ఏపీకి హైఅలర్ట్.. రాబోయే మూడు రోజులు ఎక్కడికి వెళ్లొద్దు..
మొంథా తుఫాన్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈనెల 27, 28, 29 తేదీల్లో తీరప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వాయుగుండం 28వ తేదీ ఉదయం నాటికి తీవ్రమైన తుఫానుగా మారుతుందని, ఈ సమయంలో ఎక్కడా ఎటువంటి ప్రాణ-ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మచిలీపట్నం నుంచి కాకినాడ ప్రాంతం వరకు తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తుంది.. ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేలా సమాచార వ్యవస్థలు సిద్ధంగా ఉండాలన్నారు. ఎస్ఎంఎస్ అలర్ట్స్, సోషల్ మీడియా, ఐవీఆర్ఎస్ కాల్స్, వాట్సాప్‌ల ద్వారా ప్రజలకు ముందస్తుగా హెచ్చరికలు పంపించాలన్నారు. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు తుఫాన్ ప్రభావంపై సమాచారం వేగంగా చేరవేసి, నష్ట నివారణ చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు.
కడుపునొప్పితో ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే.. చేతికి ఇన్ ఫెక్షన్.. యువకుడి పరిస్థితి విషమం..
కడుపునొప్పితో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చేతికి ఇన్ ఫెక్షన్ తో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఓ యువకుడు. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణం అంటున్నాడు. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన బాధితుడి దయనీయ గాథ ఇది.. సంగమేశ్వర(33) అనే యువకుడు ఈ ఏడాది జూలై 23న రాత్రి 8 గంటలకు కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లాడు. ఇంజెక్షన్స్, సెలైన్లు పెట్టడంతో తన చేయి ఎర్రగా వాచింది. డ్యూటీలో ఉన్న డాక్టర్ ని అడిగితే ఐస్ పెట్టుకోమంటూ నిర్లక్ష్యపు సమాధానం చెప్పారు. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళాక చేయి మరింత వాచింది. సంగారెడ్డిలో ఓ ప్రయివేటు ఆస్పత్రికి వెళ్లగా చేతికి ఇన్ఫెక్షన్ సోకిందని డాక్టర్లు చెప్పారు.
బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తేనే బీసీ బిల్లుకు మోక్షం..
గోదావరి పరివాహక ప్రాంతంలో ముంపునకు గురైన రైతులకు ఎకరానికి రూ. 50 వేల పరిహారం ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. నిజామాబాద్ జాగృతి కవిత మీడియా సమావేశం నిర్వహించారు. అప్పటి మంత్రి ప్రశాంత్ రెడ్డి, ప్రస్తుత మంత్రి తుమ్మల వల్లే ముంపు ముప్పు ఉందని తెలిపారు. మొక్క రైతులకు బోనస్ చెల్లించి, కొనుగోలు కేంద్రాలు తక్షణం ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యం తడిసింది, తడిసిన ధాన్యం కడ్తా లేకుండా కొనుగోలు చేయాలన్నారు. బీజేపీ ఎంపీ ఉన్నా.. లేనట్టే అని విమర్శించారు. మాధవనగర్ బ్రిడ్జి పనులు ఇంకా ఎందుకు పూర్తి కాలేదు ఎంపీ అరవింద్ చెప్పాలన్నారు. ఎంపీ అరవింద్ రాజీనామా చేస్తే బీసీ బిల్లు నడుచుకుంటూ వస్తుందన్నారు. బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తేనే బీసీ బిల్లుకు మోక్షం లభిస్తుంది.. బీజేపీ ఎంపీ తన కుటుంబం ఎంపీ లేని పోనీ ఆరోపణలు చేస్తున్నారు. ఆయన చిట్టా బయట పెడతా అని పేర్కొన్నారు.
మలేషియాలో డాన్స్ చేసిన యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ (వీడియో)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏం చేసిన వార్త అవుతుంది. తాజాగా యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తన ఐదు రోజుల ఆసియా పర్యటనలో భాగంగా ఆదివారం మలేషియా రాజధాని కౌలాలంపూర్ చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి ఎన్నికైన తర్వాత ట్రంప్ మలేషియాకు రావడం ఇదే మొదటిసారి. ఆసియాలో పెరుగుతున్న చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి అమెరికాకు ఇక్కడ బలమైన భాగస్వాములను నిర్మించడంపై ఈ పర్యటనలో ట్రంప్ ప్రధానంగా దృష్టి సారించారు.
జార్ఖండ్‌లో దారుణం.. వైద్యుల నిర్లక్ష్యం.. 5 గురు పిల్లలకు హెచ్ఐవి పాజిటివ్.!
జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లా, చాయిబాసాలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. చాయిబాసాలోని సదర్ ఆసుపత్రిలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ పాజిటివ్ రక్తాన్ని ఎక్కించినట్లు తేలింది. దీనిపై జార్ఖండ్ హైకోర్టు సుమోటోగా స్వీకరించి, విచారణకు ఆదేశించడంతో రాంచీ నుంచి ఆరోగ్య శాఖ బృందం విచారణ కోసం చాయిబాసా చేరుకుంది. రాంచీ నుంచి వచ్చిన వైద్యుల బృందం తొలుత సదర్ ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూన(PICU)ని తనిఖీ చేసింది. జార్ఖండ్ ఆరోగ్య సేవల డైరెక్టర్ డాక్టర్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల దర్యాప్తు కమిటీ ఈ కేసును విచారిస్తోంది. బాధితులందరి వయసు 15 ఏళ్ల లోపే ఉన్నట్లు తెలుస్తోంది. గత వారం రోజుల్లో 56 మంది తలసేమియా బాధితులకు పరీక్షలు చేయగా.. వారిలో ఐదుగురు పిల్లలకు హెచ్‌ఐవీ పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది.
