Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

గతంలో ఎప్పుడూ కేసులు పెట్టిన దాఖలాలు లేవు.. మమల్ని వేధిస్తున్నారు..!

నేడు సత్తెనపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరు అయ్యారు మాజీ మంత్రులు విడదల రజినీ, అంబటి రాంబాబు. జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో అంబటిని, జగన్ పర్యటన సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన కేసులో విడదల రజినీని విచారించారు పోలీసులు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. సత్తెనపల్లి పిఎస్ లో విచారణకు హాజరయ్యాం. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పామన్నారు. జగన్ కేబినేట్ లో మంత్రులుగా చేశాం. అయినా చంద్రబాబు, లోకేష్ పనిగట్టుకుని మాపై కేసులు పెట్టిస్తున్నారని, జగన్ పార్టీ పెట్టిన దగ్గర నుండి అయన వెంటే వెలుతున్నామని అన్నారు. గతంలో ఎప్పుడూ కేసులు పెట్టిన దాఖలాలు లేవని, మాపై కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారన్నారు. కూటమీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని, వైసీపీ నేతలందరిపై కేసు పెట్టి లోపలెయ్యాలని చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మిథున్ రెడ్డిని అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. పరిపాలన ఏవిదంగా సాగుతుందో ప్రజలు ఆలోచించాలని ఆయన అన్నారు.

జనం గుండెల్లో జగన్ ఉన్నారు.. మాజీ మంత్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

జగన్ పర్యటన సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన కేసులో మాజీ మంత్రి విడదల రజినీని నేడు సత్తెనపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరు అయ్యారు. అలాగే మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో విచారణకు హాజరయ్యారు. ఇక విచారణ అంతరం విడుదల రజిని మాట్లాడుతూ.. జగన్ పర్యటనకు జనసమీకరణ చేశామని కేసులు పెట్టారన్నారు. మేము జనసమీకరణ చేయలేదుని.. జగన్ పర్యటనకు వస్తున్నారని తెలిస్తే ప్రజలు తరలి వస్తున్నారని ఆమె అన్నారు.

మరో ఎయిరిండియా విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం..

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఇవాళ (జూలై 21న) ఉదయం ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షాల కారణంగా ఎయిరిండియా ఫ్లైట్ (AI 2744) రన్‌వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా అదుపుతప్పి పక్కకు జరిగిపోయింది. ఈ విమానం కొచ్చిన్ నుంచి ముంబై వస్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే, రన్‌వే నెంబర్ 27పై ల్యాండింగ్ అవుతున్న సమయంలో వర్షం కారణంగా రన్‌వే తడిగా ఉండటంతో విమానం సడెన్‌గా పక్కకు జరిగింది. అప్రమత్తమైన పైలట్.. విమానాన్ని నియంత్రించాడు. దీంతో ప్రయాణికులందరూ ఊపిరి ఒక్కసారిగా పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విమానానికి ఏమైనా డ్యామేజ్ అయిందా?.. ఇంజిన్ లేదా టెక్నికల్ లోపాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో తనిఖీ చేస్తున్నారు.

2 రూపాయలకే షర్ట్.. ఎగబడిన యువకులు! చివరకు..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘ఇన్‌స్టాగ్రామ్‌’ హవా తెగ నడుస్తోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇన్‌స్టాగ్రామ్‌కు దాసోహం అయ్యారు. కొద్దిపాటి సమయం దొరికినా.. ఇన్‌స్టా ఓపెన్ చేసి రీల్స్ చూస్తున్నారు. ఇన్‌స్టా క్రేజ్ కారణంగా ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ ప్రచారం చేసుకుంటున్నారు. ముఖ్యంగా బట్టల వ్యాపారాలు. కేవలం 125 రూపాయలకే ఇక్కడ షర్ట్ ఇచ్చేస్తున్నారు మావ, 999 రూపాయలకే 3 ప్రీమియం షర్ట్స్ అంటూ రీల్స్ చేస్తున్నారు. రీల్స్ చూసి షాప్ దగ్గరికి వెళ్తే.. అంతా మోసం. ఇలాంటివి ఎన్నో ఘటనలు జరిగాయి. తాజాగా మెదక్ జిల్లాలో మరో మోసం వెలుగులోకి వచ్చింది.

ఆస్పత్రిలో చేరిన తమిళనాడు సీఎం స్టాలిన్.. కొనసాగుతున్న చికిత్స..!

