Transgender Jobs in GVMC: విశాఖ నగరంలోని ట్రాన్స్‌జెండర్స్‌కు పోలీసులు శుభవార్త అందించారు. ఉపాధి కల్పన దిశగా నగర పోలీస్ కమిషనర్ శంఖ భ్రత బాగ్చి వినూత్న ఆలోచనతో ముందడుగు వేశారు. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక ఉపాధి ప్రణాళికను అమలు చేస్తున్నారు. మేయర్ పీలా శ్రీనివాస్ చొరవతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) లో ట్రాన్స్‌జెండర్‌లకు ఉద్యోగాలు కల్పించే ప్రక్రియ మొదలైంది. మొదటి విడతలో భాగంగా 25 మందికి స్వీపర్లుగా ఉద్యోగాలు అందించారు. దీంతో పాటు స్వయం ఉపాధి సాధన కోసం సీపీ ప్రత్యేక చర్యలు చేపట్టారు.
Read Also: Pakistan: పాకిస్తాన్‌కు డాక్టర్లు, ఇంజనీర్లు గుడ్‌బై.. అసలు కారణాలు ఏంటి.?
ట్రాన్స్‌జెండర్‌లకు ముద్ర రుణాలు మంజూరు చేయించి, పాల బూత్‌లు, కిరాణా షాపులు వంటి వ్యాపారాలను ప్రారంభించేలా ప్రోత్సహించారు. ఈ నిర్ణయంతో తొలి విడతగా 25 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించింది. మరింత మందికి అవకాశం కల్పించేలా, రానున్న రోజుల్లో ఇతర విభాగాల్లోనూ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సీపీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ట్రాన్స్‌జెండర్ సంఘాలు, ప్రజా ప్రతినిధులు సీపీ నిర్ణయాన్ని అభినందించారు. సమాజంలో సమాన గౌరవం, ఆర్థిక స్వావలంబన కోసం ఇలాంటి చర్యలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ట్రాన్స్‌జెండర్‌ల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో జీవీఎంసీ, పోలీస్ శాఖ కలిసి పనిచేయడం స్ఫూర్తిదాయకమని పలువురు అభిప్రాయపడ్డారు.