మండువేసవిలో వర్షం పడితే బాగానే వుంటుంది. కానీ ఆ వర్షం బీభత్సంగా మారితే నష్టం తీవ్రత చాలా ఎక్కువగా వుంటుంది. నెల్లూరు జిల్లాలో అకాల వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని కలిగించాయి. మెట్ట ప్రాంతంలో కోతకు వచ్చిన పంట నేలకొరగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు కళ్ళ ముందే నేల కొరగడంతో రైతులు ఆవేదన అంతా ఇంతా కాదు. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, వరికుంటపాడు, ఆత్మకూరు, డక్కిలి, వెంకటగిరి ప్రాంతాల్లోఉరుములు..మెరుపులు. ఈదురు గాలులతో వర్షం కురవడంతో పంటలు నేలకొరిగాయి.
ప్రధానంగా వరి, మామిడి, నిమ్మ, బత్తాయి పంటలకు అపార నష్టం కలిగింది. ప్రధానంగా మెట్ట ప్రాంతాల్లో పండించిన వరి పంట. కోతకు వచ్చే సమయంలో వాలిపోయింది. గాలుల ధాటికి వడ్లు రాలిపోవడంతో రైతులు కంట తడి పెడుతున్నారు. ఎకరానికి 30 నుంచి 40 వేల రూపాయల వరకూ పెట్టుబడి పెట్టామని..కోత సమయానికి గాలి వచ్చి నష్టం కలిగించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గాలుల ధాటికి మామిడి, నిమ్మ, బత్తాయి కాయలు నేల రాలాయి. పంట అమ్ముకునే సమయంలో రాలి పోవడం నష్టాన్ని మిగిల్చిందని రైతులు అంటున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు 2 కోట్ల రూపాయల మేర నష్టం కలిగినట్లు అధికారులు భావిస్తున్నారు. మొత్తం మీద అకాల వర్షాల వల్ల కలిగిన నష్టం నుంచి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
