YS Jagan: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఎట్టకేలకు జగన్ పర్యటనకు అనుమతిచ్చిన పోలీసులు.. వైసీపీ ప్రతిపాదించిన మార్గంలో కాకుండా కొత్త రూట్ మ్యాప్‌ను సిద్ధం చేశారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటల సమయంలో విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు జగన్. అక్కడ నుంచి NAD జంక్షన్, పెందుర్తి కూడలి మీదుగా అనకాపల్లి, తాల్లపాలెం నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ వరకు వెళ్లే విధంగా రూట్ మ్యాప్ ఖరారు చేశారు. భారీ జన సమీకరణ, స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్క్ వంటి బర్నింగ్ ఇష్యూస్ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. నిర్దేశించిన మార్గంలో, నిబంధనలకు లోబడే జగన్ టూర్ కొనసాగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు, నకిలీ మద్యం వ్యవహారాల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడంలో భాగంగానే జగన్ పర్యటనపై రాద్దాంతం చేస్తున్నారని వైసీపీ విమర్శిస్తోంది.
Read Also: Local Body Elections 2025: నేడు మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్..
కొత్త రూట్ మ్యాప్ ప్రకారం ఎయిర్ పోర్టు నుంచి అనకాపల్లి వైపు వెళ్లే మార్గం మారడంతో వైసీపీ ప్లాన్ బీ అమలులోకి తెచ్చింది. నగరం పరిధిలోని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున వచ్చే పార్టీ అభిమానులు, జనం ఎక్కడిక్కడ స్వాగతం పలికేలా సన్నాహాలు చేసింది. కాకాని నగర్ దగ్గర స్టీల్ ప్లాంట్ కార్మికులు, నిర్వాసిత కుటుంబాలను కలిసి జగన్ మాట్లాడతారు. NAD పెందుర్తి జంక్షన్ల దగ్గర భారీగా ప్రజలు తరలి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అనకాపల్లి AML కాలేజ్ దగ్గర షుగర్ ఫ్యాక్టరీ రైతులు, తాళ్లపాలెం దగ్గర బల్క్ డ్రగ్ పార్క్ నిర్వాసితులు, మత్స్యకారులు కలవనున్నారు వైసీపీ అధినేత. ఒకవైపు అనుమతులు ఇచ్చినట్టే ఇచ్చిన పోలీసులు.. నిర్బంధ వాతావరణం సృష్టిస్తున్నారని.. ఫ్లెక్సీలు కట్టేందుకు కూడా అడ్డంకులు కల్పిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. మొత్తంగా జగన్ మెడికల్ కాలేజ్ టూర్ ఏపీ రాజకీయాన్ని వేడెక్కిస్తోంది.
జగన్ పర్యటన వివరాలను పరిశీలిస్తే.. ఉదయం 9.20 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరనున్న జగన్.. 9.50 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.. 10.15 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 11 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు.. 11.30 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం భీమబోయినపాలెం (వయా-ఎన్ఏడీ జంక్షన్, వేపకుంట, పెందుర్తి, కొత్తూరు జంక్షన్, తాళ్ళపాలెం జంక్షన్) వెళ్ళి మధ్యలో నిర్మాణం నిలిపివేసిన ప్రభుత్వ వైద్య కళాశాలను పరిశీలిస్తారు.. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 2.15 గంటల వరకు అక్కడే మీడియాతో మాట్లాడుతారు.. అనంతరం మధ్యాహ్నం అక్కడినుంచి బయలుదేరి విశాఖపట్నం కేజీహెచ్ (వయా – తాళ్ళపాలెం జంక్షన్, కొత్తూరు జంక్షన్, పెందుర్తి, వేపకుంట, ఎన్‌ఏడీ జంక్షన్)కు చేరుకుంటారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న కురుపాం గిరిజన వసతి గృహంలో అస్వస్థతకు గురైన విద్యార్దులను పరామర్శిస్తారు. అనంతరం సాయంత్రం సాయంత్రం 6 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు నుంచి తిరుగు పయనమవుతారు వైఎస్ జగన్..
వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు ఎట్టి పరిస్థితుల్లోనూ నేషనల్ హైవే, స్టేట్ హైవేలపై గుంపులుగా గుమికూడి ట్రాఫిక్ అంతరాయం కలిగించరాదు అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా స్పష్టం చేశారు.. ఇటీవల తమిళనాడు కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకొని, వైఎస్ జగన్ పర్యటన సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ వారి మార్గ దర్శ కాలు పాటించాలన్నారు.. ప్రజలు, కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ నేషనల్ హైవేలపై గాని లేదా ఇతర రోడ్లపై గాని గుమి గూడరాదు. మెడికల్ కాలేజ్ ఉన్న స్థలంలో గరిష్టంగా ఎంత సామర్థ్యం కలదో అంతమంది ప్రజలకు మాత్రమే అనుమతించబడును.అంతకంటే ఎక్కువ మందిని నిర్వాహకులు సమీకరించరాదు. హైవేలపై గాని ఇతర కూడళ్ళ వద్ద గాని జన సమీకరణ చేసి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించినట్లయితే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడును.. ఏదైనా అవాంఛనీయ సంఘటన చోటుచేసుకుంటే, సంబంధిత నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని, అలాంటి సందర్భాల్లో చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.