Vijayawada Floods: విజయవాడలో వరదలు బీభత్సం సృష్టించాయి.. ఇప్పటికీ చాలా ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.. ఇక, వరదల్లో చిక్కుకున్న గర్భిణిలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.. తదుపరి 10 రోజుల్లో ప్రసవించే 154 మంది గర్భిణిలను వైద్య ఆరోగ్య శాఖ సురక్షిత ప్రాంతాలకు చేర్చిందని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు.. వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు అత్యవసర ఆరోగ్య సేవల్ని అందించేందుకు అనేక కార్యక్రమాల్ని చేపట్టిందన్నారు. పునరావాస కేంద్రాలకు అనుబంధంగా 14 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించడంతో పాటు వీటికి అదనంగా 20 సంచార వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసి వైద్య సేవల్ని అందించిందన్నారు. ఈ వైద్య శిబిరాల ద్వారా ఇప్పటివరకు 17,538 మంది రోగులు సేవలు పొందారని వివరించారు..
Read Also: Upasana Kamineni Konidela: వెల్‌నెస్ ‘షార్క్’ – ఎంపరింగ్ విమెన్ ఎంటర్‌ప్రిన్యూవర్స్
భారీ వర్షాలు.. వరదలతో విజయవాడ నగరంలో పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాల్ని చేపట్టి, ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి తగిన వసతుల్ని కల్పించిందని పేర్కొన్నారు కృష్ణబాబు.. సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తున్నారన్నారు. విజయవాడ నగరంలో 32 వార్డ్స్ జలదిగ్బంధం లో చిక్కుకొన్న దృష్ట్యా అందరకి 6 రకములైన అత్యవసరమైన మందులను, వాటిని వాడే విధానం తెలియచేసే కర పత్రాన్ని జత చేస్తూ సుమారు 75,000 కిట్స్ ను హెలికాప్టర్ ద్వారా, బోట్స్ ద్వారా మరియు రోడ్డు మార్గములో అందించడం జరుగుతోందన్నారు. . అత్యవసర వైద్య సేవల కోసమై అదనంగా ఇరవై అయిదు 108 అంబులెన్సులను అందుబాటులో ఉంచామన్నారు. వరదలతో వ్యాధులు పెరిగి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవల కోసమై వచ్చే రోగుల సౌలభ్యం కోసం అదనంగా 100 పడకలను ఏర్పాటు చేశామన్నారు. వివిధ కాలనీల్లో నీటిమట్టం తగ్గు ముఖం పడుతున్న దృష్ట్యా సంక్రమిత వ్యాధులు ప్రబలే అవకాశం వున్నందున విస్తారమైన వైద్య సహాయక ఏర్పాట్లు చేయడం జరుగుతోందన్నారు. వీటిలో భాగంగా 32 వార్డ్స్ లో 64 వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతోందని, ఈ వైద్య శిబిరాలలో రోగులకు అవసరమగు వైద్య పరీక్షలు చేసి ఉచితముగా మందులను అందిస్తారన్నారు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు.