Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

శ్రేయస్‌ హెల్త్ అప్‌డేట్‌ ఇచ్చిన సూర్యకుమార్‌.. ఏం చెప్పాడంటే?!

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో వైస్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ గాయపడిన విషయం తెలిసిందే. క్యాచ్‌ అందుకునే ప్రయత్నంలో తీవ్ర గాయానికి గురైయ్యాడు. ప్రస్తుతం సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడు. శ్రేయస్‌ ఆరోగ్యం గురించి టీమిండియా టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ అప్‌డేట్‌ ఇచ్చాడు. ప్రస్తుతం శ్రేయస్‌ బాగానే ఉన్నాడని, వైద్యులు నిత్యం అతన్ని పర్యవేక్షిస్తున్నారని చెప్పాడు. ఇది మనకు శుభవార్త అని సూర్య చెప్పుకొచ్చాడు.

భర్తను కోల్పోయిన అక్క లక్ష్మమ్మని ఓదార్చిన మాజీ సీఎం కేసీఆర్..

మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత తన్నీరు హరీష్‌రావు తండ్రి సత్యనారాయణ ఈ రోజు తెల్లవారు జామున మృతి చెందిన విషయం తెలిసిందే.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాజాగా హరీష్‌రావు ఇంటికి చేరుకున్నారు. తన బావ తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. భర్తను కోల్పోయిన అక్క లక్ష్మమ్మకు ధైర్యం చెప్పారు. మాజీ మంత్రి హరీష్‌రావుని కౌగిలించుకుని ఓదార్చారు.

మొంథా తుఫాన్‌.. క్షేత్రస్థాయి పరిస్థితులపై మంత్రి లోకేష్ ఆరా..

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మొంథా తుఫాన్‌ తీవ్రతపై క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీశారు మంత్రి నారా లోకేష్.. వివిధ నియోజకవర్గ ఎమ్మెల్యేలతో ఫోన్లో మాట్లాడి క్షేతస్థాయి పరిస్థితులను వాకబు చేశారు.. ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, తుని ఎమ్మెల్యే యనమల దివ్య, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో ఫోన్లో మాట్లాడిన మంత్రి నారా లోకేష్.. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణతో ఫోన్లో ఆరా తీశారు..

తెలంగాణపై మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్..

తెలంగాణపై మొంథా తుఫాన్ ఎఫెక్ట్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.. మొంథా తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలో భారీ.. అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.. నేడు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది.. మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.. కొమరం భీం, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయ్యింది.. ఈరోజు అర్ధరాత్రి పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభావం ఉండే అవకాశం ఉందని అంచనా.. రేపు ఆదిలాబాద్.. నిర్మల్.. జగిత్యాల.. మంచిర్యాల.. పెద్దపల్లి.. కరీంనగర్.. జయశంకర్ భూపాలపల్లి.. ములుగు.. వరంగల్.. మహబూబాబాద్.. భద్రాద్రి కొత్తగూడెం.. ఖమ్మం ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది..

జూబ్లీహిల్స్ ఎన్నికలకు సిద్ధమైన.. 407 పోలింగ్ బూత్ లు

హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 127 పోలింగ్ స్టేషన్ల లో 407 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు. ఒక్కో పోలింగ్ బూత్ కి నాలుగు చొప్పున 1,628 బ్యాలెట్ యూనిట్లు సిద్ధం చేశారు పోలింగ్ అధికారులు. అదనంగా 20 శాతం బ్యాలెట్ యూనిట్లను సిద్ధంగా పెట్టుకున్నామని అధికారులు స్పష్టం చేశారు. 509 కంట్రోల్ యూనిట్లు, 509 వీవీ ప్యాట్లు సిద్ధం చేశామని…ఇప్పటికే ఈవిఎం ల ర్యాండమైజేషన్ పూర్తయిపోయిందని అధికారులు వెల్లడించారు. ఎన్నికల టైంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో భాగంగా ఇప్పటివరకు 2 కోట్ల 90 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు..ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించిన వారిపై 11 కేసులు నమోదు చేసామని అధికారులు తెలిపారు. అంతే కాకుండా మజీద్ ల వద్ద ప్రచారం చేసినందుకు బీ ఆర్ ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఎన్నికల అధికారికి సమాచారం ఇవ్వకుండా మాజీ మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ లు ప్రచారం చేసినందుకు మరో కేసు నమోదు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

పత్తి రైతులకు ఏపీ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌..

పత్తి రైతులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రేపటి నుంచే పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.. పత్తికి కనీస మద్దతు ధర రూ.8,110గా నిర్ణయించింది.. రాష్ట్రవ్యాప్తంగా 30 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.. తక్షణమే పత్తి సేకరణ చేపట్టాలని సీసీఐ సంబంధిత అధికారులను ఆదేశించారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు.. 2025-26 సంవత్సరానికి 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగు అయినట్లు, సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందనే అంచనాలు ఉండగా.. రైతులు ముందుగా రైతు సేవా కేంద్రాల ద్వారా తమ వివరాలను సీఎం యాప్ లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా నమోదు చేసుకోవాలని.. ఆ తర్వాత “కపాస్ కిసాన్” యాప్‌లో అదే వీఏఏ సహాయంతో స్లాట్ బుక్ చేసుకోవాలని రైతులకు సూచించారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..

