Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

మౌనం వీడిన షేక్ హసీనా.. ‘బంగ్లాదేశ్ నిరసనల వెనక ఆ రెండు దేశాల హస్తం’

దేశం విడిచి వెళ్లిన తర్వాత తొలిసారిగా బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తన మౌనాన్ని వీడారు. దేశంలో విద్యార్థుల నిరసనల తర్వాత జరిగిన తిరుగుబాటు గురించి ఆమె తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. తనకు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థుల నిరసనలు అమెరికా కుట్రపన్ని పాకిస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగ్రవాద దాడి అని షేక్ హసీనా పేర్కొన్నారు. షేక్ హసీనా.. ది ప్రింట్‌తో మాట్లాడుతూ.. గత ఏడాది జూలై-ఆగస్టులో బంగ్లాదేశ్‌లో జరిగిన సంఘటనలు తనను అధికారం నుంచి తొలగించే లక్ష్యంతో జరిగిన విదేశీ కుట్రలో భాగమని అన్నారు. “దీనిని విప్లవం అని పిలవకండి! ఇది బంగ్లాదేశ్‌పై జరిగిన ఉగ్రవాద దాడి, అమెరికా ప్లాన్ చేసి పాకిస్థాన్ నుంచి అమలు చేసిన ఉగ్రవాద దాడి. కానీ ఇది విద్యార్థుల తిరుగుబాటుగా చిత్రీకరించారు. ఇది నన్ను అధికారం నుంచి తొలగించడానికి జరిగింది. నా ప్రభుత్వంపై నిందలు వేసిన హత్యలను పోలీసులు చేయలేదు, ఉగ్రవాదులు చేశారు, ప్రజలను నాపై రెచ్చగొట్టడానికి అలా చేశారు” అని ఆమె వెల్లడించారు. బంగాళాఖాతంలోని వ్యూహాత్మక సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని కోరుకునే అమెరికన్ల ఆదేశం మేరకు నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ తనను అధికారం నుంచి తొలగించడానికి కుట్ర పన్నారని హసీనా నేరుగా ఆరోపించారు.

మైపాడు బీచ్‌లో విషాదం.. ముగ్గురు విద్యార్థులు గల్లంతు..!

నెల్లూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్‌లో సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు ఇంటర్మీడియట్ విద్యార్థులు సముద్రంలో గల్లంతై మరణించారు. ఆదివారం సెలవు కావడంతో ఈతకు వెళ్లి విగత జీవులుగా మారిన ఈ ఘటన స్థానికంగా విషాదం మిగిలించింది. ఈరోజు (ఆదివారం) మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. నెల్లూరు నగరంలోని కోటమిట్ట, నారాయణరెడ్డిపేట ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువకులు మైపాడు బీచ్‌కు చేరుకున్నారు. వీరంతా ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు.

రాహుల్ గాంధీలో మాస్ యాంగిల్.. చేపలు పట్టిన కాంగ్రెస్ అగ్రనేత !

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష కూటమి సభ్యులు జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో మొదటి దశ పోలింగ్‌కు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో, అన్ని పార్టీల సీనియర్ నాయకులు ఇప్పటికే రాష్ట్రంలో చురుగ్గా ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా బీహార్‌లో ర్యాలీలు నిర్వహించారు. ఆదివారం ఆయన బెగుసరాయ్ జిల్లాలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం రాహుల్ గాంధీ చేపల పెంపకందారులతో సమావేశమయ్యారు.

ఇస్రో ఖాతాలో మరో విజయం.. LVM3-M5 ప్రయోగం సక్సెస్..

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) భారత నౌకాదళం కోసం CMS-03 (GSAT-7R) కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. దీంతో ఇస్రో ఖాతాలో మరో విజయం నమోదైంది. LVM3-M5 ప్రయోగం సక్సెస్ అయ్యింది. ఆర్బిట్‌లోకి CMS-3 శాటిలైట్‌ను విజయవంతంగా ప్రవేశపెట్టింది ఇస్రో. CMS-3 శాటిలైట్‌ బరువు 4,410 కిలోలు. 16.09 నిమిషాల్లో ఆర్బిట్‌లోకి ఉపగ్రహం ప్రవేశించింది. భారత్‌ ప్రవేశపెట్టిన ఉపగ్రహాల్లో ఇదే అతిపెద్ద ఉపగ్రహం. ప్రయోగంలో పాల్గొన్న శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు ఇస్రో ఛైర్మన్. LVM3 రాకెట్‌ ద్వారా చంద్రయాన్‌ -3 ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ఛైర్మన్‌ వెల్లడించారు. అత్యంత బరువైన ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తర్వాత, ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ్ LVM3 రాకెట్‌ను ప్రశంసించారు, ఇది భారతదేశానికి మరోసారి కీర్తిని తెచ్చిపెట్టిందని అన్నారు. ఈ సవాలుతో కూడిన మిషన్ కోసం పనిచేసిన బృందాన్ని ఇస్రో చైర్మన్ అభినందించారు. LVM3-M5 రాకెట్ దాని పేలోడ్ కారణంగా ” బాహుబలి ” అని పిలుస్తున్నారు.

