Site icon NTV Telugu

Vishnuvardhan Reddy: ఏపీలో ఇకపై టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలుండవు

Vishnuvardhan On Ysp

Vishnuvardhan On Ysp

ఆత్మకూరు ఉప-ఎన్నికల నుంచి టీడీపీ తప్పుకున్న నేపథ్యంలో.. సత్తా చాటేందుకు వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాము జనసేన – బీజేపీ బలపరిచిన అభ్యర్థిని రంగంలోకి దింపుతామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం, టీడీపీల మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 5 లక్షల ఆదాయమున్న దేవాలయాల హక్కు యాజమాన్యాలదే అని స్వయంగా హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు.. దేవాలయాల ఆస్తులపై ప్రభుత్వానిదే నిర్ణయమని మంత్రి ఎలా అంటున్నారు? అంటూ ప్రశ్నించారు. దేవాలయ మంత్రిని మాట మాటలు చెప్పొద్దని మండిపడ్డ ఆయన.. మసీదులలో మౌజన్లకు డబ్బులు, పాస్టర్లకు డబ్బులు ఇస్తున్నప్పుడు, దేవాలయాలపై ఎందుకు తేడా చూపిస్తున్నారని అడిగారు.

దేవాలయాలలో హుండీల లెక్కలు అడిగినట్టు.. ఇతర మతాలను ఎందుకు అడగరంటూ నిలదీశారు. బిజెపీ అధికారంలోకి వస్తే.. చర్చిలు, మసీదుల మాదిరిగా దేవాలయాలను స్వేచ్ఛగా ఉంచుతామని హామీ ఇచ్చారు. గ్రూప్ – 1 అభ్యర్ధుల ఇబ్బందులపై గవర్నర్‌కు లేఖ రాస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో పెన్షన్లు, మంత్రులకు జీతాలు ఇవ్వడం తప్ప ప్రభుత్వం ఏం చేస్తోందని మండిపడ్డారు. ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు ఇస్తున్నారా? అని ప్రశ్నించిన ఆయన.. ఓట్లు కొనుక్కోవడానికే సీఎం జగన్ డబ్బులిస్తున్నారని చెప్పారు. అభివృద్ధి అంటే ప్రజల సొమ్ము తిరిగి ప్రజలకే పంచి ఓట్లు కొనుక్కోవడమా? అని నిలదీశారు.

భూసేకరణ పేరుతో భూముల్ని వైసీపీ నేతలకు కట్టబెడుతున్నారని, అవినీతి యాప్ వైసీపీ నేతల అవినీతితోనే మొదలుపెట్టాలని విష్ణువర్ధన్ పేర్కొన్నారు. ఏపీలో తమ‌ వాటా ఇవ్వలేక కేంద్ర నిధులు వద్దంటున్నారని, కర్నూలు మెడికల్ కళాశాల ఆస్తులను కూడా అమ్మేసే పరిస్ధితి తీసుకొచ్చారన్నారు. ఒకరినొకరు తిట్టుకోవడానికి బస్సు యాత్రం, మహానాడు కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. అమలాపురం ఘటనపై సీఎం ఎందుకు నోరు మెదపడం లేదని, ఎమ్మెల్యేల మాటతీరుపై ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు. ఇంజనీరుపై చెయ్యి చేసుకున్న ఎమ్మెల్యేపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలకు షాడో ఎమ్మెల్యేలను పెట్టారని.. ఇకపై ఏపీలో టీడీపీ, వైసీపీ కుటుంబ ప్రభుత్వాలు ఉండవు విష్ణువర్ధన్ వెల్లడించారు.

Exit mobile version