Botsa Satyanarayana: విశాఖ జిల్లా అధికారుల తీరుపై వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జీవీఎంసీ (గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్) ఎక్స్ ఆఫిషియో జాబితా నుంచి తన పేరును తొలగించడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో గీతం భూముల అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో, పాలకవర్గం వ్యూహాత్మకంగా వ్యవహరించి తన పేరును ఎక్స్ ఆఫిషియో సభ్యుల జాబితా నుంచి తొలగించిందని బొత్స ఆరోపించారు. ఈ విషయమై “వాటీజ్ దిస్ నాన్సెన్స్” అంటూ అధికారుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Heart Attack During Pregnancy: ఈ ఏజ్ దాటితే.. గర్భధారణ సమయంలో గుండెపోటు.. షాకింగ్..
ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, తాను ఇప్పటికే ఐదు నుంచి ఆరు సార్లు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాలకు హాజరయ్యానని గుర్తు చేశారు. అయితే, రేపు జరిగే సమావేశానికి రావడానికి వీల్లేదని అధికారులు చెబుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజలు ఓటు వేస్తేనే నేను ఎమ్మెల్సీగా గెలిచాను. అలాంటి నన్ను ఎక్స్ ఆఫిషియో జాబితా నుంచి తొలగించడం ఏమిటి? అంటూ ప్రశ్నించారు. ఈ అంశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే, పరిశీలించి చెబుతాం అని సమాధానం ఇవ్వడమేంటని మండిపడ్డారు. నాన్సెన్స్ని కూడా పరిశీలిస్తామని చెప్పడమేంటి? అంటూ అధికారుల సమాధానాన్ని బొత్స తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజాప్రతినిధుల హక్కులను కాలరాస్తూ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. అయితే, ఈ వ్యవహారం విశాఖ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.