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ ఇవాళ (జూలై 21న) ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మార్నింగ్‌ వాక్ చేస్తుండగా కల్లు తిరగడం లాంటి లక్షణాలు కనిపించడంతో.. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని అపోలో హాస్పిటల్‌కు తరలించారు. ఇక, అపోలో హాస్పిటల్‌ వైద్య బృందం సీఎం స్టాలిన్ ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నారు. అయితే, స్టాలిన్‌ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని హాస్పిటల్‌ వర్గాలు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశాయి. ఇక, అపోలో హాస్పిటల్స్‌ డైరెక్టర్ డాక్టర్‌ అనిల్ బీజీ మాట్లాడుతూ.. ఈ రోజు ఉదయం మార్నింగ్ వాక్ సమయంలో సీఎం స్టాలిన్‌కు తీవ్ర అస్వస్థత కలిగింది.. కళ్లు తిరగడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. అవసరమైన అన్ని వైద్య పరీక్షలు చేస్తున్నాం.. వైద్యుల బృందం ఆయనను నిరంతరం పర్యవేక్షిస్తోంది అని వెల్లడించారు. ఈ మేరకు సీఎం ఆరోగ్య పరిస్థితిపై ఆధికారిక హెల్త్‌ బులెటిన్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రి వద్ద భద్రత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు.

ఒకప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో 10 ఎకరాలు వచ్చేవి.. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది!

ఒకప్పుడు తెలంగాణలో ఎకరా భూమి అమ్మితే ఏపీలో పదేకరాల భూమి వచ్చేదని.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక సీన్ రివర్స్ అయిందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఏపీలో ఎకరా అమ్మితే ఇప్పుడు తెలంగాణలో రెండెకరాల భూమి వస్తుందని.. సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతకాక మన దగ్గర ఇలాంటి పరిస్థితి వచ్చిందనిమండిపడ్డారు. తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. సిద్దిపేట జిల్లాపై కాంగ్రెస్ పార్టీ పగపట్టిందని హరీష్ రావు పేరొన్నారు. ప్రజ్ఞాపూర్‌లో గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు.

గండికోట మైనర్ బాలిక హత్య కేసులో సంచలనం.. బాలిక సోదరులే..

కడప జిల్లాలోని గండికోటలో మైనర్ బాలిక హత్య జరిగి నేటికి వారం రోజులు అవుతోంది. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టి కేసును కొలిక్కి తెచ్చారు. బాలిక హత్య కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. బాలిక సోదరులే హంతుకులని నిర్ధారించారు పోలీసులు. ప్రేమ వ్యవహారం.. కుటుంబ పరవువుతీస్తోందనే బాలికను ఆమె అన్నలు హతమార్చినట్లు తెలిపారు. బాలిక, బాలిక లవర్ లోకేష్ వేర్వేరు కులాలు కావడం.. ఆస్థిపాస్తుల్లోనూ తమతో సరితూగరనే భావనలో బాలిక బంధువులు ఉండడం.. ఇవే హత్యకు కారణంగా భావిస్తున్నారు పోలీసులు.

సిద్ధంగా ఉండండి.. ఐదు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలంట..!

రాబోయే ఐదు రోజులపాటు తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఇప్పటికే నేడు, రేపు పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఈ నెల 24వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం ఏర్పడితే రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం మరింత పెరిగి భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

ప్రభుత్వం గుడ్ న్యూస్.. మున్సిపల్ శాఖలో వర్కర్ల వేతనం పెంపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న వర్కర్లకు తీపికబురును అందించింది. మున్సిపల్ శాఖలో అవుట్‌సోర్సింగ్ నాన్- పీ హెచ్ వర్కర్ల వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేటగిరి 1 వర్కర్ల వేతనం రూ.21,500 నుంచి రూ.24,500 కు పెంచింది. కేటగిరీ 2 వర్కర్ల వేతనం రూ.18500 నుంచి రూ.21500 కు పెంపు, కేటగిరి 3 వర్కర్ల వేతనం రూ.15000 నుంచి 18500 కు పెంచుతూ నిర్ణయించింది. తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ అండ్ డైరెక్టర్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వం సంచలన నిర్ణయం.. తూర్పు పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువులకు భూ హక్కులు..

ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సోమవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తూర్పు పాకిస్తాన్ (ఇప్పుడు బంగ్లాదేశ్) నుంచి వలస వచ్చి యుపిలోని వివిధ జిల్లాల్లో స్థిరపడిన కుటుంబాలకు తీపికబురును అందించారు. ఈ ప్రజలకు చట్టబద్ధంగా భూమిపై యాజమాన్య హక్కు కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇది కేవలం భూ పత్రాలు ఇవ్వడం మాత్రమే కాదని, సరిహద్దుల అవతల నుంచి నిర్వాసితులై భారత్ లో ఆశ్రయం పొంది, గత కొన్ని దశాబ్దాలుగా పునరావాసం కోసం ఎదురుచూస్తున్న వేలాది కుటుంబాల బాధ, పోరాటాన్ని గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి తెలిపారు.

 

Exit mobile version