Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

‘నో-హ్యాండ్‌షేక్’ ట్రెండ్‌ను కొనసాగించిన భారత యువ క్రీడాకారులు.. పాక్‌పై ఘన విజయం

ఆసియా కప్ క్రికెట్, మహిళల ప్రపంచ కప్ తర్వాత మరో క్రీడా పోటీలోనూ భారత క్రీడాకారులు పాకిస్తాన్ జట్టుతో కరచాలనం చేయకుండా తమ వైఖరిని కొనసాగించారు. మూడవ ఏషియన్ యూత్ గేమ్స్‌లో (Asian Youth Games) భాగంగా జరిగిన కబడ్డీ మ్యాచ్‌లో భారత యువ జట్టు పాకిస్తాన్ టీమ్‌ను 81-26 తేడాతో చిత్తుగా ఓడించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత కెప్టెన్ ఇషాంత్ రాఠీ పాకిస్తాన్ కెప్టెన్‌తో కరచాలనం చేయడానికి నిరాకరించారు. పాకిస్తాన్ కెప్టెన్ చేయి అందించినా, రాఠీ తిరస్కరించడం గమనార్హం.

ఆసియా కప్ ట్రోఫీపై నఖ్వీ సూచన.. బీసీసీఐ కీలక నిర్ణయం!

2025 ఆసియా కప్ ట్రోఫీ అప్పగింత అంశంపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)తో చర్చించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ట్రోఫీ విషయంపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్‌ మోహ్సిన్ నఖ్వీ మొండి వైఖరితో ఉండటంతో.. త్వరలో జరగనున్న ఐసీసీ సమావేశంలో ఈ విషయాన్ని లేవనెత్తాలని బోర్డు యోచిస్తున్నట్లు బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు ఓ జాతీయ మీడియాకు తెలిపారు.

6 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు, 35 పరుగులు.. 148 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి!

క్రికెట్ ఆటలో ఎవరూ ఊహించని పలు రికార్డులు నమోదవుతుంటాయి. మైదానంలో ఎప్పటికప్పుడు ప్రపంచ రికార్డులు బద్దలు అవుతూనే ఉంటాయి. అలాంటి ఒక రేర్ రికార్డు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 145 సంవత్సరాల టెస్ట్ క్రికెట్‌లో ఎన్నడూ సాధించని రికార్డును ఓ టీమిండియా బౌలర్ బ్యాటింగ్‌లో బద్దలు కొట్టాడు. ఈ రికార్డు స్టార్ బ్యాట్స్‌మెన్‌లకు కూడా సాధ్యం కాలేదు. భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బ్యాటింగ్‌లో అరుదైన రికార్డు నెలకొల్పాడు.

2022 సంవత్సరంలో బర్మింగ్‌హామ్ (ఎడ్జ్‌బాస్టన్)లో ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య 5వ టెస్ట్ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మ్యాచ్‌లో రెండవ రోజు భారత ఇన్నింగ్స్ ముగింపు దశకు చేరుకుంది. జట్టు స్కోరు 9 వికెట్లకు 377 పరుగులు. బుమ్రా, మహమ్మద్ సిరాజ్ క్రీజులో ఉన్నారు. భారత ఇన్నింగ్స్ 84వ ఓవర్‌లో ఇంగ్లాండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్లో ఏకంగా 35 పరుగులు వచ్చాయి. 29 పరుగులు బుమ్రా బ్యాట్ నుండి రాగా.. మిగిలినవి అదనపు పరుగులు. ఇది 145 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఓవర్. విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా రికార్డును బుమ్రా బద్దలు కొట్టాడు. బ్రాడ్ అత్యంత చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.

రేవంత్ రెడ్డి ప్రకటనలు ఘనం.. ఆచరణ శూన్యం.!

మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలు ఘనంగా ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం శూన్యం అని ఆయన అన్నారు. “గాలి మాటలతో ప్రజలను ఎంతకాలం మోసం చేస్తారు?” అని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం నియమించిన స్కావెంజర్లకు 9 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం సిగ్గుమాలిన చర్య అని హరీష్ రావు పేర్కొన్నారు. చిన్న ఉద్యోగుల శ్రమను, కష్టాన్ని గౌరవించడం సర్కార్‌కు ఎందుకు సాధ్యం కాకపోతుందో విమర్శించారు.

జెసి ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై పోలీసులు ఫైర్.. వెంటనే క్షమాపణ చెప్పాల్సిందే..!

పోలీసులను ఉద్దేశించి జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అనంతపురం జిల్లా పోలీస్ అధికారుల సంఘం తీవ్రస్థాయిలో మండిపడింది. పోలీస్ అమరవీరుల దినోత్సవం రోజునే జేసీ ప్రభాకర్ రెడ్డి ఐపీఎస్ అధికారిని అవమానించారని, ఆయన వ్యాఖ్యలు పోలీసులను కించపరిచేలా అలాగే భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్నాయని పోలీస్ సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణ చెప్పాలని జిల్లా పోలీస్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది.

సీపీ సజ్జనార్ కు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఫిర్యాదు.. ఎందుకంటే..?

ఈ మధ్య సెలబ్రిటీల ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇంకొన్ని సార్లు అసభ్యకరంగా వాటిని మార్ఫింగ్ చేసి పోస్టులు పెడుతున్నారు. వీటిపై చాలా మంది ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విషయంలో సీపీ సజ్జనార్ ను కలిశారు. జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలను మార్ఫింగ్ చేస్తున్నారంటూ సీపీ సజ్జనార్ కు ఫిర్యాదు చేశారు ఎన్టీఆర్ అభిమానుల సంఘం సభ్యుడు నందిపాటి మురళి. తమ హీరో ఎన్టీఆర్ ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకర రీతిలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని తెలిపారు.