రాష్ట్రానికి తుపాను ముప్పు.. సహాయక చర్యల కోసం కట్టుదిట్టంగా ఏర్పాట్లు పూర్తి..!
బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను నేపథ్యంలో రాష్ట్రంలో ముందస్తు సహాయక చర్యలపై రాష్ట్ర హోంమంత్రి అనిత ఎన్టీవీతో మాట్లాడారు. ముఖ్యమంత్రి గత నాలుగు రోజులుగా తుపాను ముప్పుపై అన్ని శాఖలను అప్రమత్తం చేస్తూ, పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని ఆమె తెలిపారు. తుపాను ఈ నెల 28న అర్ధరాత్రి కాకినాడ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉందని హోంమంత్రి వెల్లడించారు. దీని ప్రభావంతో రేపటి (27వ తేదీ) నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అలాగే గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు ముందస్తు ఏర్పాట్లను పకడ్బందీగా చేపడుతున్నామని ఆమె అన్నారు.
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయం.. హైకమాండ్ రాడార్‌లో అందరూ..
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమని, మంచి మెజారిటీ సాధిస్తామని వెల్లడించారు. రాష్ట్ర రాజకీయాలు, పార్టీ అంతర్గత విషయాలు, కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని మహేష్ గౌడ్ తెలిపారు. “మా ప్రభుత్వం జూబ్లీహిల్స్‌లో 46 వేల ఇళ్లకు సంక్షేమ పథకాలు అందిస్తోంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువవుతున్నాయి. ఇది మా బలం,” అని ఆయన పేర్కొన్నారు. గత దశాబ్దంగా ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుస్తున్నప్పటికీ, ఓటు చోరీ ఆరోపణలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి పోరాడుతున్నారని ఆయన గుర్తు చేశారు.
ఎంపీ కేశినేని చిన్ని మునిగిపోతున్న నావ.. పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
ఎంపీ కేశినేని చిన్నిపై మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. పేర్ని నాని మాట్లాడుతూ.. ఎమెల్యే కొలికపూడి ఎవరో టీవీలో చూడటం తప్ప నాకు పరిచయం లేదన్నారు. ఎంపీ చిన్ని చెప్పినట్లుగా కొలికపూడి నాతో మాట్లాడితే నేను ధైర్యంగా మాట్లాడాడు అని చెబుతానని అన్నారు. కొలికపూడి, ఎంపీ చిన్ని బతుకు బస్టాండ్ చేసి బట్టలూడతీశాడన్నారు. హైదరాబాద్ లో చేసిన పాపాలు అన్నీ బయటపడ్డాయి. పేకాట తప్ప ఏ ఆట రాని వ్యక్తి కేశినేని చిన్నీకి ఒలంపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇచ్చారు. ఎంపీ కేశినేని చిన్ని మునిగిపోతున్న నావ అని తెలిపారు.
కర్నూలు ఘటన మరవక ముందే.. మరో డబుల్ డెక్కర్ బస్సులో భారీ అగ్నిప్రమాదం.. ఎక్కడంటే?
కర్నూలు సమీపంలో జరిగిన దారుణ బస్సు ఘటన జరగక ముందే.. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై రెవ్రి టోల్ ప్లాజా సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఒక డబుల్ డెక్కర్ స్లీపర్ బస్సులో మరో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉండగా.. వారందరూ సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. బస్సు ఢిల్లీ నుంచి లక్నో మీదుగా గోండాకు ప్రయాణిస్తోంది. టోల్ ప్లాజాకు సుమారు 500 మీటర్ల దూరంలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఇంట్లో ఈగల మోతా… బయట పల్లకిల మోతా.!
కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు ఉధృతంగా కొనసాగుతున్నాయంటూ బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. “ఇంట్లో ఈగల మోతా.. బయట పల్లకిల మోతా కాంగ్రెస్ పరిస్థితి,” అని ఆయన ఎద్దేవా చేశారు. పంపకాల విషయంలో తేడాలు రావడంతో మంత్రులు, ముఖ్యమంత్రి ఒకరినొకరు తన్నుకుంటున్నారని వ్యాఖ్యానించారు. “మొన్న కొండా సురేఖ కుమారుడు, నిన్న జూపల్లి కృష్ణారావు ఎలా మాట్లాడారో చూశారు కదా… క్యాబినెట్‌లోనే మంత్రులు, ముఖ్యమంత్రి బట్టలూడదీసుకొని తిట్టుకున్నారట,” అని హరీశ్‌రావు విమర్శించారు. ప్రజల గురించి కాంగ్రెస్‌కు పట్టడం లేదని, పదవుల కోసం, వాటాల కోసం మాత్రమే ఆ పార్టీ నేతలు పోరాడుతున్నారని అన్నారు. ప్రజలకు మళ్లీ మేలు జరగాలంటే కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాల్సిందేనని హరీశ్‌రావు తెలిపారు.
