాలయం భారతదేశంలో ఇదొక్కటే. శ్రీరామహనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలో సీతారామలక్ష్మణుల ఏకశిలా విగ్రహం స్థాపించినట్లు కథనం.
ఈ కోదండ రామాలయానికి మూడు గోపుర ద్వారాలున్నాయి. విశాలమైన ఆవరణముంది. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. 32 శిలాస్తంభాలతో రంగమంటపం నిర్మించబడింది. గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించారు. రంగమంటపం విజయనగర శిల్పాలను పోలి ఉంది. పొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని మూడు దశలుగా నిర్మించారు.ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నుండి బహుళ విదియ దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చతుర్దశి నాడు కళ్యాణం, పౌర్ణమి నాడు రథోత్సవం ఉంటాయి. నవమి నాడు పోతన జయంతి నిర్వహిస్తారు. కవి పండితులను సత్కరిస్తారు. 2002 బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ సమీపంలో మహాకవి పోతన విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ ఆలయ నిర్వహణను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానములు కు అప్పగించింది. ఏటా టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం జరుపుతారు.
Read Also: B.Ramagopal Reddy: ఏపీలో ఒంటిపూట బడులు ఇంకెప్పుడు?
శ్రీరాముడి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తన నివాసంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు కలిశాఉ. శ్రీకోదండరామస్వామి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన శుభ పత్రికను సీఎం జగన్‌కు టీటీడీ చైర్మన్, ఈవోలు అందజేశారు. ఏప్రిల్ 5వ తేదీన రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకూ శ్రీసీతారామ కల్యాణ మహోత్సవం జరగనుంది. అదే సమయంలో ఈ నెల 30వ తేదీ నుంచి ఏప్రిల్ 09 తేదీ వరకూ ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. దీనిలో భాగంగా సీఎం జగన్‌ను టీటీడీ చైర్మన్, ఈవోలు కలిసి ఆహ్వాన శుభ పత్రికను అందజేశారు. గత ఏడాది ఏప్రిల్ 7వ తేదీన స్వామివారి కళ్యాణం జరిగింది.
Read Also: Atiq Ahmed: గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌కు జీవిత ఖైదు..