Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

ముగిసిన మొదటిరోజు ఆట.. స్కోర్ ఎంతంటే?

కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ తొలి రోజు వార్ వన్ సైడ్ లా ముగిసింది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా.. ఆ నిర్ణయం పూర్తిగా ఫలితాన్ని ఇచ్చింది. భారత బౌలర్ల దెబ్బకు దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 159 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ఆరంభం బాగానే కనిపించినా.. ఆ తర్వాత భారత బౌలర్లు విజృభించడంతో వికెట్లు వరుసగా కోల్పోయింది. దక్షిణాఫ్రికా తరఫున ఐడెన్ మార్క్రామ్ (31), రికెల్టన్ (23), డే జోర్జీ (24), ముల్డర్ (24) మాత్రమే కొంత ప్రతిఘటన చూపగలిగారు. మిగతా బ్యాటర్లు భారత బౌలింగ్ ముందు తట్టుకోలేకపోయారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను తక్కువ పరుగులకే పరిమితం చేశాడు. ఇక మిగితా భారత బౌలర్స్ లో మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. 159 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలో జాగ్రత్తగా ఆడింది. టీమిండియా ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ (12) త్వరగా ఔటవ్వగా.. కెఎల్ రాహుల్ (13*), వాషింగ్టన్ సుందర్ (6*) జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. ఇక మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 20 ఓవర్లలో 37/1 పరుగులు చేసింది. ఇంకా 122 పరుగులు వెనుకంజలో ఉంది. ఇక రెండో రోజు తొలి సెషన్ ఈ మ్యాచ్ దిశను నిర్ణయించనుంది.

బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు తిరస్కరించారు

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుతో ఆ పార్టీ నాయకులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఫలితాలపై మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక రాజకీయాలన్నీ ప్రజలకు స్పష్టంగా తెలుసు అని అన్నారు. దశాబ్దకాలం పాటు ఏ పని చేయని బీఆర్ఎస్ ఎంత తప్పుడు ప్రచారం చేసినా, జూబ్లీహిల్స్ ఓటర్లు విశ్వసించలేదని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజలతో పాటు మంత్రివర్గం, కార్యకర్తలు పటిష్ఠంగా నిలిచినందునే ఈ విజయఫలితం సాధ్యమైందని సీతక్క తెలిపింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పూర్తిగా లోకల్, బీసీ సమాజానికి చెందిన, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి కావడం ప్రజల నమ్మకాన్ని గెలుచుకుందన్నారు. బీఆర్ఎస్ సెంటిమెంట్‌పై ఆడినా, మాగంటి గోపీనాథ్ కుటుంబాన్ని ముందుకు తీసుకొచ్చినా, ఓటర్లు ప్రభావితం కాలేదని ఆమె చెప్పుకొచ్చారు.

బీహార్ ఎన్నికలపై డిప్యూటీ సీఎం ఏమన్నారంటే..?

దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో బీహార్ ఎన్నికల ఫలితాలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. బీహార్‌లో ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని సాధించేందుకు దిశగా సాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నాయకులు స్పందించారు. ముఖ్యంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్డీఏ విజయాన్ని అభినందిస్తూ.. బీహార్ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మీద చూపుతున్న నమ్మకాన్ని మరోసారి రుజువుచేశారని అన్నారు. అభివృద్ధి, పారదర్శక పాలనకు ప్రజలు ఇచ్చిన అపూర్వ మద్దతే ఈ ఫలితాలకు కారణమని పేర్కొన్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలందరికీ అభినందనలు తెలుపుతూ.. ఈ తీర్పు దేశంలో ప్రజలు కోరుతున్న నాయకత్వం, పాలన విధానాన్ని స్పష్టంగా తెలియజేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఐటీ కారిడార్‌ ప్రయాణికులకు శుభవార్త..

సంక్రాంతి సందర్భంగా నగరంలో పెరిగే భారీ రద్దీని దృష్టిలో ఉంచుకొని, దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పండుగ సెలవుల్లో దూర ప్రాంతాలకు ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో, ఈసారి రైల్వే ప్రత్యేక హాల్ట్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా సికింద్రాబాద్‌–లింగంపల్లి మార్గంలో నడిచే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు హైటెక్‌సిటీలో ఆగవు. అయితే భారీ ప్రయాణికుల రద్దీని తగ్గించడమే కాకుండా, ఐటీ కారిడార్‌ పరిసరాల్లో నివసించే ప్రజలకు సౌకర్యం కల్పించేందుకు ఈ ఏడాది ప్రత్యేక చర్యలు చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం 16 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హైటెక్‌సిటీ స్టేషన్‌లో ప్రత్యేక హాల్టింగ్‌‌ను ఏర్పాటు చేస్తోంది. దీంతో ఐటీ ఉద్యోగులు, పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రయాణికులు, సికింద్రాబాద్‌ స్టేషన్‌కు వెళ్లకుండానే తమ రైళ్లను హైటెక్‌సిటీలోనే ఎక్కే వీలుంటుంది.

