NTV Telugu Site icon

Bike Racing: వీకెండ్స్ వచ్చిందంటే చాలు.. రెచ్చిపోతున్న బైక్‌ రేసర్లు..!

Bike Racing

Bike Racing

Bike Racing: సాగర నగరం విశాఖపట్నంలో బైక్‌ రేసింగ్‌లకు కళ్లెం వేయడానికి సీసీ శంఖ బ్రతబాగ్చి దృష్టిసారించారు. వీకెండ్స్‌లో బైక్‌రేసింగ్‌లు ఎక్కువగా జరుగుతుండడంతో ప్రత్యేక నిఘా పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు. గతవారం రోజుల్లోనే 54 మంది రేసర్లను పోలీసులు పట్టుకున్నారు. గతంలో నగరశివారు ప్రాంతాల్లో అకస్మాత్తుగా జరిగే రేసింగ్‌లు.. వీకెండ్స్‌లో సాధారణంగా మారిపోయాయి. పైగా శివారు ప్రాంతాలకు కాకుండా నగరం నడిబొడ్డునే రేసింగ్‌లు నిర్వహిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.. ఇటీవల నగరంలో రాత్రివేళ పరిస్థితిని పరిశీలించేందుకు సీపీ శంఖబ్రతబాగ్చి అర్ధరాత్రి దాటిన తర్వాత స్వయంగా నిఘా పెట్టారు. ఆ సమయంలో కొంతమంది యువకులు బీచ్‌రోడ్డు, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌, సిరిపురం తదితర ప్రాంతాల్లో బైక్‌లతో రేసింగ్‌ నిర్వహించడం గుర్తించారు.

Read Also: India: బుద్ధి మార్చుకోని పాక్.. రైలు హైజాక్ పై తీవ్ర ఆరోపణలు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్

దీంతో నగరంలో రేసింగ్‌లకు అడ్డుకట్టవేయాలని సిబ్బందిని ఆదేశించారు. గస్తీ పెంచడంతో బైక్‌ రేసర్లు వరుసగా పట్టుబడుతున్నారు. ఈనెల రెండో తేదీన 38 మంది రేసర్లను అదుపులోకి తీసుకున్నారు. ఏడో మరో 18 మంది పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి బైక్‌లను స్వాధీనం చేసుకుని, కేసులు నమోదుచేశారు. పట్టుబడిన యువకుల తల్లిదండ్రులను పిలిపించి, కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఇలాంటి రేసింగ్‌లు నగరంలో బీచ్‌రోడ్డుతోపాటు బీఆర్‌టీఎస్‌రోడ్డు, మారికవలస నుంచి ఐటీ హిల్స్‌కు వెళ్లేరోడ్డు, రుషికొండ, తిమ్మాపురం బీచ్‌రోడ్డులో ఎప్పటికప్పుడు జరుగుతుంటాయని పోలీసులే చెబుతున్నారు.. రేసింగ్‌కు పాల్పడేవారంతా వాట్సాప్‌, ఇన్‌స్టాల్లో గ్రూపులుగా ఏర్పడి సమాచారం అందించుకుంటున్నారు. ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకుని పోలీసుల రాకను గమనిస్తూ.. జిగ్‌జాగ్‌లు, స్పీడ్‌ డ్రైవింగ్‌, స్టంట్‌ల పోటీలు పెట్టుకుంటున్నారు. ఆ సమయంలో అదే రోడ్డుపై వెళ్లే వాహనదారులు, స్టంట్‌లు చేసే యువకులు ప్రమాదాల బారిన పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. యువత ప్రాణాలను బలిగొంటున్న రేసింగ్‌లపై ఉక్కుపాదం మోపాలని కోరుతున్నారు నగరవాసులు.