Shakambari Utsavalu 2025: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో విశిష్టంగా నిర్వహించే ఈ మహోత్సవాలు, ఈసారి కూడా ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి పౌర్ణమి వరకు మూడు రోజుల పాటు భక్తిశ్రద్ధల మధ్య కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా దుర్గమ్మ అమ్మవారు శాకంబరీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ప్రత్యేకంగా కూరగాయలతో అలంకరించి, ప్రకృతి మాతగా పూజలందుకుంటున్నారు. మొదటి రోజైన ఈరోజు ఆలయ అలంకరణ, కదంబం ప్రసాదం తయారీ నిమిత్తంగా సుమారు 50 టన్నుల కూరగాయలు వినియోగించారు. గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల దాతల సహకారంతో ఈ కూరగాయలు సేకరించబడ్డాయి.
Read Also: YS Jagan: ఇడుపులపాయకు వైఎస్ జగన్
ఈ రోజు నుంచి ప్రారంభమైన ఉత్సవాలు జూలై 10వ తేదీతో ముగియనున్నాయి. ఈ మూడు రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచీ వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారికి విరాళంగా కూరగాయలు సమర్పిస్తూ, శ్రద్ధాభక్తులతో భక్తులు ఈ ఉత్సవాల్లో భాగస్వాములు అవుతున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రత్యేక దర్శనాలు, అంతరాలయ దర్శనలు రద్దు చేశారు. ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలన్నీ కూడా కూరగాయలతో కళకళలాడేలా తీర్చిదిద్దారు.