ఢిల్లీలోని టీటీడీ దేవాలయం “స్థానిక సలహా మండలి” చైర్ పర్సన్‌గా వేద మంత్రాల ఆశీర్వచనంతో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బాధ్యతలు స్వీకరించినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆలయంలో గోపూజ ప్రశాంతి రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ… ఉత్తరాది రాష్ట్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆలయాల విస్తరణ, సేవల విస్తరణ కోసం ఢిల్లీ “లోకల్ అడ్వైజరీ కమిటీ” పనిచేస్తుందని ఆయన తెలిపారు.
ఉత్తరాదిన ఢిల్లీ, కురుక్షేత్ర సహా మరికొన్ని ప్రాంతాల్లో టీటీడీ ఆలయాలున్నాయని, జమ్మూలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన ఇప్పటికే జరిగిందని, టెండర్లు పిలిచి 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని నిర్దేశించామని వెల్లడించారు. అంతకంటే ముందే నిర్మాణం పూర్తవుతుందని భావిస్తున్నామన్నారు. అయోధ్యలో రామజన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీని స్థలం కేటాయించాలని కోరామని, దాన్ని బట్టి ఆలయం లేదా భజన మందిరం నిర్మించాలని భావిస్తున్నామని కానీ ఇంకా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు.
వివిధ పీఠాధిపతుల ఆధ్వర్యంలో “గో మహాసమ్మేళనం” నిర్వహించినట్లు తెలిపారు. ఆలయాలకు “ఆవు, దూడ”ను ఇచ్చే కార్యక్రమం చేపట్టామని, ఇప్పటికే వంద ఆలయాలకు ఇచ్చామని, “గో సంపద” పరిరక్షణ ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ ఆదేశాల మేరకు నిర్వహించామన్నారు. గోవును పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లే అన్న మాట ప్రకారం పని చేస్తున్నామని, గోవు ఆధారిత వ్యవసాయాన్ని సైతం ప్రోత్సహించాలని నిర్వహించామని తెలిపారు.
గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలను టీటీడీ కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. టీటీడీ ప్రసాదము, నిత్యాన్నదానానికి అవసరమైన ముడి సరుకును గో ఆధారిత వ్యవసాయం చేసే రైతుల నుంచి కొనుగోలు చేసి ప్రోత్సహించాలని భావిస్తున్నామన్నారు.