ఫరీదాబాద్‌లో దారుణం.. కదులుతున్న వ్యాన్‌లో మహిళపై గ్యాంగ్‌రేప్
ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. తాజాగా హర్యానాలోని ఫరీదాబాద్‌లో దారుణం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున 28 ఏళ్ల మహిళపై కదులుతున్న వ్యాన్‌లో రెండున్నర గంటల పాటు ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం రోడ్డుపై విసిరేసి పరారయ్యారు. ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. సోమవారం-మంగళవారం మధ్య రాత్రిలో వివాహిత ఇంటికి వెళ్లేందుకు వాహనం కోసం ఎదురుచూస్తోంది. ఆ సమయంలో ఒక వ్యాన్ వచ్చింది. ఇంటి దగ్గర దింపుతామని నమ్మించి ఇద్దరు యువకులు వ్యాన్ ఎక్కించుకున్నారు. అయితే వెళ్లాల్సిన మార్గంలో కాకుండా వాహనం గుర్గావ్ రోడ్డు వైపు వెళ్లింది. అనంతరం ఆమెను బెదిరించి ఒకరి తర్వాత ఒకరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించినా నిందితులు మాత్రం ఆగలేదు. బెదిరించి మరీ అత్యాచారం చేశారు.
జోగి రమేష్ బ్రదర్స్‌కు మళ్లీ షాక్…
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన నకిలీ మద్యం కేసులో మరోసారి మాజీ మంత్రి జోగి రమేష్ బ్రదర్స్‌తో పాటు సహా మిగిలిన నిందితులకు షాక్ తగిలింది.. నకిలీ మద్యం కేసులో నిందితులకు మరోసారి రిమాండ్ పొడిగించింది కోర్టు.. మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జోగి రమేష్, జోగి రాము సహా మిగిలిన నిందితులకు ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు.. దీంతో, నిందితులకు జనవరి 12వ తేదీ వరకు రిమాండ్ పొడిగించారు న్యాయమూర్తి.. ఆ తర్వాత నిందితులను జిల్లా జైలుకు తరలించారు అధికారులు.. మరోవైపు, ఇదే కేసులో మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు జోగి రమేష్.. ఇప్పటికే రెండుసార్లు జోగి రమేష్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం.. ఆ పిటిషన్‌ను ఎక్సైజ్ కోర్టు డిస్మిస్ చేయడం జరిగిపోగా.. మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యరు జోగి రమేష్, జోగి రాము..
మాజీ దిగ్గజం రికార్డును సమం చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్!
హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు శ్రీలంకపై ఘన విజయం సాధించింది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో మంగళవారం జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో భారత్ 15 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 5-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత ప్రదర్శన చేసింది. 43 బంతుల్లో 68 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ అవార్డుతో హర్మన్‌ప్రీత్ కౌర్ మరో అరుదైన రికార్డును సమం చేసింది. భారత మహిళల టీ20ల్లో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు గెలిచిన క్రికెటర్‌గా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ రికార్డును సమం చేసింది. ప్రస్తుతం హర్మన్‌ప్రీత్, మిథాలీ ఇద్దరూ టీ20ల్లో భారత్ తరఫున 12 ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు అందుకున్నారు. మిథాలీ 89 టీ20 మ్యాచ్‌లలో 12 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకోగా.. హర్మన్ 187 టీ20 మ్యాచుల్లో ఈ ఘనత సాధించింది.
తాగి బండి నడిపారో.. వెళ్లేది ఇంటికి కాదు.. నేరుగా చంచల్‌గూడ జైలుకే..!