మాజీ సీఎంపై మంత్రి సంచలన ఆరోపణలు..!

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారిందని రాష్ట్ర మంత్రి సవిత సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కల్తీ మద్యం పాపానికి జగనే ప్రధాన పాపాత్ముడని ఆమె అన్నారు. కల్తీ మద్యం కారణంగా గత ఐదేళ్లలో 30 వేల మంది తమ ప్రాణాలు కోల్పోగా, 30 లక్షల మంది అమాయక ప్రజలు అనారోగ్యం పాలయ్యారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ నేతృత్వంలోని బ్యాచ్ లిక్కర్ మాఫియాగా ఏర్పడి ఏకంగా రూ. 3,500 కోట్లు దోచుకుందని మంత్రి సవిత ఆరోపించారు. కల్తీ మద్యం పేరుతో రాష్ట్రంలో అలజడి సృష్టించడానికి తాడేపల్లి ప్యాలెస్‌ లోనే కుట్రలు జరిగాయని ఆమె పేర్కొన్నారు. ఈ కల్తీ మద్యం ప్రణాళికల తయారీలో ఏ-1 జనార్దన రావు, జోగి రమేష్ కీలకంగా వ్యవహరించారని ఆమె తెలిపారు. కేవలం ఆంధ్రప్రదేశ్‌ లోనే కాకుండా, జగన్ బ్యాచ్ ఆఫ్రికా ఖండాన్ని కూడా వదల్లేదని మంత్రి సవిత తెలిపారు. జే బ్రాండ్ పేరుతో ఆఫ్రికాలో కూడా కల్తీ మద్యం విక్రయాలు జరిగాయని ఆమె వెల్లడించారు.

వైద్య సేవలో నిర్లక్ష్యంగా ఉండకండి.. డిప్యూటీ సీఎం సిరీస్..!

ఆధునిక వైద్య విధానాలు అందుబాటులో ఉన్న తరుణంలో ప్రసూతి సమయంలో అందించే సేవలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని… పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి ఎప్పటికప్పుడు ఇందుకు సంబంధించిన సేవలపై అనుభవజ్ఞులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి కాకినాడ జిల్లా కలెక్టర్, పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటీవల పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలుకి చెందిన దొండపాటి శ్రీదుర్గ పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో బిడ్డను ప్రసవించిన అనంతరం అపస్మారక స్థితికి చేరుకోవడం, కాకినాడ ఆసుపత్రికి తరలించగా మృతి చెందిన ఘటనపై సమీక్ష నిర్వహించారు. ప్రసూతి సమయంలో వైద్య సేవల విషయంలో ఏ దశలోనూ నిర్లక్ష్యంగా ఉండకూడదని, అప్రమత్తంగా ఉండాలని పవన్ స్పష్టం చేశారు. గర్భిణులకు వైద్యం నుంచి ప్రసవం వరకూ, అనంతర వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సక్రమంగా అందాలని చెప్పారు.

దుబాయ్ లో బిజీబిజీగా సీఎం.. ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, బుర్జిల్ హెల్త్ కేర్‌తో కీలక భేటీలు!

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటనలో మొదటి రోజు వివిధ పారిశ్రామిక వేత్తలతో వరుస సమావేశాలు నిర్వహించి పెట్టుబడులను ఆకర్షించేందుకు కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ ఛైర్మన్ రమేష్ ఎస్. రామకృష్ణన్, అలాగే బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ ఛైర్మన్ షంషీర్ వయాలిల్‌తో కీలక చర్చలు జరిపారు. ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ ఛైర్మన్‌తో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుగరాజపట్నం పోర్టులో షిప్ బిల్డింగ్ యూనిట్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. దీనిపై ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ సానుకూలంగా స్పందించి ఆసక్తి కనబరిచింది. రాష్ట్రానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని, లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించాలనే ఆలోచనలతో ఉన్నామని సీఎం వివరించారు. రాష్ట్రంలో త్వరలో మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టులు అందుబాటులోకి రానున్నాయని, రైలు, పోర్టులు, ఎయిర్ పోర్టుల కనెక్టివిటీ ఉండేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నామని ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ ప్రతినిధులకు చంద్రబాబు తెలిపారు.

మూసారాంబాగ్ బ్రిడ్జి కూల్చివేత.. స్థానికుల ఆగ్రహం

మూసారాంబాగ్ ప్రాంతంలో పాత బ్రిడ్జిని కూల్చివేయడానికి జీహెచ్ఎంసి అధికారులు చర్యలు చేపట్టారు. అయితే, కొత్త హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం ఇంకా పూర్తికాకముందే పాత బ్రిడ్జిని కూల్చివేయడం స్థానికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. గతంలో వచ్చిన వరదలలో దెబ్బతిన్న ఈ బ్రిడ్జి, ఇంజనీరింగ్ విభాగం ప్రకారం వాహనాల రాకపోకలకు సురక్షితం కాదని తెలుసుకున్నప్పటికీ, స్థానికుల అభ్యర్థనలను పక్కన పెట్టి ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. స్థానికులు చెప్పుతున్నదాని ప్రకారం.. అంబర్‌పేట్ నుంచి దిల్సుఖ్‌నగర్‌ వరకు గల ప్రత్యామ్నాయ మార్గం గోల్నాక బ్రిడ్జి మాత్రమే ఉంది. పాత బ్రిడ్జి కూల్చివేతతో, 300 మీటర్ల దూరాన్ని 5 కిలోమీటర్లుగా నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం నడవడానికి తాత్కాలిక మార్గం కూడా ఏర్పాటు చేయకపోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచుతోంది.

Exit mobile version