Indrakeeladri: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం ఐదు గంటల సమయానికి సుమారు 85 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇప్పటి వరకు 10 రోజుల్లో మొత్తం 11 లక్షల 28 వేల 923 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని దుర్గగుడి ఈవో వీకే శీనానాయక్ తెలిపారు. దేవస్థానం లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 17 లక్షల 29 వేల 57 లడ్డూలు అమ్ముడుపోగా, 2 లక్షల 33 వేల 116 మంది అన్నప్రసాదం స్వీకరించారు అని పేర్కొన్నారు. ఇక, చిన్నారులకు ప్రత్యేక రక్షణ చర్యగా ఇప్పటి వరకు 49 వేల 597 చైల్డ్ ట్యాగ్లు అమర్చినట్లు ఈవో వీకే శీనా నాయక్ వెల్లడించారు.
Read Also: Tribal Students Death: అనారోగ్యంతో గిరిజన విద్యార్థినులు మృతి.. భయాందోళనలో తల్లితండ్రులు
అయితే, రేపు భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయని ఇంద్రకీలాద్రి ఈవో శీనా నాయక్ తెలిపారు. రేపు ఎలాంటి వీఐపీ దర్శనాలు, ప్రోటోకాల్ దర్శనాలు ఉండవని స్పష్టం చేశారు. అన్ని క్యూలైన్లు ఉచితమే.. ప్రతి భక్తునికి ఉచితంగా 20 గ్రాముల లడ్డూ ప్రసాదం అందజేస్తామన్నారు. కాగా, కృష్ణా నదిలో వరద కారణంగా రేపు జల విహారం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. భక్తుల సౌకర్యార్థం హంస వాహనంపై ఉత్సవ మూర్తులతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నామన్నారు. అర్థరాత్రి 2 గంటల నుంచే (తెల్లవారితే గురువారం) అమ్మవారి దర్శనాలు ప్రారంభం కానున్నాయి.