Vizag Woman Dies By Drinking Pesticide In Domestic Violence Case: ఏపీలోని విశాఖపట్నంలో దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందు ఇవ్వడంతో పాటు తానూ తాగింది. ఈ ఘటనలో ఆమెతో పాటు ఓ చిన్నారి మృతి చెందగా, మరో పాప పరిస్థితి విషమంగా ఉంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటోన్న సంపంగి మోహన కృష్ణతో శైలజ(34)కు 2017లో వివాహం అయ్యింది. మొదట్లో వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది. కానీ, ఆ తర్వాత నుంచే అత్తింటి వారి నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఈ విషయం తన కుటుంబ సభ్యులకు తెలిస్తే, వాళ్లు బాధపడతారన్న ఉద్దేశంతో.. బాధనంతా తనే దిగమింగుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో ఆ దంపతులకు తుషిత(4), అక్షిత(1) అనే ఇద్దరు పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టాక ఆమెకు వేధింపులు మరిన్ని ఎక్కువయ్యాయి. ప్రతీ చిన్న విషయంపై కూడా చీవాట్లు పెడుతూ వచ్చారు.
రానురాను అత్తింటివారి వేధింపులు పెచ్చుమీరడంతో కుంగిపోయిన శైలజ.. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. గురువారం సాయంత్రం సూసైడ్ నోట్ రాసి, తన సోదరికి శైలజ పంపించింది. అందులో భర్త తనని నిత్యం కట్నం కోసం వేధించేవాడని పేర్కొంది. అనంతరం తన పిల్లలకు పురుగుల మందు ఇచ్చి, తానూ తాగింది. ఇది గ్రహించిన అత్తింటివారు.. వెంటనే శైలజతో పాటు పిల్లల్ని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే విషం శరీరమంతా పాకడంతో, చికిత్స పొందుతూ శైలజ చనిపోయింది. అలాగే ఏడాది వయసున్న అక్షిత సైతం మృతి చెందింది. ప్రస్తుతం తుసిత పరిస్థితి విషమంగా ఉంది. ఆ పాపని కాపాడేందుకు వైద్యులు సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు.. ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని పోలీసుల్ని ఆశ్రయించారు. తమ అమ్మాయిని అత్తింటివారు వేధింపులకు గురి చేయడం వల్లే, ఆత్మహత్య చేసుకుందని వాపోయారు. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.