న్యూ ఇయర్ వేడుకలను ఎలాంటి అపశృతి లేకుండా, శాంతియుతంగా నిర్వహించేందుకు హైదరాబాద్ పోలీసులు భారీ స్థాయిలో చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్టీవీతో హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ కీలక వివరాలు వెల్లడించారు. జంటనగరల వ్యాప్తంగా ఈ రోజు రాత్రి మొత్తం 100 డ్రంక్ అండ్ డ్రైవ్ టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాగి వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడవద్దని, ఇతరులకు ఇబ్బందులు కలిగించకూడదని డీసీపీ సూచించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నగరంలోని ఫ్లైఓవర్లను మూసివేస్తామని ప్రకటించారు. అలాగే ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్‌పై వాహనాలకు అనుమతి లేదని, కేవలం నెక్లెస్ రోడ్డుపైనే వాహనాలను అనుమతిస్తామని స్పష్టం చేశారు. న్యూ ఇయర్ ఈవెంట్లు నిర్వహించే ఆర్గనైజర్లు రోడ్లపై వాహనాలు పార్క్ చేయకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ట్రాఫిక్ పోలీసులు ఆదేశించారు.
రికార్డు సృష్టించిన శ్రీవారి లడ్డూ విక్రయాలు..
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాన్ని పవిత్రంగా భావిస్తుంటారు.. తిరుమల వెళ్లేవారు.. వారితో పాటు బంధువులు, స్నేహితులకు కూడా లడ్డూలను తీసుకెళ్లారు.. అయితే, ఈ ఏడాది రికార్డు స్థాయిలో శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయించింది టీటీడీ.. తిరుమలలో ఈ ఏడాది శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు చరిత్రలో నిలిచిపోయే రికార్డును సృష్టించాయి. తిరుమల తిరుపతి దేవస్థానాలు (TTD) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2025 సంవత్సరంలో మొత్తం 13 కోట్ల 52 లక్షల లడ్డూలు విక్రయించి సరికొత్త మైలురాయిని అందుకుంది. గత ఏడాది ఇదే విక్రయాలు 12 కోట్ల 15 లక్షలు మాత్రమే ఉండగా, ఈసారి ఏకంగా కోటి 37 లక్షల లడ్డూల విక్రయాలు అదనంగా నమోదయ్యాయి. ఇది శ్రీవారి పట్ల భక్తుల్లో పెరుగుతున్న విశ్వాసం, ఆలయానికి వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుదల, ప్రసాదానికి ఉన్న డిమాండ్‌ను స్పష్టంగా తెలియజేస్తోంది.
ఫుడ్ లవర్స్ కు జొమాటో-స్విగ్గీ షాక్.. డెలివరీ బాయ్స్ కు మాత్రం పండగే..
న్యూ ఇయర్ వేళ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు ఫుడ్ లవర్స్ కు బిగ్ షాకిచ్చాయి. ఇదే సమయంలో డెలివరీ బాయ్స్ కు మాత్రం గుడ్ న్యూస్ అందించాయి. నివేదికల ప్రకారం, నూతన సంవత్సరం సందర్భంగా డెలివరీలలో అంతరాయాలు ఏర్పడతాయనే భయాల మధ్య, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలు జొమాటో, స్విగ్గీ కీలక ప్రకటన చేశాయి. అవును, రెండు కంపెనీలు ఇప్పుడు గిగ్ కార్మికులకు ఎక్కువ చెల్లింపులను అందించేందుకు రెడీ అయ్యాయి. నివేదికల ప్రకారం, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు జొమాటో, స్విగ్గీ ఇప్పుడు తమ డెలివరీ పార్ట్ నర్స్ కు అధిక ప్రోత్సాహకాలను అందించనున్నాయి.
ఏపీలో 2 మున్సిపాలిటీల గ్రేడ్‌లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు మున్సిపాలిటీల హోదాను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి మున్సిపాలిటీతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూర్ మున్సిపాలిటీ గ్రేడ్‌లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ప్రస్తుతం స్పెషల్ గ్రేడ్‌లో ఉన్న కదిరి మున్సిపాలిటీని సెలక్షన్ గ్రేడ్‌కు అప్‌గ్రేడ్ చేశారు. గడచిన రెండేళ్లలో కదిరి మున్సిపాలిటీ సాధించిన ఆదాయం, చేసిన వ్యయాలను పరిగణలోకి తీసుకుని ఈ హోదా పెంపు నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే తూర్పు గోదావరి జిల్లా కొవ్వూర్ మున్సిపాలిటీ హోదాను గ్రేడ్–3 నుంచి గ్రేడ్–1కు పెంచారు. 2021 సంవత్సరం నుంచి మున్సిపాలిటీకి వచ్చిన ఆదాయాన్ని ఆధారంగా చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ రెండు మున్సిపాలిటీలకు సంబంధించిన గ్రేడ్ పెంపు ఉత్తర్వులు ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్‌కుమార్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపాలిటీ హోదా పెరగడంతో ఆయా పట్టణాలకు అదనపు నిధులు, సిబ్బంది, మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరింత అవకాశం లభించనుందని అధికారులు తెలిపారు.