జూబ్లీహిల్స్ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేసి, తనను ఆదరించిన ప్రజల నమ్మకాన్ని పూర్తి స్థాయిలో నిలబెట్టుకుంటానని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రకటించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు. “ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకొని, ఇక్కడ అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తు బాగుంటుందని ఇచ్చిన ఆశీర్వాదం వృథా పోదు,” అని నవీన్ యాదవ్ అన్నారు. గతంలో దాదాపు 200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేసిన ఆయన, ప్రజల నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేస్తానని హామీ ఇచ్చారు. “ముఖ్యమంత్రి దృష్టికి మా ప్రాంత సమస్యలన్నీ కూడా తీసుకెళ్లి, అన్నీ కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి నిరంతరం కృషి చేస్తా,” అని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో, ఇకపై ఎలాంటి రాజకీయ వైషమ్యాలకు తావు ఇవ్వబోమని నవీన్ యాదవ్ వెల్లడించారు. గతంలో బీఆర్‌ఎస్ నాయకులు గెలిచినప్పుడు కొన్ని కక్షపూరిత రాజకీయాలు చేసి ఉండవచ్చని పరోక్షంగా పేర్కొంటూ.. “నవీన్ యాదవ్ దగ్గర అటువంటివి ఉండవు. ఈరోజు వరకే మీరు-మేము. ఇప్పటి నుండి మనం అంతా ఒకటే,” అని స్థానిక ప్రజలు, నాయకులకు భరోసా ఇచ్చారు.

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ఘన విజయం..

ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయాన్ని అందుకుంది.. సమీప ప్రత్యర్థి.. బీఆర్ఎస్‌ పార్టీకి చెందిన మాగంటి సునీతా గోపినాథ్‌పై భారీ మెజార్టీతో గెలుపొందారు కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యదవ్.. దాదాపు 25 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు నవీన్‌ యాదవ్.. అయితే, ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్‌ ప్రారంభం అయినప్పటి నుంచి ఆధిక్యంలోనూ కొనసాగారు నవీన్‌ యాదవ్.. పోస్ట్‌ బ్యాలెట్లు మొదలు కొని.. ప్రతీ రౌండ్‌లోనూ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ.. తన మెజార్టీని పెంచుకుంటూ ముందుకు సాగారు.. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డికి డిపాజిట్‌ కూడా దక్కలేదు.. కౌంటింగ్‌ మధ్యలోనూ కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు దీపక్‌ రెడ్డి..

ధర్మేంద్రను ఐసియులో రహస్యంగా చిత్రీకరించిన వ్యక్తి అరెస్ట్

ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర (89) గత కొద్ది రోజుల క్రితం ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఆయన చనిపోయాడంటూ మీడియా సంస్థలు వార్తలు రాశాయి. నవంబర్ 11 ఉదయం ధర్మేంద్ర భార్య హేమ మాలిని, కుమార్తె ఇషా డియోల్ ఆయన చనిపోలేదని.. బ్రతికే ఉన్నారంటూ అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 12న ఆయన ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. అయితే ధర్మేంద్ర.. అతడి కుటుంబం సభ్యులు ఐసీయూలో ఉండగా తీసిన ఓ వీడియో లీక్ అయ్యింది. అప్పటి నుండి ధర్మేంద్ర ఇంట్లో కోలుకోవడంపై కుటుంబం దృష్టి సారించింది. ధర్మేంద్రకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. అభిమానులు ఆయన గురించి ఆందోళన చెందవద్దని తెలిపారు. ప్రస్తుతం వీడియో తీసిన ఆసుపత్రి ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేప్టటారు పోలీసులు.