మా సిద్ధాంతం ఓడిపోలేదు.. ఓడించడం ఎవరితరం కాదు

తెలంగాణ డీజీపీ ముందు మావోయిస్టు కీలక నేత ప్రసాదరావు అలియాస్‌ చంద్రన్న లొంగిపోయారు. ఆయన తో పాటు రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాశ్‌ కూడా డీజీపీ ముందు లొంగిపోయారు. అయితే.. మావోయిస్టు లొంగుబాటులో తెలంగాణ SIB కీలక ఆపరేషన్‌ నిర్వహించింది. పార్టీ ఐడిలయాలజీ ని నిర్మించిన పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ పిలుపు మేరకు జనజీవన స్రవంతిలో కలువడానికి పుల్లూరు ప్రసాదరావు, బండి ప్రకాష్ లు లొంగిపోయారని తెలిపారు.

డీప్‌ఫేక్‌ల యుగంలో ‘సేఫ్‌ వర్డ్‌’ మీ భద్రతకు కవచం

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఇప్పుడు మన జీవితంలోని ప్రతి కోణానికీ చేరింది. కానీ ఈ టెక్నాలజీ ఎంత శక్తివంతమైందో, అంతే ప్రమాదకరంగా కూడా మారుతోంది. ముఖ్యంగా డీప్‌ఫేక్‌ (Deepfake) టెక్నాలజీ ద్వారా మన ముఖం, మన గొంతును కూడా కచ్చితంగా నకిలీగా సృష్టించడం సాధ్యమైంది. ఇప్పుడు ఎవరికైనా మీ వీడియో లేదా వాయిస్‌ను వాడి, మీరు మాట్లాడుతున్నట్టుగా నకిలీ సందేశాలు పంపడం, వీడియోలు తయారు చేయడం లేదా కాల్స్‌ చేయడం సాధ్యమవుతోంది. దీంతో వ్యక్తిగత, ఆర్థిక మోసాలు విపరీతంగా పెరుగుతున్నాయి.

తాజాగా పలు దేశాల్లోనే కాకుండా మన దేశంలో కూడా డీప్‌ఫేక్‌ ఆధారంగా మోసాలు జరుగుతున్నాయి. కొంతమంది మోసగాళ్లు మీ స్నేహితులు, బంధువులు, సహచరులు లేదా అధికారులుగా నటిస్తూ డబ్బు లేదా వ్యక్తిగత సమాచారం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి మోసాలను గుర్తించడం చాలా కష్టంగా మారింది, ఎందుకంటే అవి నిజంగా ఉన్నట్లే కనిపిస్తాయి. ఇలాంటి మోసాల నుంచి రక్షణ పొందేందుకు ఒక సులభమైన కానీ అత్యంత ప్రభావవంతమైన పద్ధతి ‘సేఫ్‌ వర్డ్‌’‌. అది మీరు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా సహచరులతో మాత్రమే పంచుకునే ఒక ప్రత్యేక పదం లేదా సంకేతం. ఏదైనా అనుమానాస్పద కాల్‌ లేదా మెసేజ్‌ వస్తే, ఆ వ్యక్తి నిజమా కాదా తెలుసుకోవడానికి ఆ ‘సేఫ్‌ వర్డ్‌’ అడగాలి.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 8వ వేతన సంఘానికి కేబినెట్ ఆమోదం

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా కేంద్ర కేబినెట్ 8వ వేతన సంఘానికి ఆమోదం తెలిపింది. 8వ వేతన సంఘం అమలు కోసం ఇప్పటికే కేబినెట్ ఛైర్‌పర్సన్‌ను ఎంపిక చేసింది. దీనికి ఛైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజనా ప్రకాష్ దేశాయ్ నియమితులయ్యారు. అలాగే 8వ కేంద్ర వేతన సంఘం అన్ని నిబంధనలను మంత్రివర్గం ఆమోదించింది. ఈ వేతన సంఘం 18 నెలల్లోపు తన సిఫార్సులను కేబినెట్‌ ముందు పెట్టనుంది. దీని ఆధారంగా 8వ వేతన సంఘం అమలు చేస్తారు.

సీఎం రేవంత్‌ కీలక నిర్ణయం.. డివిజన్ల వారీగా మంత్రులు రంగంలోకి

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ప్రతి డివిజన్‌ వారీగా మంత్రులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉప ఎన్నికలో ప్రతి ఓటు కీలకమని భావించిన సీఎం, బలమైన మంత్రులను రంగంలోకి దింపారు. ఈ క్రమంలో రహమత్‌నగర్‌ డివిజన్‌కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను నియమించారు. బోరబండ డివిజన్‌ బాధ్యతలు సీతక్క, మల్లు రవికి అప్పగించారు. వెంగళ్ రావునగర్‌ డివిజన్‌లో తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి సమన్వయం చేస్తారు.

 

Exit mobile version