కులతత్వ విషాన్ని చిమ్ముతున్న వాళ్లను బీహారీలు తిరస్కరించారు..
సూరత్‌లో స్థిరపడిన బీహారీలు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మరోసారి స్పందిస్తూ.. విపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కులతత్వ విషాన్ని చిమ్ముతున్న వారిని, ముస్లిం లీగ్ -మావోయిస్టు భావజాలం కలిగిన వారిని ఇక్కడి ప్రజలు తిరస్కరించారని తెలిపారు. అలాగే, పదేళ్ల నుంచి వరుస ఓటములపై రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. అంతేకాదు.. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలతో పని చేసిన జాతీయ నాయకులు కూడా ఆ పార్టీ నేత చేసిన విన్యాసాలతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు.
జమ్మూ కాశ్మీర్‌లో 17 లక్షల బినామీ ఖాతాలు.. అకౌంట్లలో రూ.465 కోట్లు
జమ్మూ కాశ్మీర్‌లో 17.20 లక్షలకు పైగా బినామీ (అన్‌క్లెయిమ్డ్) బ్యాంకు ఖాతాలు గుర్తించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. వీటిలో మొత్తం రూ.465.79 కోట్లు క్లెయిమ్డ్ లేకుండా ఉన్నాయని వెల్లడించింది. ఈ ఖాతాల నిజమైన యజమానులను సంప్రదించి, వీలైనంత త్వరగా మొత్తాన్ని తిరిగి ఇచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) బ్యాంకులకు విజ్ఞప్తి చేసింది. జమ్మూ జిల్లాలో మాత్రమే 2,94,676 బినామీ ఖాతాలు ఉన్నాయని, వాటిలో రూ.107.27 కోట్లు జమ అయ్యాయని ఆర్‌బిఐ ప్రాంతీయ డైరెక్టర్ చంద్ర శేఖర్ ఆజాద్ తెలిపారు. బ్యాంకులు అటువంటి ఖాతాదారులను లేదా వారి వారసులను వెతికి, ఆ మొత్తాన్ని త్వరగా చెల్లించాలని ఆయన అన్నారు. ఈ పథకం కింద, బినామీ ఖాతాలను యాక్టివ్ చేసినందుకు లేదా మొత్తాన్ని తిరిగి ఇచ్చినందుకు బ్యాంకులకు బ్యాలెన్స్‌లో 7.5% వరకు లేదా గరిష్టంగా రూ. 25,000 వరకు ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పథకం సెప్టెంబర్ 30, 2026 వరకు అమలులో ఉంటుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల స్థాయి బ్యాంకర్ల కమిటీ అవగాహన, పరిష్కార శిబిరాలను నిర్వహించింది. ఇక్కడ ప్రజలకు వారి క్లెయిమ్ చేయని బ్యాంకు ఖాతాలు, బీమా, పెన్షన్ నిధులు, మ్యూచువల్ ఫండ్‌లు, డివిడెండ్ల గురించి సమాచారం అందించి, ధృవీకరించారు.
మహేష్ వైల్డ్ లుక్స్.. ట్రెండింగ్ లోకి ‘వారణాసి’..!
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్ హడావుడి గురించే చర్చ. హైదరాబాద్ శివారులో అత్యంత భారీగా ప్లాన్ చేసిన ఈ కార్యక్రమాన్ని అభిమానులతో పాటు వేలాదిమంది వీక్షిస్తున్నారు. ఈ ఈవెంట్ ప్రారంభంలోనే అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న టైటిల్స్ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాకు ‘వారణాసి’ అనే పేరును ఖరారు చేశారు. ఈ సందర్భంగా ‘వారణాసి’ టైటిల్ గ్లింప్స్ వీడియోను ఈవెంట్ స్క్రీన్ పై ప్రసారం చేశారు.
ఎర్ర చందనం తాకితే తాట తీస్తాం: స్మగ్లర్లకు డిప్యూటీ సీఎం పవన్ మాస్ వార్నింగ్
శేషాచలం అడవిలో జరుగుతున్న ఎర్ర చందనం దోపిడిపై ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో ప్రత్యేకంగా, పూర్తి స్థాయి ఆపరేషన్ ప్రారంభం అవుతుంది.. ఆపరేషన్ కాగర్ తరహాలో.. ఎర్ర చందనం తస్కరణలో ఉన్న ప్రతి ఒక్కరిని నిర్మూలించేందుకు ఈ ఆపరేషన్ కొనసాగుతుంది.. స్మగ్లర్లలో భయం నెలకొల్పుతాం.. మళ్లీ ఎవ్వరు ఒక్క ఎర్ర చందనం చెట్టునైనా తాకే ధైర్యం చేయలేని విధంగా చర్యలు తీసుకుంటాం.. శేషాచలం అడవి కేవలం అడవి కాదు.. భగవాన్ బాలాజీ పవిత్ర క్షేత్రం అన్నారు. ఎర్ర చందనం కోత ఆధ్యాత్మిక అవమానం, జాతీయ నష్టమని పేర్కొన్నారు. ఈ ఎర్రచందనం.. భూమి మీద మరెక్కడా దొరకని అపూర్వమైన సంపద అని పురాణ కథలు చెబుతున్నాయి.. ఎర్ర చందనం స్వయంగా శ్రీ వేంకటేశ్వర స్వామి దైవ రక్తం నుంచి పుట్టిందని ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భారీ అవకతవకలు బట్టబయలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కొనసాగుతున్న అవకతవకలను అరికట్టేందుకు అవినీతి నిరోధక శాఖ (ACB) పెద్ద ఎత్తున ఆకస్మిక దాడులు నిర్వహించింది. నవంబర్ 14న మొత్తం 23 బృందాలు గండిపేట్, సీరిలింగంపల్లి, మెద్చల్, నిజామాబాద్ టౌన్, జహీరాబాద్, మిర్యాలగూడ, వనపర్తి, మంచిర్యాల, పెడపల్లి, భూపాలపల్లి, వైరా వంటి పలు ప్రాంతాల్లోని SRO కార్యాలయాలను ఒకేసారి తనిఖీ చేశాయి.
