NTV Telugu Site icon

Vijayawada Cyber Crime: వాట్సాప్ డీపీగా సీఎం చంద్రబాబు ఫోటో పెట్టి ఫోన్లు.. కేటుగాళ్ల కొత్త వ్యూహం

Cyber Crime

Cyber Crime

Vijayawada Cyber Crime: సైబర్‌ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. ప్రజల అవగాహన లేమిని తెలివిగా వాడుకుంటూ కోట్లు నొక్కేస్తున్నారు. సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా.. పదే పదే నేరాలు జరగడం తీవ్రతకు అద్ధం పడుతోంది. బెజవాడలో గత 10 రోజుల్లో 5గురు సైబర్‌ నేరగాళ్ల బారిన పడి లక్షల్లో డబ్బుల్లో పోగొట్టుకొని పోలీసులను ఆశ్రయించారు. విజయవాడ భవానీపురానికి చెందిన మహిళను కొరియర్ పేరుతో సైబర్‌ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. మీకు వచ్చిన పార్సిల్‌లో మత్తు పదార్థాలు ఉన్నాయని బెదరగొట్టారు. ముంబై క్రైం పోలీసుల పేరుతో ప్రశ్నలతో భయపెట్టారు. భయపడిన బాధితురాలు రెండు దఫాలుగా రూ.32 లక్షలు సమర్పించుకుంది.

Read Also: Crime News: కట్టుకున్నోడే కడతేర్చాడు.. రఘునాథపాలెం రోడ్డు ప్రమాద ఘటనలో వీడిన మిస్టరీ

ఈకేవైసీ పేరుతో బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని నందిగామకు చెందిన మహిళను మోసం చేశారు కేటుగాళ్లు. బ్యాంక్‌ నుంచి లింక్‌ పంపుతున్నామని చెప్పగా.. ఆ లింక్‌ను క్లిక్‌ చేసిన వెంటనే రూ.5లక్షలు పోగొట్టుకుంది. మరో ఘటనలో సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శినంటూ పలువురు ఉన్నతాధికారులకు గత వారంలో ఫోన్లు వెళ్లాయి. వాట్సాప్ డీపీగా సీఎం చంద్రబాబుతో దిగిన ఫోటో పెట్టి కాల్స్ చేశారు. ఈ విషయం గతంలో సీఎం చంద్రబాబుకు కార్యదర్శిగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాసరావు దృష్టికి వెళ్లడంతో ఆయన సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

క్రిప్టో కరెన్సీ , బ్లాక్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడుల పేరుతో ఇద్దరు వ్యక్తులను నిలువు దోపిడీ చేశారు సైబ‌ నేరగాళ్లు. పెట్టుబడికి అధిక ఆదాయమని చెప్పడంతో గుణదల నర్సయ్య వీధికి చెందిన వెంకటేశ్వరరావు రూ.1.21 కోట్లు విడతల వారీగా పెట్టుబడి పెట్టారు. పెట్టుబడి ఖాతాలో కనబడుతోంది తప్ప విత్‌డ్రా చేయడానికి అవకాశం లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే తరహాలో విద్యాధరాపురానికి చెందిన భాను ప్రకాష్ కూడా మోసపోయారు. రూ.11 లక్షల వరకూ పెట్టుబడి పెట్టి మోసపోయారు. ఈ వ్యవస్థ అంతా సైబర్‌ నేరగాళ్ల చేతిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వారు 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. అయితే విచారణకు కాస్తా సమయం పడుతుంది పోలీసులు వెల్లడిస్తున్నారు.