ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తిగిరికి, అలాగే ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ అధికారులకి రక్షిణ కల్పించాలంటూ.. టీడీపీ నేత వర్ల రామయ్య డీజీపీకి లేఖ రాశారు. ఈ కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారినప్పటి నుంచి అతనికి ప్రాణహాని ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే.. అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు అతనిపై తప్పులు కేసులు బనాయిస్తున్నారని, చివరికి సీబీఐ బృందాన్ని కూడా విడిచిపెట్టడం లేదని అన్నారు. సీబీఐ దర్యాప్తు అధికారిపై కూడా తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. అంతటితో ఆగకుండా.. సీబీఐ టీమ్‌పై బాంబులు విసురుతామంటూ బెదిరింపులకు కూడా పాల్పడ్డారని వర్ల రామయ్య ఆరోపించారు.
వివేకా హత్యకేసులో అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉండటం వల్ల.. వారి ఆదేశాల మేరకే పోలీసులు వ్యవహరిస్తున్నారని, ప్రజల్లోనూ అదే అభిప్రాయం ఉందని వర్ల రామయ్య తెలిపారు. వివేకా హత్యకు కారకులైన నిందితులపై పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరికి, అలాగే ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ అధికారులకి సరైన భద్రత, రక్షణ కల్పించడం చాలా ముఖ్యమన్నారు. దస్తగిరికి గానీ, సీబీఐ దర్యాప్తు అధికారులకు గానీ ఏదైనా హాని జరిగితే.. అందుకు వైసీపీ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అధికార పార్టీ నేతల ఆదేశాల మేర కాకుండా.. రాజ్యాంగం ప్రకారం పోలీసులు నడుచుకోవాలని వర్ల రామయ్య విజ్ఞప్తి చేస్తున్నారు.