టీటీడీ బోర్డు గురువారం నాడు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమలలో గత కొంతకాలంగా నిలిచిపోయిన ఆర్జిత సేవలను పునరుద్ధరించాలని టీటీడీ నిర్ణయించింది. అంతేకాకుండా సిఫార్సు లేఖలపై ఆర్జిత సేవా టికెట్ల ధరలను భారీగా పెంచాలని నిర్ణయం తీసుకుంది. సుప్రభాత సేవకు రూ.2 వేలు, తోమాల, అర్చన సేవలకు రూ.5వేలు, వేద ఆశీర్వచనానికి రూ.10 వేలు, కళ్యాణోత్సవానికి రూ.2,500, వస్త్రాలంకరణ సేవా టికెట్ ధరను రూ.లక్షకు పెంచాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఆనంద నిలయానికి బంగారు తాపడ పనులతో పాటు అన్నమయ్య నడక మార్గాన్ని అభివృద్ధి చేయాలని సమావేశంలో తీర్మానించారు. అదేవిధంగా అలిపిరి వద్ద ఆధ్యాత్మిక సిటీ నిర్మాణానికి టీటీడీ నిర్ణయం తీసుకుంది.
మరోవైపు రూ.3,096 కోట్ల అంచనాతో 2022-23 వార్షిక బడ్జెట్‌కు టీటీడీ ఆమోదం పలికింది. రూ.230 కోట్ల వ్యయంతో పద్మావతి చిన్నపిల్లల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని టీటీడీ నిర్ణయించింది. స్విమ్స్ ఆస్పత్రిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని తీర్మానించింది. రూ. 2.7 కోట్ల వ్యయంతో స్విమ్స్ ఆస్పత్రిని పూర్తిగా కంప్యూటీకరణ చేయాలని నిర్ణయించింది.
టీటీడీ ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు రూ.25 కోట్లు కేటాయించింది. తిరుమలలో అన్నప్రసాదాన్ని మరిన్ని ప్రదేశాలలో భక్తులకు ఉచితంగా అందించాలని నిర్ణయించింది. నాదనీరాజనం మండపాని శాశ్వత ప్రాతిపాదికన నిర్మిస్తామని తెలిపింది. ఆయుర్వేద ఫార్మసీని రూ. 3.6 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తామంది. శ్రీనివాస సేతు ప్రాజెక్టుకు ఇప్పటి వరకు రూ.100 కోట్లు విడుదల చేశామని.. ఈ ఏడాది డిసెంబర్ లోగా మరో రూ.150 కోట్లు విడుదల చేస్తామని టీటీడీ వెల్లడించింది.