వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటి దగ్గర జరిగిన దాడి ఘటనపై మాజీమంత్రి అంబటి రాంబాబు స్పందించారు. కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం ఇంటి గేటును ట్రాక్టర్ తో గుద్ది డ్యామేజ్ చేశారన్నారు. ముద్రగడ ఇంట్లో భయానక వాతావరణం సృష్టించారని, అక్కడ ఉన్న ఫ్లెక్సీలు చింపి అరాచకమైన పరిస్థితులు సృష్టించారని తెలిపారు. దాడి చేసిన వ్యక్తిని ఎవరని అడిగితే తాను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పారని.. దీంతో దాడి చేసిన వ్యక్తి జనసేన కార్యకర్త అని స్పష్టమైందని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
ఇలాంటి దౌర్జనాలు డిప్యూటీ సీఎం ప్రోత్సహించటం సమంజసం కాదని అంబటి రాంబాబు ఆరోపించారు. తక్షణమే ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి ఖండించాలని తెలిపారు. ఘటనపై పవన్ ఖండించకపోతే ప్రజాస్వామ్యంలో దౌర్జన్యాలను ప్రోత్సహించినవారవుతారని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యంలో ప్రతీ ఒక్కరూ ఖండించాలన్నారు. ఘటనకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని.. దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని నూతనంగా వచ్చిన డీజీపీని కూడా కోరుతున్నానని అంబటి రాంబాబు తెలిపారు.
Read Also: Gadikota Srikanth Reddy: సీఎం పర్యటన రాయచోటి నియోజకవర్గ ప్రజలకు నిరాశ మిగిల్చింది..
మరోవైపు.. ముద్రగడ కారుపై దాడి ఘటనపై కాకినాడ జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు స్పందించారు. జనసేన పార్టీ విలువలతో ఏర్పడిన పార్టీ అని అన్నారు. ఇలాంటి దాడులు ఎవరి మీద జరిగినా అది తప్పు అని పేర్కొన్నారు. ఈ దాడిని ఖండిస్తున్నానని చెప్పారు. దాడి చేసిన వ్యక్తి జనసేన కార్యకర్త అని ప్రచారం జరుగుతుంది.. ఆ వ్యక్తిని తాను జనసేనలో ఎప్పుడు చూడలేదని అన్నారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసుల విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయని జనసేన నేత తుమ్మల బాబు పేర్కొన్నారు.