ఢిల్లీ ఎర్రకోట పేలుడు లాగే, కారులో పేలుడు పదార్థాలు స్వాధీనం..
ఢిల్లీ ఎర్రకోట కార్ బాంబ్ దాడి ఘటన మరవక ముందే, రాజస్థాన్‌లో కారులో భారీగా పేలుడు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. యూరియా ఎరువుల సంచులలో దాచి ఉంచిన 150 కిలోల అక్రమ అమ్మోనియం నైట్రేట్‌తో నిండిన ఒక మారుతి సియాజ్ కారును బుధవారం రాజస్థాన్‌లోని టోంక్‌లో గుర్తించారు. ఈ వాహనంలో సుమారు 200 కాట్రిడ్జెస్, ఆరు కట్టల సెఫ్టీ ఫ్యూజ్ వైర్ లభించింది. రాజస్థాన్‌లోని బూంది నుంచి టోంక్‌కు పేలుడు పదార్థాలు సరఫరా అవుతున్నాయని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అనుమానాస్పదంగా ఉన్న కారును పట్టుకున్నారు. ఈ కేసులో సురేంద్ర మోచి, సురేంద్ర పట్వా అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరిని విచారిస్తున్నారు.
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. వోడాఫోన్ ఐడియాకు భారీ ఊరట..
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన టెలికాం దిగ్గజం వోడాఫోన్ ఐడియాను గట్టెక్కించే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్, కంపెనీ చెల్లించాల్సిన సుమారు రూ. 87,695 కోట్ల సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (AGR) బాకీల విషయంలో ఊరట ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజీలో భాగంగా కంపెనీ తన బాకీలను చెల్లించే విషయంలో ఐదేళ్ల పాటు మారటోరియం విధిస్తూ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అంటే, ఈ భారీ మొత్తాన్ని వోడాఫోన్ ఐడియా తక్షణమే చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ నిధులను ఫ్రీజ్ చేయడమే కాకుండా, వీటి చెల్లింపు గడువును 2031-32 ఆర్థిక సంవత్సరం నుండి 2040-41 వరకు, అంటే పదేళ్ల పాటు వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ నిర్ణయం వల్ల కంపెనీకి తక్షణమే నగదు లభ్యత పెరగడంతో పాటు, నెట్‌వర్క్ విస్తరణ , 5G సేవలపై పెట్టుబడి పెట్టేందుకు అవకాశం లభిస్తుంది.
పెళ్లాం కోసం అత్తింటికి వెళితే.. అల్లుడిపై పెట్రోల్ పోసి తగులబెట్టిన మామ..
తిరుపతి జిల్లా వెంకటగిరిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య కోసం అత్తింటికి వెళ్లిన అల్లుడిపై మామ పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు వివరాల ప్రకారం.. పాపన హరిప్రసాద్ (32), లక్ష్మీ మౌనిక దంపతుల మధ్య గత కొంతకాలంగా మనస్పర్ధలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భార్య లక్ష్మీ మౌనిక అలిగి పుట్టింటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో భార్య, పిల్లలను తీసుకెళ్లేందుకు హరిప్రసాద్ శుక్రవారం అత్తగారింటికి వెళ్లాడు. అక్కడ మాటా మాటా పెరిగింది. ఈ సమయంలో మామ తనపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. గమనించిన స్థానికులు వెంటనే హరిప్రసాద్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని తొలుత ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శరీరం సుమారు 70 శాతం కాలిపోయినట్లు వైద్యులు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
