Pakistan: పాకిస్తాన్ రాజకీయ, ఆర్థిక సంక్షోభాలతో పాటు మరో సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పాక్ నుంచి మేథోపరమైన వలసలు(టాలెంట్ ఎక్సోడస్)ను ఎదుర్కొంటోంది. దేశంలోని ప్రతిభావంతులైన డాక్టర్లు, ఇంజనీర్లు, అకౌంటెంట్లు విదేశాలకు వెళ్తున్నారు. గత 24 నెలల్లో పాకిస్థాన్ నుంచి 5,000 మంది డాక్టర్లు, 11,000 మంది ఇంజినీర్లు, 13,000 మంది అకౌంటెంట్లు విదేశాలకు వెళ్లిపోయినట్లు ఆ నివేదిక చెబుతోంది. అయితే, ఈ పరిస్థితిపై పాక్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ చేసిన ‘‘బ్రెయిన్ గెయిన్’’ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. బ్యూరో ఆఫ్ ఎమిగ్రేషన్ అండ్ ఓవర్సీస్ ఎంప్లాయ్‌మెంట్ (BE&OE) గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది పాక్ నుంచి 5000 మంది డాక్టర్లు, 11,000 మంది ఇంజనీర్లు, 13,000 మంది అకౌంటెంట్లు దేశం విడిచి వెళ్లారు. వీటిని తోడు నర్సింగ్ రంగం కూడా కుదేళవుతోంది. వేలాది మంది నర్సులు మెరుగైన అవకాశాల కోసం విదేశాలకు వెళ్తున్నారు.
కారణాలు ఏంటి..?
పాకిస్తాన్ పరిస్థితి నానాటికి దిగజారుతోంది. పాక్ ప్రభుత్వం, ప్రస్తుతం ఆర్మీ చేతుల్లో కీలుబొమ్మగా మారింది. రాజ్యాంగాన్ని మార్చి అసిమ్ మునీర్‌ను ఆ దేశ సైన్యాధిపతిగా చేశారు. ఆ దేశ అధ్యక్షుడి అధికారాన్ని మునీర్‌కు కట్టబెట్టడంతో పాటు న్యూక్లియర్ కంట్రోల్స్ అతడి చేతుల్లోకి వెళ్లాయి. మరోవైపు, షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పాక్‌లో మౌలిక సదుపాయాలు, పరిశ్రమల్ని పట్టించుకోవడం లేదు.
అధిక ద్రవ్యోల్బణం, దీర్ఘకాలిక ఆర్థిక అస్థిరత, రాజకీయ అనిశ్చితి, బలహీనమైన పాలన, సాంకేతిక రంగాల్లో అవకాశాలు లేకపోవడం, పరిశోధన, ఆవిష్కరణలకు నిధులు కేటాయింపు లేకపోవడం వంటి సమస్యలతో పాకిస్తాన్‌లోని టాలెంట్ విదేశాల బాట పడుతోంది. విదేశాల్లో మెరుగైన జీవనం, జీతాలు, ఉద్యోగ భద్రత ఉండటం కూడా వీరిని ఆకర్షిస్తున్నాయి.
మరోవైపు, 2024 నుంచి పాకిస్తాన్‌లో ఏదైనా నిరసనల్ని అణిచివేయడానికి ఇంటర్నెట్ షట్‌డౌన్ చేస్తోంది. దీంతోనే ప్రపంచంలో అత్యధిక ఆర్థిక నష్టాన్ని చవిచూసింది. సుమారు 1.62 బిలియన్ డాలర్లు (పాకిస్థాన్ కరెన్సీలో రూ. 450 బిలియన్లకు పైగా) నష్టం జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఫ్రీలాన్సింగ్‌కు హబ్‌గా ఉన్న పాకిస్తాన్‌లో ఇంటర్నెట్ షట్‌డౌన్ వల్ల 70 శాతం వరకు పని అవకాశాలు తగ్గాయి.
మునీర్‌పై విమర్శలు:
అమెరికా పర్యటనలో ఆసిమ్ మునీర్, విదేశాల్లో ఉన్న పాకిస్థానీలను “గర్వకారణం”గా పేర్కొంటూ, ఇది బ్రెయిన్ డ్రెయిన్ కాదని, “బ్రెయిన్ గెయిన్” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు దేశం నుంచి ప్రతిభ వెళ్లిపోతుంటే, ఈ వ్యాఖ్యలు అర్థమేమిటని పాక్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మిలిటరీ వ్యవస్థ ఇచ్చిన బహుమతి ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ పరిణామాలు పాక్‌ను మరో 10 ఏళ్లు వెనక్కి నెడుతుందని చెబుతున్నారు.