Bonda Uma: విజయవాడ మేయర్ అభ్యర్థి ఎంపికపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు సిద్ధార్థ్‌కు మేయర్ సీటు ఇవ్వాలని కోరిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబును నేరుగా కలిసి సీటు కేటాయించాలని అడిగినట్లు వెల్లడించారు. అయితే, మేయర్ సీటును టీడీపీకి కేటాయించి ఉంటే తమకు అవకాశం వచ్చేదని, పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో వంగవీటి రాధాకు అవకాశం దక్కిందని పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో వంగవీటి రాధా గెలుపు కోసం తాను నిస్వార్థంగా పనిచేస్తానని స్పష్టం చేశారు బోండా ఉమా.. రాధాతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తాను పట్టించుకోనని అన్నారు. రాధా లక్ష ఓట్ల మెజారిటీతో మేయర్‌గా గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు, ఏబీ వెంకటేశ్వరరావు గురించి మాట్లాడుతూ, ఆయన ప్రముఖులకు మాత్రమే తెలుసని, కింది స్థాయి ప్రజలకు పెద్దగా పరిచయం లేదని వ్యాఖ్యానించారు. బ్యూరోక్రాట్లు వచ్చి ఏదో చేస్తామని చెబితే ప్రజలు స్వీకరించరని అభిప్రాయపడ్డారు. ప్రజల్లోకి వెళ్లి పనిచేయడం ముఖ్యమని స్పష్టం చేశారు.
ఇక, పార్టీలో రెబల్ అభ్యర్థుల అంశంపైనా బోండా ఉమా స్పందించారు. రెబల్స్‌ను అదే రోజు పోటీ నుంచి విరమింపజేస్తామని, వారు కచ్చితంగా నామినేషన్లను ఉపసంహరించుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ఒకే సీటును ఇద్దరు ముగ్గురు ఆశించినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏర్పడటం సహజమని పేర్కొన్నారు. రెబల్స్ ఉపసంహరణతో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అందరూ కలిసి పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడ మేయర్ ఎన్నిక నేపథ్యంలో బోండా ఉమా చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యంగా తన కుమారుడికి సీటు ఆశించిన విషయాన్ని అంగీకరిస్తూనే, వంగవీటి రాధా గెలుపు కోసం పనిచేస్తానని ప్రకటించారు బోండా ఉమా..

