Site icon NTV Telugu

Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి

Rob

Rob

Vizag ROB Collapse: విశాఖ జిల్లా గాజువాక సమీపంలోని తుంగలం వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ROB) ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు గాయపడగా, తృటిలో ఒక భారీ ప్రాణనష్టం తప్పింది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

తుంగలం దగ్గర గత కొంతకాలంగా రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. అయితే, ఆదివారం మధ్యాహ్నం మూడు , నాలుగో పిల్లర్ల మధ్య డక్టింగ్ పనులు జరుగుతుండగా, ఆ భారీ నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయింది. ప్రమాద సమయంలో అక్కడ సుమారు 10 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులకు తీవ్ర గాయాలు కాగా, వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో భారీ ప్రాణనష్టం తప్పడానికి ప్రధాన కారణం సమయమేనని చెప్పవచ్చు. ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు భోజన విరామానికి వెళ్లడంతో అక్కడ తక్కువ మంది ఉన్నారు. అంతేకాకుండా, ఆదివారం కావడంతో చాలా మంది పనిలోకి రాలేదని, లేదంటే ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

బ్రిడ్జ్ కుప్పకూలిన వెంటనే పోలీసులు , సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆ సమయంలో బ్రిడ్జ్ కింద నుండి వాహనదారులు ఎవరైనా వెళ్తూ శిథిలాల కింద చిక్కుకున్నారా అనే అనుమానంతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. వాహనాలు లేదా బైక్‌లు ఏవైనా కింద ఉండిపోయాయా అన్న కోణంలో శిథిలాలను తొలగిస్తున్నారు. కార్మికులందరూ సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు, అయితే పూర్తి స్థాయిలో శిథిలాలను తొలగిస్తేనే స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి గాయపడిన కార్మికులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిర్మాణంలో లోపాల వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే అంశంపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

 

Exit mobile version