NTV Telugu Site icon

Srisailam Dam Gates Opened: కృష్ణమ్మ పరవళ్లు.. శ్రీశైలం డ్యామ్‌ గేట్లు ఎత్తివేత.. పర్యాటకుల తాకిడి..!

Srisailam Dam

Srisailam Dam

కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది… కృష్ణా బేసిన్‌ లోని ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగుతోంది.. జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండగా.. 14 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.. ఇన్ ఫ్లో రూపంలో 1,08,000 వేల క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా.. ఔట్ ఫ్లో 1,00,374 క్యూసెక్కులుగా ఉంది.. జూరాల పూర్తి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 9.173 టీఎంసీలుగా ఉంది… ఉంది.. 12 యూనిట్లతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండగా.. ఎత్తి పోతల పథకాలకు నీటి విడుదల కొనసాగిస్తున్నారు అధికారులు.. ఇక, శ్రీశైలం డ్యామ్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.. ఇన్ ఫ్లో రూపంలో 1,78,003 క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతుండగా.. జలాశయం 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.. జల విద్యుత్‌ ఉత్పత్తి, రెండు గేట్ల ద్వారా 1,19,763 క్యూసెక్కుల నీరు డ్యామ్‌ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నిండుకుండలా మారి గరిష్టస్థాయికి చేరింది నీటిమట్టం..

Read Also: RBI circular: అట్లయితే డబ్బులే. బంగారం ఇవ్వం. ఆర్బీఐ సర్క్యులర్‌.

ఇక, శ్రీశైలం డ్యామ్‌ గేట్లు ఎత్తడం, వరుస సెలవులు కావడంతో.. శ్రీశైలం డ్యామ్‌ సందర్శనకు క్యూ కడుతున్నారు పర్యాటకులు.. ఇవాళ శ్రావణ శుక్రవారం సెలవు ఉండగా.. ఆ తర్వాత శని, ఆదివారాలే కావడంతో.. క్రమంగా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి, డ్యామ్‌ సందర్శనకు వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.. శ్రీశైలం డ్యామ్‌ గేట్లు ఎత్తివేస్తే.. అక్కడ వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.. డ్యామ్‌ నుంచి గేట్ల ద్వారా వచ్చే నీరు.. మళ్లీ పైకి ఎగిసిపడితే.. మనసు పులకించిపోతుంది.. ఇక, ఆ నీటి తుంపర్లు.. ఘాట్‌ రోడులపై వెళ్తున్న వాహనాలపై కూడా పడుతుంటాయి.. వాటిలో తడిసి ముద్దవ్వడానికి పర్యాటకులు ఇష్టపడుతుంటారు.. అందుకే గేట్లు ఎత్తివేసి సమయంలో.. శ్రీశైలానికి పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది.

మరోవైపు.. నాగార్జున సాగర్‌ డ్యామ్‌లోని నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది.. ఇన్ ఫ్లో రూపంలో 1,19,763 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులో వచ్చి చేరుతుండగా.. కుడి కాలువకు 1,969 క్యూసెకులు, ఎడమ కాలువకు 3,490 క్యూసెకులు.. మొత్తంగా 12,104 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు నుంచి విడుదల చేస్తున్నారు.. సాగర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు అయితే, ప్రస్తుత నీటి నిలువ 240 టీఎంసీలుగా ఉంది.. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 563 అడుగులకు చేరింది.. శ్రీశైలం నుంచి వరద నీరు వచ్చిచేరుతుండడంతో.. సాగర్‌లో నీటిమట్టం పెరుగుతోంది. ఈ ఏడాది జులై నెల నుంచే నాగార్జున సాగర్‌కు వరద నీరు వచ్చిచేరుతోన్న విషయం తెలిసిందే.

Show comments