వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి తమకు ఓటు వేయాలన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఈ సందర్భంగా టీడీపీ-జనసేన పొత్తులపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. టీడీపీ, జనసేన తమ పొత్తు చూసి ఓటు వేయాలని చెబుతున్నారని విమర్శించారు. కాగా.. రాష్ట్రంలో ప్రజలు వైసీపీని రెండోసారి అధికారంలోకి తీసుకొస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాతో జనసేన, టీడీపీ బలహీనతలు బయటపడ్డాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. తుప్పు పట్టిన సైకిల్, పగిలిపోయిన గ్లాస్ కు గోల్డ్ కోటింగ్ వేసుకుని జనం ముందుకు వచ్చారని దుయ్యబట్టారు. టీడీపీ-జనసేనది సోషల్ ఇంజనీరింగ్ కాదు, ప్యాకేజీ ఇంజనీరింగ్ అని విమర్శించారు. వారి ప్రకటనలో సామాజిక న్యాయం ఎక్కడా కనిపించలేదని మంత్రి తెలిపారు.
ఎంత మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చారో జస్టిఫై చేసుకోవాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ సూచించారు. పొత్తు మాత్రమే మా బలం అని చెప్పుకునే పరిస్థితుల్లో జనసేన, టీడీపీ ఉన్నాయని అన్నారు. 24 సీట్లకే పరిమితం అయినందుకు జన సైనికులకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత కాపులను కమ్మవాళ్లు.. కమ్మవాళ్లను కాపులను నమ్మడం లేదని అర్థం అయిందని చెప్పారు. పొత్తుల వల్ల ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరగదని తెలిపారు. కాపుల ఓట్ల కోసం చంద్రబాబు పెట్టుకున్న పొత్తు చిత్తవ్వ డం ఖాయమని మంత్రి ఆరోపించారు.