ఈ తనిఖీల్లో భారీగా అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. అకౌంటింగ్‌లో నమోదు చేయని రూ.2,51,990 నగదు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదనంగా, కార్యాలయాలలో 289 నమోదిత పత్రాలు సంబంధిత దరఖాస్తుదారులకు ఇవ్వకుండా నిల్వ ఉంచినట్లు ACB గుర్తించింది. అనుమతి లేకుండా 19 ప్రైవేట్ వ్యక్తులు, 60 డాక్యుమెంట్ రైటర్లు కార్యాలయాల్లో తిరుగుతున్నట్లు బయటపడింది. పలు చోట్ల సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం కూడా ముఖ్యమైన లోపంగా అధికారులు గుర్తించారు.
హిందూపురం వైసీపీ కార్యాలయంపై దాడి.. తీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్!
హిందూపురంలోని వైసీపీ కార్యాలయంపై దాడిని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడి వైసీపీపై మాత్రమే కాదు.. ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి అన్నారు. ఈ అనాగరిక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను.. రాజకీయ పార్టీల కార్యాలయాలను ధ్వంసం చేయడం.. ఫర్నిచర్ పగలగొట్టడం, కార్యకర్తలపై భౌతికంగా దాడి చేయడం ప్రజాస్వామ్యంలో ప్రమాదకరమైన పతనాన్ని సూచిస్తుంది.. పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.. కొంత మంది పోలీసులు చంద్రబాబు రాజకీయ ఎజెండా కోసం పని చేస్తున్నారు అని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది అని మాజీ సీఎం జగన్ అన్నారు.
సుద్దకుంట మార్కింగ్స్ తొలగింపు.. ప్రజలకు హైడ్రా కమిషనర్ ధీమా
బోడుప్పల్‌లోని సుద్దకుంట చెరువు పరిసర ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ అకస్మిక పరిశీలన నిర్వహించారు. చెరువు వద్ద FTL పేరుతో HMDA, మున్సిపల్ అధికారులు ఇళ్లపై నెంబర్లు వేశారు, ఇనుప కడ్డీలు పెట్టి ప్రజల్లో భయాందోళనలకు గురిచేశారంటూ స్థానికులు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. 30 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నామని, అకస్మాత్తుగా FTL పేరుతో తమపై ఒత్తిడి తేవడం అన్యాయం అని వారు వేదన వ్యక్తం చేశారు. స్థితిగతులను పరిశీలించిన కమిషనర్ రంగనాథ్, ఇళ్లపై చేసిన మార్కింగులను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా మార్కింగ్ చేసిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు సిఫార్సు చేస్తామని స్పష్టంగా తెలిపారు. పాత డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకారం చెరువు హద్దులు మార్చబోమని, 30 ఏళ్లుగా ఉన్న ఇళ్లపై హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకోదని కమిషనర్ స్థానికులకు హామీ ఇచ్చారు.
ఢిల్లీ కార్ బ్లాస్ట్ కేసు, మరో ముగ్గురు డాక్టర్లు అరెస్ట్..
ఢిల్లీ ఎర్రకోట్ కార్ బాంబు దాడి విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, మరో ముగ్గురు డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాలోని ధౌజ్, నుహ్, దాని పరిసర ప్రాంతాలపై ఢిల్లీ పోలీసులు స్పెషల్ సెల్, కేంద్ర సంస్థలు శుక్రవారం రాత్రి సమన్వయ దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో అల్ ఫలాహ్ యూనివర్సిటీ డాక్టర్లు – మొహమ్మద్, ముస్తాకిమ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ బాంబర్ డాక్టర్ ఉమర్ నబీకి వీరిద్దరు సన్నిహితులు. అరెస్ట్ అయిన డాక్టర్ ముజమ్మిల్ గనైతో వీరిద్దరు సంప్రదింపులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి.
కీలక సమాచారాన్ని సేకరించిన పోలీసులు.. కోర్టుకు తరలింపు
తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ఎంతో శ్రమించి పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు రవిని నాంపల్లి కోర్టుకు తరలించారు. రవిని విచారించిన పోలీసులు అతని నెట్వర్క్, వెబ్‌సైట్ నిర్వహణ, పైరసీ వ్యవస్థపై అనేక కీలక సమాచారాన్ని సేకరించారు. 2019 నుంచి ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్‌లో పైరసీ సినిమాలను అప్లోడ్ చేస్తూ భారీ నెట్‌వర్క్‌ను నడిపినందుకు రవి ప్రధాన నిందితుడిగా గుర్తించారు. థియేటర్‌లలో కొత్తగా విడుదలైన సినిమాలను గంటల వ్యవధిలోనే వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేసే పెద్ద సర్కిల్‌ను అతడు నడిపేవాడని పోలీసులు వెల్లడించారు.
రాష్ట్ర ఏరోస్పేస్ ఎగుమతుల్లో రికార్డు స్థాయి వృద్ధి
గచ్చిబౌలి ఐఎస్బీలో నిర్వహించిన ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ సమ్మిట్‌కు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు. కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్, ఐఎస్‌బీ, ముంజాల్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు, ఏరోస్పేస్–డిఫెన్స్ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వేగవంతమైన మార్పులను తెలంగాణ తన అవకాశాలుగా మలచుకునే దిశగా కృషి చేస్తోందని చెప్పారు.
