జోనల్ కౌన్సిల్ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతినిధులకు పలు సూచనలు చేసారు అమిత్ షా. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను రాష్ట్రాలు వేగవంతం చేయాలి. ముఖ్యమంత్రులు స్వయంగా పర్యవేక్షించాలి అన్నారు. ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ లో కేంద్రం సవరణలు చేయనుంది. రాష్ట్రాలు కూడా తమ సూచనలు, సలహాలు ఇవ్వాలి. డ్రగ్స్ రవాణా, వాడకాన్ని అరికట్టడానికి ముఖ్యమంత్రులు చొరవ చూపాలి. దేశంలో ఒక ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ, రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీల ఏర్పాటు చేసారు. రాష్ట్రాలు కూడా స్థానిక భాషలో ఫోరెన్సిక్ సైన్స్ కాలేజీలను ఏర్పాటు చేయాలి అని తెలిపారు.
అలాగే నేరాల నియంత్రణకు ప్రత్యేకంగా డైరెక్టర్ ఆఫ్ ప్రొసిక్యూషన్ వ్యవస్థను రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి. ఇక నుంచి ఏటా నవంబర్ 15వ తేదీన జన్ జాతీయ గౌరవ దినోత్సవంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. స్వాతంత్య్ర ఉద్యమం, దేశాభివృద్ధి లో గిరిజనుల పాత్రను గుర్తించి గౌరవించడం దీని ఉద్దేశ్యం. దీని కోసం రాష్ట్రాలు ఒక కార్యాచరణను రూపొందించాలి అని పేర్కొన్నారు.