పని చేయని రాహుల్‌గాంధీ ‘ఓట్ చోర్’ పాచిక

బీహార్ ఎన్నికలకు ముందు అంతన్నారు.. ఇంతన్నారు. తీరా ఫలితాలు వచ్చేటప్పటికీ బొక్కబొర్లా పడ్డారు. ఇదంతా ఎవరి గురించి అంటారా? అదేనండీ.. ఇండియా కూటమి గురించి. ఎన్నికల షెడ్యూల్ రాక ముందు నుంచి తమదే అధికారం అంటూ ప్రచారం చేసుకుంది. తీరా ఫలితాలు వచ్చాక సీన్ రివర్స్ అయింది. బీహారీయులు కోలుకోలేని దెబ్బ కొట్టారు. ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం బీహార్‌లో ‘SIR’ చేపట్టింది. ప్రత్యేక ఓటర్ సర్వే చేపట్టింది. దీనిపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో నానా రాద్ధాంతం చేశారు. బీజేపీతో ఈసీ కుమ్మక్కై ఓట్ల చోరీకి పాల్పడుతున్నారంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. గత వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు.. ఈ ఇష్యూపైనే నడిచింది. విపక్ష పార్టీలన్నీ పార్లమెంట్ లోపల.. బయట నిరసనలు.. ఆందోళనలు నిర్వహించారు. అంతేకాకుండా బీహార్‌లో తేజస్వి యాదవ్‌తో కలిసి రాహుల్ గాంధీ ‘ఓట్ చోర్’ యాత్ర కూడా చేపట్టారు. అధికార పార్టీ ఓట్ల దొంగతనానికి పాల్పడుతుందంటూ ప్రచారం చేశారు. చివరికి ఈ ప్రచారాన్ని ఎవరూ నమ్మలేదని తేలిపోయింది. బీహారీయులంతా ఏకపక్షంగా.. ఎన్డీఏ కూటమికే మద్దతు తెల్పారు. ఎక్కడా కూడా కాంగ్రెస్ ప్రభావం చూపించలేదు. తొలుత కొన్ని చోట్ల ముందంజలో కొనసాగినా.. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా డౌన్ అయిపోయింది. చివరి హస్తం పార్టీకి రిక్తహస్తమే మిగిలింది. ఎక్కడా కూడా ప్రభావం చూపించలేదు. బీహార్ ఫలితాలను బట్టి ఓట్ల చోరీ ప్రచారాన్ని ఎవరూ నమ్మడం లేదని తేలిపోయింది. ఇకనైనా ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టేస్తారా? లేదంటే కొనసాగిస్తారా? అన్నది ముందు ముందు తెలుస్తుంది.

ఆ మూడు రోజుల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు..! జూబ్లీహిల్స్ ఓటమిపై కేటీఆర్ రియాక్షన్..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలకు మించి మెజారిటీ సాధించింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతపై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఏకంగా 24 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ అంశంపై తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఎన్నికల్లో జయ అయాపజయాలు కామన్ అని మా నాయకులు కేసీఆర్ ఎప్పుడూ చెబుతారన్నారు. ఫలితం తమకు కొంత నిరుత్సాహ పరిచిందని.. అయినా తాము కృంగి పోవడం లేదని స్పష్టం చేశారు. సహకారం అందించిన అందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. 407 బూత్‌లలో తమ లోకల్ నాయకులు చాలా కష్టపడ్డారని చెప్పారు. తమ అభ్యర్థి కొత్త అభ్యర్థి చాలా కోట్లాడారన్నారు. తమకు ఓటు వేసిన ఓటర్లకి ధన్యవాదాలు తెలిపారు.

మా పార్టీ బలహీనంగా ఉంది.. మేము ఉన్నంతలో ప్రయత్నం చేశాం..

జూబ్లీహిల్స్ లో మేము ఎప్పుడూ ఒక కార్పొరేటర్ కూడా గెలవలేదు.. స్వాతంత్రం వచ్చినప్పుడు నుంచి ఎప్పుడు గెలవలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తాము ఉన్నంతలో ప్రయత్నం చేశామని.. ఎంఐఎం మద్దతు, డబ్బుతోనే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. ప్రత్యేక పరిస్థితులలో జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగాయని.. తమ పార్టీ అక్కడ బలహీనంగా ఉందన్నారు. ఓటమిని విశ్లేషించుకుంటామని తెలిపారు. ఓల్డ్ సిటీలో కూడా ఏ పార్టీ గెలవదన్నారు. ప్రజా తీర్పును మేము శిరసా వహిస్తాం.. ఎంఐఎం సహకరించడం వల్లే కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. రేవంత్ రెడ్డి ఏం చేశాడని అనుకూలంగా ఆయనకు ఓటేయాలని ప్రశ్నించారు. రెండు పార్టీలు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయి.. కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదన్నారు. దీనిపై తాము ఫిర్యాదు చేస్తామని.. జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై దృష్టిపెట్టామన్నారు. జీహెచ్‌ఎంసీ మేయర్ పదవి గెలుచుకోవడమే మా లక్ష్యమన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జీహెచ్‌ఎంసీలో అనేక చోట్ల డిపాజిట్లు దక్కలేదని గుర్తు చేశారు.

 

Exit mobile version