TDP Mahanadu: అందుకే హైబ్రిడ్ మహానాడు.. నెల్లూరు సభ రద్దుపై పల్లా శ్రీనివాస్ వివరణ..

Palla Srinivasa Rao

Palla Srinivasa Rao

TDP Mahanadu: మహానాడుకు భారీ ఏర్పాట్లు చేసిన టీడీపీ.. ఆ తర్వాత కీలక నిర్ణయం తీసుకుంది.. అయితే, తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణలో ఈసారి కీలక మార్పులు చేపట్టినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వెల్లడించారు.. ఇంధన వనరుల పొదుపును దృష్టిలో ఉంచుకుని నెల్లూరులో నిర్వహించాల్సిన మహానాడును రద్దు చేసి, హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన పల్లా శ్రీనివాస్, నెల్లూరులో మహానాడు కోసం ఇప్పటికే విస్తృత స్థాయిలో ఏర్పాట్లు జరిగాయని చెప్పారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన వినియోగాన్ని తగ్గించడం అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.

కోవిడ్ సమయంలో వర్చువల్ మహానాడును విజయవంతంగా నిర్వహించిన అనుభవం తమకు ఉందని ఆయన గుర్తు చేశారు పల్లా.. అదే తరహాలో ఈసారి సాంకేతికతను వినియోగిస్తూ హైబ్రిడ్ మోడల్‌లో మహానాడు నిర్వహించనున్నట్లు తెలిపారు. సాధారణంగా మహానాడు నిర్వహణకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఖర్చవుతుందని, దాదాపు 10 వేల వాహనాలు వివిధ ప్రాంతాల నుంచి వస్తాయని చెప్పారు. ఈ భారీ రవాణా వల్ల ఇంధన వినియోగం అధికమవుతుందని, అందుకే ప్రత్యామ్నాయ విధానాన్ని ఎంచుకున్నామని పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు మహానాడు కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు పల్లా శ్రీనివాస్‌.. ఇందుకోసం మొత్తం 1848 భారీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయ ప్రాంగణంలో 68 మంది సీనియర్ నేతలతో కూడిన ప్రత్యేక బృందం మహానాడు కార్యక్రమానికి దిశానిర్దేశం చేయనున్నట్లు పల్లా శ్రీనివాస్ తెలిపారు. పార్టీ విధానాలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో కీలక చర్చలు జరగనున్నాయని పేర్కొన్నారు.