Vijayawada Floods: తెలుగు రాష్ట్రాల్లో వరదలు పూడ్చలేని నష్టాన్ని మిగిల్చాయి. కొంపాగోడు తుడిచిపెట్టుకుపోయాయి. మూగజీవాలు కళ్లముందే జలసమాధయ్యాయి. ఇక వాహనాల సంగతి సరేసరి. బురదలో కూరుకుపోయి.. వరదకు కొట్టుకుపోయి.. నీళ్లలో నానిపోయి.. బయటపడుతున్న బండ్లను చూస్తుంటే ఉసూరుమంటోంది. వందల కార్లు, వేల బైక్‌లు, ఆటోలు, ట్రాలీలు వారం రోజులుగా ముంపులోనే ఉండిపోయాయి. వరద నీరు నెమ్మదిగా వెళ్లిపోవడంతో బురదలోంచి బయటపడ్డాయి. నొక్కులుపోయి.. రంగుపోయి…అద్దాలు పగిలిపోయి..డోర్లు బిగుసుకుపోయి.. ముఖ్యంగా ఇంజిన్లలోకి నీళ్లు వెళ్లి.. పనికొస్తాయా లేదా అన్నమానంతో ఉన్నారు బాధితులు. కొన్ని వాహనాలు కంటికి కనిపించకుండా పోయాయి. వరద ప్రవాహం ఎటు వెళ్లిందో ఆ అంచనాను బట్టి వెళ్లి వెతుక్కుంటున్నారు కొందరు.
విజయవాడలో లక్షకు పైగా బైక్‌లు.. 30వేల పైచిలుకు కార్లు.. 5 వేల పైబడి ఆటోలు, ఇతరాత్ర వాహనాలు నీటమునిగాయి. ఇది కేవలం ఇప్పుటి వరకున్న అంచనా మాత్రమే. ప్రస్తుతం ఇవేవీ పనికొచ్చేలా కనపించడం లేదు. రిపేర్ చేసినా ఏం నడుస్తాయో అన్న అనుమానం ఉంది. చివరి ప్రయత్నంగా వాహనాలను బురదలోంచి లాగి మెకానిక్ దగ్గరకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం విజయవాడలోని ఏ మెకానిక్ షెడ్ చూసినా ఫ్లడ్ ఎఫెక్టెడ్ వెహకిల్సే. ముంపు ప్రాంతాలకు సమీపంలో ఉన్న షాపులన్నీ రద్దీగా మారాయి. ప్రతి షెడ్ దగ్గర వందలాది వాహనాలు నిలిచిపోయాయి. రోజుల సమయం పడుతుందని చెప్పినా బండి నడవడకపోదా అనే ఆశతో రిపేర్ చేయండని చెబుతున్నారు!
అయితే బైక్‌లకు మోపెడ్‌లకు పెద్దగా ప్రాబ్లమ్స్ రావని మెకానిక్ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ కొత్త బండ్లయితే టెన్షన్ పడొద్దని అంటున్నారు. కారు ఇంజిన్‌లోకి నీళ్లుపోతే బండిని స్టార్ట్ చేయొద్దని సూచిస్తున్నారు. పెట్రోల్ ట్యాంక్ సహా మునిగితే బడ్జెట్ ఎక్కువ అవుతుందని అంటున్నారు. వారంటీలో ఉంటే షో రూం వాళ్లే రిపేర్ చేసే అవకాశం ఉంది. చేసుకున్న ఇన్షూరెన్స్‌లో వరదలు, భూకంపాల కవరేజీ ఉందో లేదో చెక్ చేసుకుని ఆ ప్రకారం బండిని బాగు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బైక్లు, కార్లు, ఆటోలు, ఇలా వాహనాలన్నింటినీ శుభ్రం చేసే బాధ్యత కూడా తామే తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. వాటికి రిపేర్లు చేయించే బాధ్యత కూడా తమదేనన్నారు. ఆయా వాహనాల ఇన్సూరెన్సు క్లెయిమ్స్ సైతం 15 రోజుల్లో సెటిల్ అయ్యేలా చూసేందుకు బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ముంపు ప్రాంతాల్లో ఉన్నవారంతా పేద, మధ్యతరగతి ప్రజలే కాబట్టి వారి పట్ల మానవీయ కోణంలో స్పందించాలని అన్నారు. ఈఎంఐల విషయంలో కూడా ఒత్తిడి చేయొద్దని కోరారు చంద్రబాబు.