Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

మరోసారి వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. చరిత్ర సృష్టించిన యువ సంచలనం!

భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీ 2025లో బీహార్ తరపున ఆడుతున్న వైభవ్.. ఈరోజు ఈడెన్ గార్డెన్స్‌లో మహారాష్ట్రపై సెంచరీ చేశాడు. 58 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 100 పరుగులు పూర్తి చేశాడు. అర్షిన్ కులకర్ణి వేసిన 20వ ఓవర్ తొలి బంతికి సిక్స్ కొట్టడం ద్వారా వైభవ్ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 60 బంతుల్లో 108 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. వైభవ్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ బీహార్ మూడు వికెట్ల నష్టానికి 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ సెంచరీతో వైభవ్ సూర్యవంశీ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నమెంట్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డుల్లో నిలిచాడు. 14 సంవత్సరాల 250 రోజుల వయసులో వైభవ్ శతకం నమోదు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ తరపున 35 బంతుల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన టీ20 బ్యాటర్‌గా అతను ఇప్పటికే రికార్డు సృష్టించాడు.

గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష.. నేరుగా ఫీల్డ్ లోకి ఎంట్రీ..!

తెలంగాణ ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్” ఏర్పాట్లను పరిశీలన చేయడానికి ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా ఫ్యూచర్ సిటీ (Future City) లోని సమ్మిట్ వేదికను సందర్శించారు. వేదిక ప్రాంగణంలోనే మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సహా వివిధ విభాగాల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు కీలక దిశానిర్దేశాలు చేశారు. సమ్మిట్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్ల పనులను డిసెంబర్ 5వ తేదీలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే డిసెంబర్ 6వ తేదీన ఎటువంటి లోపాలు లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించడానికి వీలుగా డ్రై రన్ (Dry Run) కండక్ట్ చేయాలని సూచించారు. ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేయాలని, ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఏ ఒక్క చిన్న పొరపాటు జరగకుండా, అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన స్పష్టం చేశారు.

ఆర్మీ జనరల్స్‌పై రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు

ఆర్మీ జనరల్స్‌పై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడాలని ఆర్మీ జనరల్స్‌పై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఆర్మీ ఆఫీసర్లే చెబుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజల రహస్యాలను తెలుసుకునేందుకే సంచార్ సాథీ యాప్‌ తీసుకొచ్చారని తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ ఫోన్‌లను ట్యాప్ చేస్తున్నారని అంటున్నారని. గత 11 సంవత్సరాలుగా భారతీయుల ప్రాథమిక హక్కులు హరించబడ్డాయని ఆరోపించారు. సోమవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయినప్పుడు రేణుకా చౌదరి కుక్కను తీసుకొచ్చి హల్‌చల్ చేశారు. అయితే భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ధ్వజమెత్తారు.

మొంథా తుఫాన్‌ నష్టం రూ.6,352 కోట్లు.. అమిత్‌షాకు లోకేష్‌ నివేదిక..

మొంథా తుఫాన్‌ ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర నష్టాన్నే మిగిల్చింది.. ఇప్పటికే ప్రాథమిక అంచనాలపై కేంద్రానికి నివేదిక చేరగా.. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్‌, హోంమంత్రి అనిత.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు.. మొంథా తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో తుపాను నష్టాలపై పూర్తి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు ఆంధ్రప్రదేశ్‌ ఐటీ, పురపాలక శాఖ మంత్రి నారా లోకేష్. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మంత్రి లోకేష్, రాష్ట్ర హోంమంత్రి అనిత సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తుపాను ప్రభావం, పునరావాస చర్యలు, నష్టపరిహారం అవసరాలపై సమగ్ర వివరాలు లోకేష్ అందించారు. తుపాను వల్ల మొత్తం రూ.6,352 కోట్ల నష్టం జరిగినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నివేదికలో పేర్కొంది.

ఏపీ రాజధానిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్.. ఉత్తర్వులు జారీ..

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైంది ప్రభుత్వం.. దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. మొత్తం ఏడు గ్రామాల్లో భూములను సమీకరించేందుకు సీఆర్‌డీఏ కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్ కుమార్ ఉత్తర్వులను విడుదల చేశారు. 7 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ విడుదల చేశారు.. రాజధాని పరిధిలోని అమరావతి మరియు తుళ్లూరు మండలాల్లో మొత్తం 16,666.57 ఎకరాల భూమిని రెండో విడతలో సమీకరించనున్నారు. ఇందులో పట్టా భూములు 16,562.52 ఎకరాలు కాగా.. అసైన్డ్ భూములు 104.01 ఎకరాలుగా ఉన్నాయి..

రాహుల్‌ గాంధీని ప్రధాని చేసే బాధ్యత మనది.. రాష్ట్రాన్ని సంక్షేమ దిశగా నడిపిస్తున్నాం..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా టీపీసీసీ సమావేశంలో పలు అంశాలపై మాట్లాడారు. పార్టీ నేతలు, కార్యకర్తలకు కీలక సందేశం పంపిస్తూ పలు రాజకీయ, పరిపాలనా అంశాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని మోదీ వైఖరి పై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ.. కాంగ్రెస్ నాయకత్వానికి మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. “గాంధీని హత్య చేసిన పార్టీ బీజేపీ” అని అన్నారు.. నేషనల్ హెరాల్డ్ కేసు పేరుతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను వేధించడం మోదీ ప్రభుత్వ లక్ష్యపూర్వక చర్యే” అని విమర్శించారు. ఓటు చోరీపై పార్లమెంట్‌లో చర్చ జరగకుండా విచ్చలవిడిగా కేసులు తెరపైకి తీసుకువచ్చారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ విలువలను కాపాడే బాధ్యత అందరిదినని, రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు మద్దతుగా నిలబడే తీర్మానం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