ఇరాక్‌లో ఉన్న జగిత్యాల యువకుడికి సైబర్ ముఠా టోకరా.. NTVని ఆశ్రయించిన బాధితుడు

జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం బట్టపల్లి పోతారం గ్రామానికి చెందిన రాకేష్ అనే యువకుడు సైబర్ మోసగాళ్ల బారిన పడ్డాడు. అప్పుల పాలై జీవనోపాధి కోసం ఇటీవలే ఇరాక్‌ వెళ్లిన రాకేష్‌, సోషల్‌ మీడియాలో ఫేస్‌బుక్‌ ద్వారా మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నాడు. రాకేష్ ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్‌ను లైక్‌ చేయడంతో, యూట్యూబర్‌ హర్ష సాయి పేరుతో నకిలీ ప్రొఫైల్ సృష్టించిన సైబర్‌ ముఠా సభ్యులు అతనిని సంప్రదించారు. నమ్మకం కల్పించేందుకు హర్ష సాయి పేరుతో ఉన్న ఆధార్‌ కార్డు కాపీ పంపించారు. “నీ అప్పులు తీర్చడానికి ఐదు లక్షల రూపాయలు సహాయం చేస్తాం” అని ప్రలోభపెట్టారు.

కాశీబుగ్గ బాధితులకు వైఎస్సార్సీపీ పార్టీ తరపున రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా..?

శ్రీకాకుళంలో మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల లోపంతో పాటు పాలనా వ్యవహారాలపై ఆయన తన ఆవేదనతో పాటు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏం లేదు. హత్యలు, మానభంగాలు, అక్రమ కేసులు మాములు అయ్యాయి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం లేస్తే రాజకీయం తప్ప, ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. తాను బాధతో, బాధ్యతతో ఈ విషయాలు మాట్లాడుతున్నానని.. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదని అన్నారు.

హైడ్రాపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చివేస్తోందని, ఈ అన్యాయాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మౌనం ఎందుకు వహిస్తున్నారో చెప్పాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో బుల్డోజర్లను సవాల్ చేసిన రాహుల్ గాంధీ, తెలంగాణలో పేదలపై జరుగుతున్న అన్యాయాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారు?” అని నిలదీశారు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై కేటీఆర్ ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గతంలో ఢిల్లీలో చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా ప్రదర్శించారు. “ధనికులకు ఒక న్యాయం, పేదలకు మరో న్యాయం” అనే నినాదంతో ప్రజెంటేషన్ కొనసాగింది.

ట్రంప్‌కు ఇరాన్ షాక్ .. ‘అణు కర్మాగారాలను పునర్నిర్మిస్తాం’

టెహ్రాన్‌లోని అణుశక్తి సంస్థను ఆదివారం ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ సందర్శించారు. ఈ సందర్భంగా పెజెష్కియాన్ దేశ అణు శాస్త్రవేత్తలు, అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టెహ్రాన్ తన అణు సౌకర్యాలను పునర్నిర్మించుకుంటుందని, ఇంకా ఎక్కువ శక్తితో వాటిని తిరిగి నిర్మిస్తామని చెప్పారు. “ఎన్ని భవనాలు, కర్మాగారాలు ధ్వంసమైనా, మేము వాటిని పునర్నిర్మిస్తాము, ఈసారి మరింత బలంగా ఉంటాము” అని ఆయన వెల్లడించారు. ఇరాన్ అణు కార్యక్రమం ఆయుధాల కోసం కాదు, శక్తి, వైద్యం, మానవ అవసరాల కోసమేనని పెజెష్కియన్ పునరుద్ఘాటించారు.

కుల గణనలో తెలంగాణకు జాతీయ స్థాయి గుర్తింపు

కుల గణనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ అన్నారు. ఆదివారం మూసాపేటలోని మెజెస్టిక్‌ గార్డెన్స్‌లో జరిగిన మున్నూరు కాపు, కాపుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కోకాపేటలో మున్నూరు కాపు భవనం నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. బీసీ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు చట్టపరంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఈ అంశం ప్రస్తుతం కోర్టులో ఉన్నందున, చట్టబద్ధ మార్గంలోనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. బలహీన వర్గాలన్నీ ఐక్యంగా పోరాడితేనే తమ హక్కులు సాధ్యమవుతాయని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మున్నూరు కాపు, కాపుల వర్గం నుండి ఏకగ్రీవ మద్దతు లభించిందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం.. భారీగా ట్రాఫిక్ జాం

రాజధాని హైదరాబాద్‌లో వర్షం ధాటిగా కురుస్తోంది. ఆదివారం సాయంత్రం నుంచి పటాన్‌చెరు, లింగంపల్లి, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, నిజాంపేట్‌, గాజులరామారం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వాన కొనసాగుతోంది. కూకట్‌పల్లి, ఫిల్మ్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, చందానగర్‌, జీడిమెట్లలో భారీ వర్షం కురిసింది. పంజాగుట్ట, అమీర్‌పేట్‌, బేగంపేట్‌లోనూ వర్షపడింది. అయితే.. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం.. మరో గంటలో సెంట్రల్, వెస్ట్ హైదరాబాద్ అంతటా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లు నీటమునిగిపోయాయి. అనేక చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైడ్రా, GHMC బృందాలు రంగంలోకి దిగి వర్షపు నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో నీటిని తొలగించే పనిలో నిమగ్నమయ్యాయి. ఇదే సమయంలో నిజామాబాద్, సిద్ధిపేట, మెదక్, సిరిసిల్ల జిల్లాల్లో కూడా భారీ వర్షం కురుస్తూ వాతావరణం చల్లగా మారింది.

 

Exit mobile version