Amaravati Avakaya Festival 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్కృతి, చరిత్రను చాటి చెప్పేలా అమరావతి-ఆవకాయ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.. ఆవకాయ అనగానే ప్రపంచవ్యాప్తంగా గుర్తుకు వచ్చేది ఆంధ్రప్రదేశ్. అలాంటి ఘనమైన ఆంధ్ర వంటక వైభవాన్ని, అమరావతి సంస్కృతిని, తెలుగు సినీ చరిత్ర ఔన్నత్యాన్ని ఒకే వేదికపై చాటిచెప్పేలా అమరావతి–ఆవకాయ ఫెస్టివల్ 2026 అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. విజయవాడ వేదికగా నిర్వహించిన ఈ ఉత్సవానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై, కార్యక్రమాన్ని ప్రారంభించారు.. ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. తెలుగు సినిమా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ఆవకాయ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఇటువంటి కార్యక్రమాలను ఆనవాయితీగా కొనసాగించాలి. తెలుగు జాతి ఔన్నత్యాన్ని, మన సంప్రదాయాలను మనమే కాపాడుకోవాలి అని అన్నారు.
రాష్ట్ర సంస్కృతి, వంటకాలు, సృజనాత్మక రంగాలను ప్రోత్సహించేలా ఈ ఫెస్టివల్‌లో 28 ప్రత్యేక ఈవెంట్లు, 4 వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో ఫుడ్ అంటే భారతదేశం.. భారతదేశంలో ఫుడ్ అంటే ఆంధ్రప్రదేశ్ గుర్తుకు వచ్చే స్థాయికి మన వంటకాలకు ఖ్యాతి ఉంది అంటూ ఆంధ్ర వంటల గొప్పదనాన్ని సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఉత్సవాలు, సంబరాలు లేక ప్రజల్లో నవ్వులు కూడా కరువయ్యాయని, కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజయవాడలో నిర్వహించిన విజయవాడ ఉత్సవ్, అమ్మవారి దసరా ఉత్సవాలను ప్రపంచస్థాయిలో నిలబెట్టామని చంద్రబాబు గుర్తుచేశారు. ఒకప్పుడు దసరా అంటే మైసూరు, కలకత్తా గుర్తుకు వచ్చేవి. ఇప్పుడు దసరా అంటే విజయవాడ గుర్తుకు వచ్చేలా ఉత్సవాలు నిర్వహించాం అని చెప్పారు.
తెలుగు సినీ చరిత్ర గురించి ప్రస్తావించిన సీఎం చంద్రబాబు.. భక్త ప్రహ్లాద నుంచి బాహుబలి వరకు తెలుగు చిత్రసీమ ఎన్నో ప్రయోగాలు చేసింది. ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, శోభన్‌బాబు వంటి మహానటులు కృష్ణాజిల్లా నుంచే వచ్చి సినిమా రంగానికి దిక్సూచిగా నిలిచారు.. పవన్ కల్యాణ్, బాలకృష్ణ వంటి వారు తెలుగు సినిమాను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తున్నారు అని కొనియాడారు. కృష్ణాజిల్లా సంపద సృష్టిలో, వ్యాపార చొరవలో ఎప్పుడూ ముందే ఉంటుందని సీఎం ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇక్కడివారు చేయని వ్యాపారం లేదు. సంపద సృష్టిలో కృష్ణాజిల్లా వారే ముందున్నారు. ఒకప్పుడు శారీరక శ్రమతో కష్టపడి పనిచేసేవారు. ఇప్పుడు హార్డ్‌వర్క్‌కు తోడు స్మార్ట్‌వర్క్ కూడా వచ్చేసింది అని అన్నారు.
అలాగే.. తెలుగు ప్రజలు ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా తమ భాషను, ప్రతిభను చాటుతూ స్థిరపడుతున్నారని సీఎం చంద్రబాబు గర్వంగా తెలిపారు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లి అరిచినా తెలుగు ప్రజలు పలుకుతారు. 25 ఏళ్ల క్రితమే ఇంట్లో పిల్లలను ఐటీ చదివించాలని నేను చెప్పాను. అప్పటి విద్యార్థులే నేడు అనేక దేశాల్లో ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు అని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి విజన్‌ను వివరించిన చంద్రబాబు.. విశాఖను ఏఐ హబ్‌గా తీర్చిదిద్దుతామని, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ద్వారా ఇంట్లోనే గ్యాస్ తయారు చేసుకునే సాంకేతికతను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఏఐ వస్తే ఉద్యోగాలు పోతాయని కొందరు భయపడుతున్నారు. కానీ, టూరిజం, సాంకేతిక రంగాల ప్రోత్సాహంతో ఉద్యోగాలు మరింతగా సృష్టించగలం. అందుకే టూరిజంను ప్రమోట్ చేస్తున్నాం అని సీఎం స్పష్టం చేశారు. ఆంధ్ర సంస్కృతి, రుచులు, సినిమా చరిత్ర, సాంకేతిక అభివృద్ధి సమ్మేళనంగా ప్రారంభమైన ఈ ఆవకాయ అమరావతి ఫెస్టివల్ రాష్ట్రానికి మరో ప్రత్యేక గుర్తింపుగా నిలవనుందని నిర్వాహకులు తెలిపారు. మామిడి రైతులు, ఫుడ్ స్టార్టప్‌లు, సినీ అభిమానులు, పర్యాటక రంగ నిపుణులు, సాంకేతిక నిపుణులు ఒకే వేదికపై పాల్గొనడం ఈ ఉత్సవం ప్రత్యేకత. తెలుగు జాతి గౌరవాన్ని, సంస్కృతి వైభవాన్ని, ఆంధ్ర రుచుల పరిమళాన్ని ప్రపంచానికి మరింతగా చాటిచెప్పే దిశగా ఈ ఫెస్టివల్ సాగనుంది.