కృష్ణా జలాల్లో 512 TMC సాధించిన ఘనత చంద్రబాబుది

ఆంధ్రప్రదేశ్‌లో నీటి పారుదల రంగంలో ప్రభుత్వ మార్పు తర్వాత వేగవంతమైన పనులు ప్రారంభమయ్యాయని నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అధికారంలోకి వచ్చి కేవలం ఆరు నెలలు పూర్తవుతుండగానే సాగునీటి ఎన్నికలు నిర్వహించడం తమ ప్రభుత్వ దృఢ నిశ్చయానికి నిదర్శనమన్నారు. మంత్రి రామానాయుడు విమర్శిస్తూ, గత జగన్ ప్రభుత్వం సమయంలో పులిచింతల, పింఛా, అన్నమయ్య ప్రాజెక్టులు వరదల్లో కొట్టుకుపోయినా సరైన చర్యలు తీసుకోలేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఏర్పాటు అయిన మొదటి 17 నెలల్లోనే ప్రాజెక్టుల భద్రతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నామని తెలిపారు.

విద్యుత్‌ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతిలోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ శాఖపై కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, వినియోగం, వ్యయం తగ్గింపు, పీఎం కుసుమ్, సోలార్ రూఫ్‌టాప్ వంటి పథకాల పురోగతిపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ట్రాన్స్‌మిషన్ నష్టాలను గణనీయంగా తగ్గించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యుత్ కొనుగోళ్ల భారం తగ్గించుకునేందుకు ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ ఎంఓయూలు కుదుర్చుకోవాలని కూడా సీఎం స్పష్టం చేశారు.

మోడీ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రధాని కార్యాలయం పేరు మార్పు..

ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. వలసవాద పాలన అవశేషాలు కూడా మిగలకుండా పలు నిర్ణయాలను తీసుకుంది. తాజాగా ఢిల్లీలోని కొత్త ప్రధాని భవన సముదాయం పేరును మార్చారు. పీఎంఓ పేరును ‘‘సేవా తీర్థ్’’గా మార్చారు. ఇటీవల, గవర్నర్ల అధికార నివాసమైన రాజ్ భవన్ పేరును ‘‘లోక్ భవన్‌’’గా మార్చారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కొత్తగా నిర్మిస్తున్న ప్రధాని కార్యాలయాన్ని ఇకపై ‘‘సేవా తీర్థ్’’గా పిలువనున్నారు. పాలనలో సేవా స్పూర్తిని ప్రోత్సహించడం కోసమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో కేంద్రం దేశవ్యాప్తంగా అనేక ప్రభుత్వ భవనాలు, రోడ్ల పేర్లను మార్చింది. గతంలో ప్రధాని నివాసం ఉన్న మార్గాన్ని ‘‘లోక్ కళ్యాణ్ మార్గ్’’గా మార్చారు. ఢిల్లీలోని రాజ్ పథ్ ను ‘‘కర్తవ్య పథ్’’గా మార్చారు.

పనుల్లో వేగం, నాణ్యత, స్పష్టతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి

ప్రజా భవన్‌లో ఏర్పాటు చేసిన ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ వార్ రూమ్’ ను మంగళవారం డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సందర్శించారు. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌ రూపుదిద్దుకునే ఈ కీలక కేంద్రంలో జరుగుతున్న కార్యక్రమాలను ఆయన సమగ్రంగా పరిశీలించారు. విజన్ డాక్యుమెంట్ రూపకల్పన పురోగతితో పాటు ఈ నెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై భట్టి విక్రమార్క వివరంగా చర్చించారు. సమ్మిట్ విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాటైన పలు కమిటీల పనితీరు, బాధ్యతలు, ఇప్పటి వరకు పూర్తయిన వర్క్ ఫ్లోపై అధికారులతో సమీక్షించారు. ఇన్విటేషన్, హాస్పిటాలిటీ, వేదిక, లాజిస్టిక్స్, ట్రాన్స్‌పోర్ట్, ప్రోగ్రామ్ నిర్వహణ, కల్చరల్ ఈవెంట్స్, కమ్యూనికేషన్, డిజిటల్ మీడియా కమ్యూనికేషన్ వంటి కీలక విభాగాల కమిటీ అధ్యక్షులు, టీమ్ సభ్యులతో ప్రత్యేక భేటీలు నిర్వహించిన డిప్యూటీ సీఎం, ప్రతి విభాగంలో జరుగుతున్న పనిని విడివిడిగా సమీక్షించారు.

సమస్యలపై రైతులు నేరుగా 1967కు కాల్ చేయొచ్చు

ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 1,77,934 మంది రైతుల నుంచి 11.93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంను ప్రభుత్వం కొనుగోలు చేసిందని.. రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఇప్పటి వరకు రూ. 2,830 కోట్లు జమ చేసినట్లు ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.రైతులు ధాన్యం విక్రయ ప్రక్రియలో ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు.. విజయవాడ కానూరు సివిల్ సప్లై భవన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ధాన్యం కొనుగోలు సంబంధిత ఫిర్యాదుల కోసం 1967 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు.ఈ హెల్ప్‌లైన్ సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. ధాన్యం రిజిస్ట్రేషన్ సమస్యలు, టోకెన్ ఆలస్యం, ఆర్ఎస్కే/మిల్లులో తూకం సమస్యలు, ఎఫ్‌టిఒ పెండింగ్, రవాణా, గోనె సంచుల కొరత, లేదా ఏదైనా కేంద్రంలో ధాన్యం కొనుగోలు ఆగిపోవడం వంటి సమస్యలపై, రైతులు నేరుగా 1967కు కాల్ చేయొచ్చని మంత్రి స్పష్టం చేశారు.

 

Exit mobile version