Terror Links Case: టెర్రర్ లింక్స్ కేసులో మరో అరెస్ట్.. విజయవాడ 2 టౌన్‌ పీఎస్‌లో విచారణ..

Arrest

Arrest

Terror Links Case: తెలుగు రాష్ట్రాల్లో టెర్రర్ లింక్స్ కేసు కలకలం రేపుతోంది.. పోలీసులు మరో కీలక అరెస్ట్ చేశారు. ఈ కేసులో భాగంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని చంచల్‌గూడాకు చెందిన సయీదా బేగంను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను విచారణ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం, విదేశీ హ్యాండ్లర్ అల్ హకీమ్ షుకూర్ సూచనలతో సయీదా బేగం పనిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సోహైల్ బెగ్, షరీఫ్, డానిష్ వంటి యువకులను తీవ్రవాద సంస్థల వైపు మళ్లించడంలో ఆమె కీలక పాత్ర పోషించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

Read Also: FASTag New Rules: సగం టోల్.. రెట్టింపు జరిమానా..! ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ధరలు.. ఫాస్టాగ్ గురించి కీలకమైన విషయాలు

ప్రస్తుతం సయీదా బేగంను విజయవాడలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇక, ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్‌లోని మల్లేపల్లి ప్రాంతానికి చెందిన మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సోషల్ మీడియా ద్వారా తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేయడం, దేశ వ్యతిరేక పోస్టులు చేయించడం వంటి అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసుల దర్యాప్తులో దేశవ్యాప్తంగా సుమారు 42 మందితో కూడిన నెట్‌వర్క్ ఏర్పాటుచేసినట్లు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ గ్రూప్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన యువకులు ఉన్నట్లు సమాచారం. సోషల్ మీడియా వేదికల ద్వారా తీవ్రవాద ప్రచారం నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసును పోలీసులు అత్యంత కీలకంగా తీసుకుని దర్యాప్తును మరింత విస్తరించారు. దేశ భద్రతకు ముప్పుగా మారే అవకాశాలపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.