NTV Telugu Site icon

Undavalli: ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు.. పోలవరం ఎప్పటికీ పూర్తి కాదు..!

Undavalli

Undavalli

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ, సీనియర్‌ రాజకీయ నేత ఉండవల్లి అరుణ్ కుమార్… పోలవరం నిర్మాణం పూర్తి కాదని ఆయన స్పష్టం చేశారు.. పోలవరం డ్యామ్ అనేది ఉండదన్న ఆయన.. భారీ ఎత్తున పరిహారం ఇవ్వాల్సి ఉంటుందన్నారు.. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదని నేను మానసికంగా సిద్ధపడ్డానని పేర్కొన్న ఆయన.. ఏదో చిన్నపాటి రిజర్వాయర్ అయినా పూర్తి చేస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను అన్నారు.. పోలవరాన్ని కట్టే ఉద్దేశ్యం కేంద్రానికి లేదు.. అడిగే ధైర్యం ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీలకు లేదు అంటూ ఘాటు విమర్శలుచేశారు.

Read Also: Mumbai: మహిళతో వృద్ధుడి శృంగారం.. మధ్యలోనే కుప్పకూలి..!

గతంలో టీడీపీ ప్రభుత్వం ఎలా ఉందో.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వమూ అలాగే ఉందన్నారు ఉండవల్లి… కేంద్రం కట్టాల్సిన పోలవరాన్ని చంద్రబాబు ఎందుకు భుజాలకెత్తుకున్నారని నాడు వైసీపీ ప్రశ్నించిందని గుర్తుచేసిన ఆయన.. పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని ఇప్పటి ఇరిగేషన్ మంత్రి చెప్పారు.. ఇందులో నిజముందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కేంద్రానికి పోలవరం బాధ్యతలు ఎందుకు అప్పగించ లేదు..? అని నిలదీశారు ఉండవల్లి.. పోలవరంతో సహా విభజన హక్కులను సాధించుకునే పరిస్థితి లేదన్నారు. దానిపై గత కారణాలపై కూడా సీరియస్‌ కామెంట్లు చేశారు.

ప్రధాన పార్టీల అధినేతల ఆస్తులు హైదరాబాదులోనే ఉన్నాయన్నారు ఉండవల్లి.. హెరిటేజ్, భారతి సంస్థల హెడ్‌ ఆఫీసులు హైదరాబాద్‌లోనే ఉన్నాయని గుర్తుచేసిన ఆయన.. హైదరాబాద్‌లో ఆస్తులు ఉన్నాయి కాబట్టే వైసీపీ, టీడీపీలు విభజన సమస్యలపై పోరాడలేకపోతున్నాయని ఆరోపించారు.. ఈ విషయాలన్నీ చాలా రోజుల నుంచి నేను చెబుతూనే ఉన్నా.. ఎవ్వరూ పట్టించుకోవడం… అందుకే నేను ప్రెస్ కాన్ఫరెన్స్‌లు తగ్గించేశానని తెలిపారు. ఇక, చంద్రబాబు హయాంలో కనీసం నన్ను విమర్శించడానికైనా మాట్లాడేవారు.. కానీ, వైసీపీ వాళ్లు ఏం మాట్లాడడం లేదు.. అయితే, సోషల్ మీడియాలో బెదిరిస్తున్నారని మండిపడ్డారు. డయాఫ్రమ్ వాల్ పోయిందని 2017లోనే నేను చెప్పాను.. అప్పట్లో నేను చెబితే నన్ను నాటి మంత్రి విమర్శించారని గుర్తుచేసుకున్నారు ఉండవల్లి అరుణ్‌ కుమార్‌.